
శ్రీశైల దేవస్థానం: ఏ చిన్నపనిలో కూడా నాణ్యతపరంగా రాజీ పడకూడదని ఈ ఓ ఆదేశించారు. కార్యనిర్వహణాధికారి లవన్న సోమవారం సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.హేమారెడ్డి మల్లమ్మ మందిరం ఎదురుగా నిర్మిస్తున్న సప్తగోకులం, గణేశసదనం, ధర్మకాట, శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో వసతిగృహాల నిర్మాణ పనులను పరిశీలించారు. హేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్ద సుమారు 40 అడుగుల విస్తీర్ణములో సర్కిల్‌గా (గుండ్రంగా) సప్తగోకులం నిర్మించబడుతోంది. దాతల సహకారంతో ఈ నిర్మాణం జరుగుతోంది.
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ సప్తగోకులంలో గోవులు సులభంగా మేత మేసేందుకు, నీరు త్రాగేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. భక్తులు సౌకర్యవంతంగా గోవును పూజించేవిధంగా సప్తగోకులాన్ని తీర్చిదిద్దాలన్నారు.
సప్తగోకులం చుట్టు కూడా పచ్చికబయలు (ల్యాండ్ స్కేపింగ్ గార్డెనింగ్) ఏర్పాటు చేయాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు. అదేవిధంగా సప్తగోకులపరిసరాలలో దేవతా వృక్షాలను, సుందరీకరణ మొక్కలను పెంచేందుకు చర్యలు చేపట్టాలని కూడా అన్నారు. భక్తులు కూర్చునేందుకు వీలుగా సప్తగోకులం పరిసర ప్రాంతాలలో సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు.
తరువాత గణేశసదనములోని ఆయా బ్లాకులలోని గదులను ఈ ఓ పరిశీలించారు. అదేవిధంగా అక్కడి ఉద్యాన వన పనులను కూడా పరిశీలించారు. గణేశ సదనం ప్రాంగణములో మరింత విస్తీర్ణములో పచ్చిక బయళ్ళును ( ల్యాండ్ స్కేపింగ్) ఏర్పాటు చేయాలన్నారు. అక్కడ ఏర్పాటు చేస్తున్న కౌంటర్లు, కార్యాలయపు ప్రదేశం, రెస్టారెంట్‌ను కూడా పరిశీలించి పలు సూచనలను చేశారు.అనంతరం నక్షత్రవనంలో ప్రహరిగోడ నిర్మాణాన్ని పరిశీలించారు. గణేశ సదనానికి సమీపంలోనే ఈ నక్షత్రవనం ఏర్పాటు అవుతోంది. ప్రహరీగోడ నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రహరీగోడ నిర్మాణం పూర్తయిన వెంటనే నక్షత్ర వనంలో ఆయా మొక్కలను నాటాలన్నారు. ఈ వృక్షాలన్నింటిని కూడా క్రమపద్దతిలో నాటాలని ఆదేశించారు.తరువాత టూరిస్ట్ డార్మెటరీలకు ఎదురుగా ( భారత్ పెట్రోల్ బంకు సమీపంలో) నిర్మించబడిన దర్శకాటను పరిశీలించారు. దర్శకాట పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
అనంతరం శ్రీశైలం ప్రాజెక్టులో సిబ్బంది వసతిగృహాలను ఈ ఓ పరిశీలించారు.
మొత్తం 3 నమూనాలలో అనగా 1 – బి హెచ్ కె స్మాల్, 1 – బిహెచ్ కె బిగ్ మరియు 2 – బిహెచ్ కె బిగ్ పేర్లతో వీటిని దేవస్థానం నిర్మిస్తున్నది.1 – బి హెచ్ కె స్మాల్ నందు 108 గృహాలు, 1 – బి హెచ్ కె బిగ్ నందు 104 గృహాలు, 2 బిహెచ్ కె బిగ్ నందు 81 గృహాలుగా మొత్తం 293 గృహాలు నిర్మించబడుతున్నాయి. కార్యనిర్వహణాధికారివారు మాట్లాడుతూ ఈ నిర్మాణపు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.అదేవిధంగా నిర్మాణంలో పూర్తిగా నాణ్యత ప్రమాణాలను పాటించాలని, ఏ చిన్నపనిలో కూడా నాణ్యతపరంగా రాజీ పడకూడదని అధికారులకు సూచించారు.ఈ గృహ నిర్మాణపు పనులు పూర్తి కావడాన్ని అనుసరించి దేవస్థానం సిబ్బందిని సున్నిపెంటకు తరలించడం జరుగుతుంది.
ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు వి. రామకృష్ణ, మురళీధర్‌రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ( ఐ/సి) పి. చంద్రశేఖరశాస్త్రి, నీటిసరఫరా విభాగం అసిస్టెంట్ ఇంజనీరు రాజేశ్వరరావు, సివిల్ విభాగపు అసిస్టెంట్ ఇంజనీర్లు భవన్‌కుమార్, ప్రణయ్, రాజారావు, చిరంజీవి, ప్రచురణల విభాగం ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.