
శ్రీశైల దేవస్థానం:గంట సమయం ముందు వరకు కూడా ఆన్లైన్ లో ఆర్జితసేవా, శ్రీస్వామివారి స్పర్శదర్శనం టికెట్లు పొందే అవకాశం ఇది.
మే 1వ తేదీ నుంచీ అన్ని ఆర్జితసేవలు, శ్రీస్వామివార్ల స్పర్శదర్శనం టికెట్లు ఆన్లైన్ ద్వారా మాత్రమే జారీ వుతున్నాయి.
జూన్ మాసానికి సంబంధించిన ఆర్జితసేవలు, శ్రీస్వామివార్ల స్పర్శదర్శనం టికెట్లు మే 25వ తేదీ నుంచే ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు.
ప్రతీ నెల కూడా 25వ తేదీన, రాబోయే మాసానికి సంబంధించిన టికెట్లు ఆన్లైన్ లో విడుదల చేస్తారు.
ఇప్పటికే దేవస్థానం వెబ్ సైట్ – ‘www.srisailadevasthanam.org’ ద్వారా భక్తులు ఆయా టికెట్లను ముందస్తుగా పొందుతున్నారు.
తదుపరి వారాంతపు రోజులు, సెలవురోజులు, సోమవారం లాంటి పర్వదినాలలో ఆన్లైన్ ద్వారా టికెట్లు దొరకని భక్తులు టికెట్ అందుబాటులో ఉంటే , మంగళ, బుధ, గురు, శుక్రవారాలలో ఆయా టికెట్లను పొందవచ్చు.
భక్తుల కోరిక మేరకు, భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా ఆర్జితసేవల ప్రారంభ సమయానికంటే ఒక గంట ముందు వరకు కూడా భక్తులు ఆన్లైన్లో టికెట్లను పొందే అవకాశం ఉంది.
శ్రీస్వామివార్ల గర్భాలయ అభిషేకం, శ్రీస్వామివారి స్పర్శదర్శనం, సామూహిక అభిషేకాలు, కుంకుమార్చనలు, గణపతి హోమం, రుద్రహోమం – మృత్యుంజయ హోమం, చండీహోమం, శ్రీవల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం, శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణం, శ్రీ వృద్ధమల్లికార్జునస్వామివార్ల అభిషేకం, సర్పదోష నివారణ పూజ మొదలైన ఆర్జితసేవాటికెట్లను ఆయా సేవల ప్రారంభ సమయానికంటే ఒక గంట సమయం ముందు వరకు కూడా లభ్యతను బట్టి ఆన్లైన్లో ఆయా టికెట్లను భక్తులు పొందవచ్చు.
ఆయా సేవాటికెట్లు పొందినవారు విధిగా ఆన్లైన్ ద్వారా పొందిన టికెట్ కాపీని ( హార్డుకాపీ), మరియు ఆధార్ కార్డు ఒరిజినల్ లేదా జిరాక్స్ కాపీని తప్పని సరిగా తెచ్చుకోవలసివుంటుంది.
ఆయా సేవాటికెట్లను స్కానింగ్ జరిపి సంబంధిత టికెట్లను ఆధార్ గుర్తింపు కార్డుతో సరిచూసిన తదుపరే భక్తులను ఆయా ఆర్జితసేవలకు అనుమతిస్తారు.
కాబట్టి ఆర్జితసేవలను జరిపించుకునే భక్తులు ఆయా ఆర్జితసేవలు, స్పర్శ దర్శన టికెట్లను లభ్యత బట్టి తమ శ్రీశైలయాత్రను రూపొందించుకోవలసిందిగా దేవస్థానం సూచన.
అయితే రూ. 150/-ల రుసుముతో శీఘ్రదర్శనం, రూ. 300/-ల రుసుముతో అతిశీఘ్రదర్శనం టికెట్లను ఆన్లైన్ తో పాటు కరెంట్ బుకింగ్ ద్వారా కూడా పొందవచ్చు. ఈ టికెట్లలో 30శాతం టికెట్లు ఆన్లైన్ లో , తక్కిన 70 శాతం టికెట్లు కరెంట్ బుకింగ్ ద్వారా ఇస్తున్నారు.
అదేవిధంగా వారంలో నాలుగు రోజులపాటు , మంగళ, బుధ, గురు, శుక్రవారాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు భక్తులకు ఉచితంగా కల్పిస్తున్న శ్రీస్వామివార్ల స్పర్శదర్శనం యథావిధిగా కొనసాగుతున్నది.
ఇక ప్రతీరోజు ఉదయం గం. 4.30లనుంచి ప్రారంభమయ్యే సర్వదర్శనం ( ఉచిత దర్శనం) యథావిధిగా కొనసాగుతున్నది.