శ్రీశైల దేవస్థానం: సకాలంలో ఆయా పనులను పూర్తి చేయాలని ఈ ఓ ఆదేశించారు. దేవస్థాన పరిపాలనా సంబంధిత అంశాలపై కార్యనిర్వహణాధికారి లవన్న మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పరిపాలనా భవనం లోని సమావేశ మందిరం లో జరిగిన ఈ సమావేశం లో అన్ని విభాగాల అధిపతులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.
ప్రతి నెలలో కూడా ఈ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత నెలలో 10వ తేదీన
సమీక్షా సమావేశం జరిగింది . ఈ సమీక్షా సమావేశంలో దేవస్థాన వివిధ విభాగాలు
ఆయా నెలలో కనబరచిన పనితీరును పరిశీలిస్తారు. వచ్చే నెల రెండవ వారంలో తదుపరి
సమీక్ష జరుగుతుంది.
ఈ రోజు జరిగిన సమావేశంలో కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ అన్ని
విభాగాధిపతులు కూడా వారి క్రిందిస్థాయి సిబ్బంది నిర్వర్తించాల్సిన విధుల పట్ల పూర్తి అవగాహన
కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.అదేవిధంగా సిబ్బంది అందరు కూడా ప్రతీరోజు కూడా ముఖ ఆధారిత హాజరును నమోదు చేయాలన్నారు. ముఖ ఆధారిత హాజరు అనుసరించే వేతనాల బిల్లు రూపొందించడం జరుగుతుందన్నారు.
పరిపాలనాపరంగా తాము సందర్భానుసారంగా ఆయా తనిఖీలను ( ఇన్‌స్పెక్షన్లు) చేయడం జరుగుతోందని, ఆయా ఇన్‌స్పెక్షన్లలో తీసుకున్న నిర్ణయాలకనుగుణంగా చేపట్టిన చర్యలను ( యాక్షన్ టేకెన్ రిపోర్టులను) సంబంధిత అధికారులందరూ ప్రతీవారం కార్యాలయానికి సమర్పించాలన్నారు ఈ ఓ .అనంతరం విభాగాల వారిగా సమీక్ష నిర్వహించారు. పరిపాలన, గణాంక, రెవెన్యూ, ఇంజనీరింగ్,
వసతి, ఆలయం, పారిశుద్ధ్యం, అన్నప్రసాదవితరణ, ప్రచురణలు, ప్రచారం, ప్రసాదాల తయారీ,
ఉద్యానవన విభాగాలను సమీక్షించారు.ప్రతి విభాగాధికారి కూడా వారి వారి విభాగాలలో ఎప్పటికప్పుడు జమాఖర్చులను
పరిశీలిస్తుండాలన్నారు. దీనివలన దేవస్థానం రాబడి వ్యయాలపై విభాగాధిపతులందరికీ అవగాహన
కలుగుతుందన్నారు. వర్షాకాలం ముగిసేలోగా క్షేత్రపరిధిలో విస్తృతంగా మొక్కలను
నాటాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు.
ఇంజనీరింగ్ విభాగాన్ని సమీక్షిస్తూ సమీప భవిష్యత్తులో చేపట్టవలసిన పనుల
గురించి చర్చించారు ఈ ఓ. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంజనీరింగ్ పనులలో పూర్తి నాణ్యతను
పాటించాలన్నారు. అదేవిధంగా సకాలంలో ఆయా పనులను పూర్తి చేయాలన్నారు.