ఆగమశాస్త్రానుసారం శ్రీశైల దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రిని పురస్కరించుకని నవాహ్నిక దీక్షతో పదకొండు రోజుల పాటు (11.02.2023 నుండి 21.02 2023 వరకు) తలపెట్టిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి.
ఈ ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు ఆగమశాస్త్రానుసారం నిర్వహించారు.
ప్రారంభపూజలలో ధర్మకర్తల మండలి అధ్యక్షులురెడ్డివారి చక్రపాణిరెడ్డి దంపతులు, కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి ఎం. విజయలక్ష్మి , ఓ. మధుసూదన్‌రెడ్డి, శ్రీమతి సూరిశెట్టి మాధవీలత తదితరులు పాల్గొన్నారు.
యాగశాల ప్రవేశం :
ఉత్సవ నిర్వహణలో భాగంగా ముందుగా కార్యనిర్వహణాధికారి, స్థానాచార్యులు, అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు సంప్రదాయబద్ధంగా ఆలయప్రాంగణంలోని స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు.
వేదస్వస్తి:
ఆలయ ప్రవేశం చేసిన వెంటనే వేదపండితులు చతుర్వేద పారాయణలు చేసి వేదస్వస్తి నిర్వహించారు.
శివసంకల్పం :
వేదపఠనం అయిన వెంటనే స్థానాచార్యుల ( అధ్యాపకులు) వారు లోకక్షేమాన్నికాంక్షిస్తూ బ్రహ్మోత్సవ సంకల్పాన్ని పఠించారు. దీనికే శివసంకల్పం అని పేరు.ఈ సంకల్పంలో దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన, ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు సంకల్ప పఠనం చేశారు.
పుణ్యాహవచనం :
గణపతిపూజ తరువాత పుణ్యాహవచనం జరిగింది. వృద్ధి, అభ్యుదయాల కోసం ఈ పుణ్యహవచనం చేశారు.
చండీశ్వరపూజ :
సంకల్ప పఠనం తరువాత చండీశ్వరపూజ జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని ఆధ్వర్యంలో, క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామి పర్యవేక్షణలో, శివపరివార దేవతలలో ఒకరైన చండీశ్వరుని నాయకత్వంలో నిర్వహిస్తారని సంకల్పం.అందుకే యాగశాల ప్రవేశం తరువాత చండీశ్వరుని ప్రత్యేకంగా పూజాదికాలు జరపించడం సంప్రదాయం.కంకణ పూజ, కంకణధారణ ,చండీశ్వరపూజలు చేసారు.
ఋత్విగ్వరణం :
తరువాత కంకణాలకు (రక్షాబంధనాలకు) శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిగాయి. ధరర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారి కంకణధారణ తరువాత ఋత్విగ్వరణం జరిపారు. బ్రహ్మోత్సవాలలో ఆయా వైదిక కార్యక్రమాలు నిర్వహించమని ఋత్వికులను ఆహ్వానిస్తూ వారికి దీక్షావస్త్రాలను అందజేసే కార్యక్రమానికే ఋత్విగ్వరణం అని పేరు.
అఖండస్థాపన :
ఋత్విగ్వరణం తరువాత అఖండదీపస్థాపన చేసారు. అనంతరం వాస్తుపూజ జరిగింది. తరువాత వాస్తు హోమం జరిగింది.
రుద్రకలశస్థాపన :
వాస్తు హోమం తరువాత మండపారాధన చేసి రుద్ర కలశస్థాపన చేసారు. కలశస్థాపన తరువాత కలశార్చన , తరువాత పంచావరణార్చనలు జరిగాయి.
అనంతరం లోకకల్యాణం కోసం జపానుష్ఠానాలు చేసారు.
Post Comment