
శ్రీశైల దేవస్థానం:సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో మంగళవారం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష
పూజలు జరిగాయి.తరువాత శ్రీస్వామివారియాగశాలలో శ్రీ చండీశ్వరస్వామివారికి ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. అనంతరం పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూలస్నానం, మహదాశీర్వచనం జరిగాయి.
పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమ గుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగ పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసారు. అనంతరం వసంతోత్సవం జరిగింది.
వసంతోత్సవం తరువాత చండీశ్వరస్వామికి పరస్వి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా అవబృథస్నానం నిర్వహించారు.
సదస్యం నాగవల్లి:
సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగానే ఈ రోజు సాయంత్రం స్వామిఅమ్మవార్ల నిత్యకల్యాణ మండపంలో సదస్యం , నాగవల్లి కార్యక్రమాలు జరిగాయి. సదస్యం కార్యక్రమంలో వేదపండితులచే వేదస్వస్తి జరిగింది .
నాగవల్లి కార్యక్రమంలో సంక్రాంతి పర్వదినాన కల్యాణోత్సవం జరిగిన అమ్మవారికి ఆగమశాస్త్రం సంప్రదాయం మేరకు మెట్టెలు, నల్లపూసలను సమర్పించారు.
ధ్వజావరోహణ:
బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు సాయంకాలం ధ్వజావరోహణ కార్యక్రమం జరిగింది. ఈ ధ్వజావరోహణ కార్యక్రమంలో ఉత్సవాల మొదటిరోజున బ్రహ్మోత్సవ ప్రారంభ సూచకంగా ఆలయ ధ్వజస్తంభంపై ఆవిష్కరింపజేసిన ధ్వజపటం అవరోహణ చేసారు.
18న సాయంకాలం శ్రీ స్వామిఅమ్మ వార్లకు అశ్వవాహనసేవ, ఆలయ ఉత్సవం నిర్వహిస్తారు. ఆలయ ఉత్సవం అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం, ఏకాంతసేవ, శయనోత్సవం జరుగుతాయి.
వేదశ్రవణం:
సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం వేదశ్రవణం కార్యక్రమం జరిగింది.
శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా సేవలన్నీ పరిపూర్ణంగా జరిగాయనే భావనతో ఈ వేదశ్రవణ కార్యక్రమం ఏర్పాటు చేసారు.
దేవస్థానం వేదపండితులతో పాటు పలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 38 మంది వేదపండితులు కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. కాణిపాకం, శ్రీకాళహస్తి, అన్నవరం, ద్వారక తిరుమల, ఇంద్రకీలాద్రి – విజయవాడ దేవస్థానాల నుంచి వచ్చిన వేదపండితులతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చిన పలువురు వేదపండితులు కూడా ఈ కార్యక్రమం లో వేదపారాయణం చేసారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో అర్చకస్వాములు, వేదపండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతిపూజ జరిగింది.
అనంతరం జరిగిన ఋత్విగ్వరణ కార్యక్రమం లో వేదపండితులకు నూతన వస్త్రాలు అందించారు.
తరువాత అమ్మవారి ఆలయ ప్రాంగణములో వేదపఠన కార్యక్రమం జరిగింది. దాదాపు 3 గంటలపాటు నిరంతరాయంగా ఈ వేదపారాయణలు కొనసాగాయి.
ఈ సాయంకాలం సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా సదస్యం కార్యక్రమంలో కూడా వేదపారాయణలు జరిగాయి.
దేవస్థానం వేదపండితులతో పాటు కార్యక్రమానికి విచ్చేసిన వేదపండితులందరు కూడా స్వామిఅమ్మవార్ల కైంకర్యంగా ఘనస్వస్తి నిర్వహించారు. సుమారు రెండుగంటల పాటు ఈ కార్యక్రమం జరిగింది.