శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపటితో ( 21న ) ముగియనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకుగాను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పలు ప్రభుత్వశాఖ అధికారులు, వారి సిబ్బంది ప్రత్యేక విధులు నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న సోమవారం దేవస్థానం కార్యాలయ భవనం లోని సమావేశ మందిరం లో పలు ప్రభుత్వశాఖ అధికారులతో సమావేశమై వారికి ధన్యవాదాలు తెలియజేశారు.
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ , జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఉత్సవాల నిర్వహణకు ఎంతగానో దిశానిర్దేశం చేశారన్నారు. ఎప్పటికప్పుడు తగు సూచనలను చేస్తూ ఉత్సవాలు విజయవంతమవ్వడంలో ప్రముఖ పాత్ర పోషించారన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల అధికారులు, వారి సిబ్బంది ఉత్సవాలలో ప్రత్యేక విధులకు హాజరయ్యారన్నారు. అన్నిశాఖల అధికారులందరు కూడా పరస్పర సమన్వయం తో విధులు నిర్వహించి ఉత్సవాల నిర్వహణలో ప్రశంసనీయపాత్రను పోషించారన్నారు. అందరి సమిష్టి కృషివలనే ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతున్నామన్నారు.
దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యులు కూడా ఉత్సవాల నిర్వహణలో పూర్తి సహాయ సహకారాలను అందించారన్నారు ఈఓ .
సమావేశంలో పలువురు అధికారులు మాట్లాడుతూ ఉత్సవాలలో ప్రత్యేక విధులు నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. భక్తులకు సేవలు అందించే అవకాశం రావడం తమకు ఎంతగానో ఆనందం కలిగిస్తుందన్నారు.
చివరగా ఉత్సవాలలో ప్రత్యేక విధులు నిర్వహించిన అధికారులందరికీ కార్యనిర్వహణాధికారి శ్రీస్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదాలను అందజేశారు.