ఘనఘనంగా శాకంభరీ ఉత్సవం

 శ్రీశైల దేవస్థానం:ఆషాఢపౌర్ణమి సందర్భంగా  సోమవారం  శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి శాకంభరీ ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆకుకూరలు, కూరగాయలు, వివిధ రకాల ఫలాలతో శ్రీభ్రమరాంబాదేవి వారిమూలమూర్తిని, ఉత్సవమూర్తిని, ఆలయ ప్రాంగణంలోని రాజరాజేశ్వరి అమ్మవారికి, అన్నపూర్ణాదేవి అమ్మవారికి, గ్రామదేవత అంకాళమ్మ అమ్మవారికి శాకాలంకరణ, ఉత్సవ సంబంధి పూజాదికాలు జరిపారు.

ఉత్సవంలో భాగంగానే అమ్మవారిని  కూరగాయలతో అలంకరించారు.ఆలయప్రాంగణాన్ని పలురకాల ఆకుకూరలతో అలంకరించారు.ఇందుకోసం అవసరమైన వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, వివిధ రకాల ఫలాలను తెప్పించారు.

వంగ, బెండ, దొండ, కాకర, చిక్కుడు, గోరుచిక్కుడు, మునగ, సొర, బీర, గుమ్మడి బంగాళదుంప, కందదుంప, క్యాప్సికమ్ (బెంగుళూరు మిరప), క్యాబేజీ, బీన్స్, క్యారెట్, అరటి మొదలైన వివిధ రకాల కూరగాయలు, తోటకూర, పాలకూర, మెంతికూర, చుక్కకూర, మొదలైన పలురకాల ఆకుకూరలు, కరివేపాకు, కొత్తిమీర లాంటి సుగంధ పత్రాలు, కమల, బత్తాయి, ఆపిల్, అరటి, పనస మొదలైన పలురకాల ఫలాలు, నిమ్మకాయలు, బాదంకాయలు మరియు పచ్చిశనగలు మొదలైన వాటిని ఈ ఉత్సవాని కోసం  తెప్పించారు.

 ఈ ఉత్సవంలో భాగంగా ఆగమశాస్త్రానుసారంగా శ్రీభ్రమరాంబాదేవివారికి ఉత్సవ సంబంధి పూజాదికాలు జరిపారు.

కార్యక్రమం లో ముందుగా అర్చక స్వాములు, వేదపండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ఉత్సవ సంకల్పాన్ని పఠించారు.

సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, అతివృష్టి, అనావృష్టి నివారించబడాలని, అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి నిరోధించబడాలని, జనులందరు సుఖసంతోషాలతో ఉండాలని ఈ సంకల్పములో కోరారు.

తరువాత ఉత్సవాలు నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ జరిపారు. ఉత్సవంలో భాగంగానే శాకంభరీగా అలంకరించిన  అమ్మవారి ఉత్సవమూర్తికి కూడా విశేషంగా షోడశోపచారపూజలు జరిపారు.

పూర్వం హిరణ్యాక్షుని వంశానికి చెందిన దుర్గముడు అనే రాక్షసుడు తన తపశ్శక్తితో వేదాలను అంతర్థానం చేశాడు. దాంతో యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి. ఈ కారణంగా కరువుకాటకాలతో తీవ్రక్షామం ఏర్పడింది. అప్పుడు మహర్షులందరూ ఆదిపరాశక్తిని గురించి తపస్సు చేశారు. ఆ తపస్సుకు పరాశక్తి ప్రసన్నురాలై లోకరక్షణకోసం దుర్గముడిని సంహరించి, వేదాలను రక్షించి వైదిక కర్మలను పునరుద్ధరింపజేసింది.

ఈ సందర్భంలోనే జగన్మాత తన నుండి వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, ఫలాలు మొదలైన శాకాలను సృష్టించి క్షామాన్ని నివారించింది. ఆ విధంగా అవతరించిన అమ్మవారి స్వరూపమే శాకంభరీదేవి.

 ఆషాఢపౌర్ణమిరోజున అమ్మవారిని శాకాలతో అర్చించడం వలన అతివృష్టి, అనావృష్టి నివారించబడి, సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పాడిపంటలు బాగాపండుతాయని, కరువుకాటకాలు నివారించబడుతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ప్రతిసంవత్సరం ఎంతో శాస్త్రోక్తంగా అమ్మవారికి ఈ కైంకర్యాన్ని జరిపించడం ఆనవాయితి. ఈ కార్యక్రమం లో అర్చక స్వాములు, వేదపండితులు, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, పర్యవేక్షకురాలు సాయికుమారి తదితరులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.