
శ్రీశైల దేవస్థానం:మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీ నుండి నిర్వహిస్తున్న సంక్రాంతిబ్రహ్మోత్సవాలు బుధవారం నాడు ఘనఘనంగా ముగిసాయి. ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా ఈ రోజు ఉదయం శ్రీస్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి.
అశ్వవాహనసేవ:
ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు అశ్వవాహనసేవ నిర్వహించారు. ఈ సేవలో శ్రీస్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబుచేయించి ప్రత్యేక పూజాదికాలు చేసారు. తరువాత ఆలయప్రాంగణంలో ప్రాకారోత్సవం జరిగింది.
పుష్పోత్సవం- శయనోత్సవం:
ఈరోజు సాయంకాలం ఆలయప్రాంగజణంలోని అక్కమహాదేవి అలంకారమండపం వద్ద శ్రీ స్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం జరిగింది.
ఈ పుష్పోత్సవంలో శ్రీస్వామిఅమ్మవార్లకు కాగడాలు, ఎర్రగులాబీలు, తెల్లగులాబీలు, పసుపు గులాబీలు, ఎర్రమందారం, తెల్లమందారం, ముద్దమందారం, నందివర్ధనం, గరుడవర్ధనం, కనకాంబరాలు, సుగంధాలు (లిల్లీపూలు), పసుపుచేమంతి, ఊదాచేమంతి, తెల్లచేమంతి, ఎర్రగన్నేరు, తెల్లగన్నేరు, దేవగన్నేరు, ముద్దగన్నేరు, మల్లెలు, మొదలైన 35 రకాలకుపైగా పుష్పాలు, బిల్వం, మరువం, మాచిపత్రి, మొదలైన పలు రకాల పత్రాలతో స్వామిఅమ్మవార్లను విశేషంగా అర్చించారు.
అదేవిధంగా అరటి, తెల్లద్రాక్ష, నల్లద్రాక్ష, దానిమ్మ, కమల, జామ, ఖర్జూరం, యాపిల్, ఫైనాపిల్, 9 రకాల ఫలాలు కూడా నివేదించారు.
తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లకు ఏకాంతసేవ నిర్వహించి శయనోత్సవం జరిపారు. ఈ శయనోత్సవానికిగాను ఆలయ ప్రాంగణములోని స్వామివార్లశయన మందిరానికి విశేష పుష్పాలంకరణ చేసారు.