గోవులన్నింటికీ శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా పౌష్టికాహారాన్ని అందించాలి-రెడ్డివారిచక్రపాణిరెడ్డి
శ్రీశైలదేవస్థానం: ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి సోమవారం గోశాలను
పరిశీలించారు.ఈ పరిశీలనలో ధర్మకర్తల మండలి సభ్యులు జి.నరసింహారెడ్డి, మేరాజోత్ హనుమంతునాయక్, శ్రీమతి ఎం. విజయలక్ష్మి ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజులు పాల్గొన్నారు.
ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ గో సంరక్షణ నిపుణులతో సంప్రదించి గో సంరక్షణ నిర్వహణలో వారి సూచనలు – సలహాలను పొందాలన్నారు.ముఖ్యంగా గోశాలలోని గోవులను గుంపులుగా వర్గీకరించి, తదనుగుణంగా గోవులను సంరక్షిస్తుండాలన్నారు. గోవుల వయస్సు, వాటి శారీరకస్థితి, ఆరోగ్యస్థితి మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ వర్గీకరణను జరపాలన్నారు.అదేవిధంగా గోశాలలో బలహీనపడిన గోవులు, జబ్బుపడే గోవుల పట్ల కూడా ఎప్పటికప్పడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
గోవులన్నింటికీ శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా పౌష్టికాహారాన్ని అందించాలన్నారు రెడ్డివారిచక్రపాణిరెడ్డి. అదేవిధంగా గోశాలలో శుచీ శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎప్పటికప్పుడు గోశాల శుభ్రపరిచేందుకు చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.గోవులలో అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వాటికి కాలానుగుణంగా టీకా మందులను వేయించాలని సూచించారు. గోవు సంరక్షణకు అవసరమైన ఔషధాలన్నింటిని సిద్ధంగా వుంచుకోవాలన్నారు.
ఈ పరిశీలనలో ప్రజాసంబంధాల అధికారి, గో సంరక్షణశాల ఇంచార్జి టి. శ్రీనివాసరావు, గోశాల పర్యవేక్షకులు రంగస్వామి, గోశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post Comment