శ్రీశైల దేవస్థానం:శ్రీశైలక్షేత్ర వైభవంపై నిర్వహిస్తున్న జాతీయసదస్సులో శనివారం పలువురు ,విశ్వవిద్యాలయాల, కళాశాలల అధ్యాపకులు, పండితులు, పరిశోధక విద్యార్థులు పలు అంశాలపై ప్రసంగించారు. శుక్రవారం ప్రారంభమైన ఈ సదస్సు ఆదివారంతో ముగియనున్నది.
శనివారం ఉదయం, మధ్యాహ్నం జరిగిన రెండవ సెషన్, మూడవ సెషన్ కార్యక్రమాలకు దేవాదాయశాఖ అర్చక అకాడమీ డైరెక్టర్ డా. వేదాంతం రాజగోపాల చక్రవర్తి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీశైలమహాక్షేత్రం గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధమైందన్నారు. తరతరాలుగా మన ఆధ్యాత్మిక గమనాన్ని ఈ క్షేత్రం ప్రభావితం చేస్తున్నదన్నారు. ఎందరో సిద్ధులకు, యోగులకు ఆవాసంగా ఉన్న ఈ క్షేత్రం సిద్ధక్షేత్రంగా ప్రసిద్ధమైందన్నారు.శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అన్న పురాణవచనాన్ని బట్టి కేవలం ఈ పర్వత శిఖరాన్ని చూసినంత మాత్రమే పునర్జన్మ ఉండదన్నారు.పౌరాణికంగా ఎంతో ప్రశస్తి కలిగి శ్రీశైల మహాక్షేత్రం క్షేత్రపరంగా కూడా ప్రసిద్ధి పొందిందన్నారు. ఎందరో రాజులు, చక్రవర్తులు, రాణులు, సామాన్యులు సైతం శ్రీశైలేశుని సేవించి, దానిని తమ శాసనాలలో ఎంతో గొప్పగా చెప్పుకున్నారన్నారు.సాహిత్యపరంగా ఎన్నో పురాణాలు ఈ క్షేత్రమహత్యాన్ని ఎంతగానో వివరించాయన్నారు. అదేవిధంగా మరెన్నో సంస్కృత, తెలుగు, కన్నడ, తమిళ , మరాఠి సాహిత్యాలలో శ్రీశైలక్షేత్రం ఎంతగానో ప్రస్తావించబడిందన్నారు.
ఈ నాటి కార్యక్రమం లో డా. ఎం. మహంతయ్య, అసోసియేట్ ప్రొఫెసర్, తారా ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, సంగారెడ్డి , పాల్కురికి సోమనాథుని రచనలలో శ్రీశైల వైభవం అనే అంశంపైన, డా. మోహనశ్రీ, ప్రిన్సిపాల్, కన్యకాపరమేశ్వరీ కాలేజి, చెన్నై, తమిళ తైవారం – శ్రీశైల వైశిష్ట్యం, డా. చక్రధరస్వామి, శాతవాహన యూనివర్శిటీ, కరీంగనగర్ వారు పండితారాధ్యచరిత్రలో శ్రీశైల చరిత్రలో ప్రశంస, డా. వనిత, వైస్ ప్రిన్సిపాల్, కన్యకాపరమేశ్వరీ కాలేజి, చెన్నై , ఆంగ్లంలో “BLESS AND BLISS OF SHRI BHRAMARAMBA MALLIKARJUNA TEMPLE” అనే అంశంపై
ప్రముఖ పాత్రికేయుడు డా. రెంటాల జయదేవ్, హైదరాబాద్ శ్రీశైలక్షేత్ర మహిమను తెలియజెప్పిన చలనచిత్రాలను గురించి పత్రసమర్పణ చేశారు.
దేవస్థానం ఉపప్రధానార్చకులు, దేవస్థానం ఆగమపాఠశాల ప్రిన్సిపాల్, ఎం. శివశంకరయ్య, శ్రీశైల దేవస్థానం – విభూతి మహిమ, రుద్రాక్షమహిమ, పంచాక్షరీ మంత్ర మహిమ గురించి పి.ఎం.నాగరాజు శాస్త్రి, ముఖ్య అర్చకులు శ్రీశైల ఆలయంలో జరిగే ఉత్సవాల గురించి వివరించారు.
స్థానిక తెలుగు విశ్వవిద్యాలయ పరిశోధకులు పి. బాలునాయక్, ఇష్టకామేశ్వరి ఆలయంపై, జి. సురేంద్రనాథ్, శ్రీశైలక్షేత్ర భౌగోళిక పరిస్థితులు చారిత్రక చిత్రం , ఎం. శంకరనారాయణ పంచమఠాల వైభవం, శ్రీమతి ఎస్. ఇంద్రజ, శ్రీశైల ఆలయ వాస్తు శిల్పకళావైభవంపై, శ్రీమతి జె. సరస్వతి శ్రీశైల ఆలయంలో పూజావిధానాలపై పత్ర సమర్పణ చేశారు.
కార్యక్రమం చివరలో ఈ రోజు సదస్సులో పత్ర సమర్పణ చేసిన వారికి, ఆయా అంశాలపై ప్రసంగించిన వారిని శ్రీస్వామివారి శేషవస్త్రం, ప్రసాదం, స్వామిఅమ్మవార్ల జ్ఞాపికతో సత్కరించారు.