
శ్రీశైల దేవస్థానం:లోక కల్యాణం కోసం శ్రీ భ్రమరాంబాదేవి వారికి మంగళవారం సంప్రదాయ పద్ధతిన వార్షిక కుంభోత్సవం జరిగింది.ప్రతీ సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి తరువాత అమ్మవారికి సాత్విక బలిని సమర్పించేందుకు ఈ విశేష ఉత్సవం నిర్వహించడం సంప్రదాయం.
ఈ ఉత్సవంలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నపురాశి మొదలైనవి అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించారు.
ఈ ఉదయం జరిగిన కార్యక్రమం లో కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరూపాక్షయ్యస్వామి, శ్రీమతి జంగం సుజాతమ్మ, శ్రీమతి ఎం. విజయలక్ష్మీ శ్రీమతి బి. రామేశ్వరి, శ్రీమతి ఎం. లక్ష్మీ సావిత్రమ్మ, మేరాజోత్ హనుమంతునాయక్, ఓ. మధుసూదన్‌రెడ్డి, శ్రీమతి సూరిశెట్టి మాధవీలత, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు పాల్గొన్నారు.
మొత్తం మీద ఈ ఉత్సవంలో దాదాపు నాలుగువేల గుమ్మడికాయలు, రెండు వేలకు పైగా కొబ్బరికాయలు, సుమారు లక్షకు పైగా నిమ్మకాయలు , వండిన అన్నం (కుంభం) అమ్మవారికి సాత్త్యికబలిగా సమర్పణ ఓ ప్రత్యేకం.
ఈ ఉత్సవంలో అధిక పరిమాణంలో పసుపు, కుంకుమలను అమ్మవారికి సమర్పణ ప్రత్యేకం. ఈ పసుపు,కుంకుమల సమర్పణకే “శాంతి ప్రక్రియ” అని పేరు.
ఇక స్థానిక వ్యాపార సంఘం వారు గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, వండిన అన్నం అమ్మవారికి సాత్విక బలిగా సమర్పిస్తున్నారు.ఈ ఉత్సవానికి సాత్వికబలికి గాను పలువురు భక్తులు నిమ్మకాయలను, గుమ్మడికాయలను, విరాళంగా సమర్పించారు.
కుంభోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం ప్రాతఃకాల పూజల అనంతరం శ్రీ అమ్మవారికి ఆలయ అర్చకులు నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర కుంకుమ పూజలను, పారాయణలను నిర్వహించారు. ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్నీ అమ్మవారికి ఏకాంతంగా జరిగాయి.తరువాత అమ్మవారి ఆలయంలో రజకునిచేత ప్రత్యేక ముగ్గు వేయించి శ్రీ చక్రం వద్ద విశేషపూజలు చేసారు.
తరువాత సాత్వికబలికి సిద్ధం చేసిన కొబ్బరికాయలు, గుమ్మడికాయలకు పూజాదికాలు జరిపారు. అనంతరం అమ్మవారికి కొబ్బరికాయలు, గుమ్మడికాయలు సమర్పించారు.
ఈ మొదటి విడత సాత్విక బలి సమర్పణకు తరువాత హరిహరరాయగోపుర ద్వారం వద్ద మహిషాసురమర్ధని అమ్మవారికి (కోటమ్మవారికి) ప్రత్యేక పూజాదికాలను జరిపించి సాత్యికబలిగా కొబ్బరికాయలు, గుమ్మడికాయలు సమర్పించారు.
తరువాత ఈ ఉత్సవాలలో భాగంగానే సాయంకాలం శ్రీమల్లికార్జునస్వామివారికి ప్రదోషకాల పూజల అనంతరం అన్నాభిషేకం వుంటుంది.
స్వామివార్ల పూజల అనంతరం అమ్మవారి ఆలయానికి ఎదురుగా సింహమండపం వద్ద వండిన అన్నం కుంభరాశిగా వేస్తారు.తరువాత సంప్రదాయాన్ని అనుసరించి స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతిని సమర్పించడంతో ఉత్సవంలోని ప్రధాన ఘట్టం ప్రారంభమవుతుంది. తరువాత రెండో విడత సాత్విక బలి ప్రత్యేకం.
చివరగా అమ్మవారికి ప్రత్యేక పూజలను చేసి పిండివంటలతో అమ్మవారికి మహానివేదన ప్రత్యేకం.
కాగా ఈ ఉత్సవంలో భాగంగానే గ్రామదేవత అంకాళమ్మకు కూడా ఈ ఉదయం ప్రత్యేక పూజలను నిర్వహించారు.