
శ్రీశైల దేవస్థానం:మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఆదివారం మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించింది.ఆలయ దక్షిణమాడవీధిలో ( శివవీధిలో) ఈ పోటీలు ఏర్పాటు జరిగాయి. మొత్తం 18 మంది మహిళలు ఈ పోటీలలో పాల్గొన్నారు. స్థానికులే కాకుండా కర్నూలు, విజయవాడ నగరాలను నుంచి వచ్చిన భక్తులు కూడా ఈ పోటీలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న మాట్లాడుతూ మన సంస్కృతీసంప్రదాయాల పై అందరికీ అవగాహన కలిగించాలనే భావనతో ముగ్గుల పోటీలను నిర్వహించామన్నారు. పోటీలలో పాల్గొన మహిళలందరు శివవీధిలో వారు వేసే ముగ్గులను శ్రీస్వామిఅమ్మవార్ల కు కైంకర్యంగా భావించాలన్నారు. భక్తులందరికీ శ్రీస్వామిఅమ్మవార్ల కృపాకటాక్షాలు ఎల్లవేళలా లభిస్తుండాలని ఆకాంక్షించారు.
ఈ పోటీలకు దేవస్థానం పర్యవేక్షకులు శ్రీమతి కె. సాయికుమారి, శ్రీమతి పి. దేవిక, శ్రీమతి ఎం. సావిత్రి, రికార్డు అసిస్టెంట్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
ముగ్గులపోటీలలో శ్రీమతి జి. లక్ష్మీదేవి, శ్రీమతి అపర్ణ, శ్రీమతి రోజారాణి శ్రీశైలం వారు వరుసగా మొదటి, రెండవ, మూడవ బహుమతులు పొందారు.
కన్సోలేషన్ బహుమతులలో భాగంగా టి. సుబ్బమ్మ, శ్రీశైలం, కృష్ణవేణి శ్రీశైలం వారు
వరుసగా మొదటి, రెండవ బహుమతులను పొందారు. కార్యనిర్వహణాధికారి చేతుల మీదుగా ఈ బహుమతులు అందించారు.విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు పోటీలో పాల్గొన మహిళలందరికీ శ్రీస్వామిఅమ్మవార్ల ప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రంగా చీర, రవిక వస్త్రం, దేవస్థానం క్యాలెండరు అందజేసి సత్కరించారు.
భారతీయ సంప్రదాయంలో రంగవల్లులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మన పురాణాలలో పలుచోట్ల ఈ ముగ్గులు ప్రస్తావించారు. ముగ్గును శుభానికి, మంగళత్వానికి ప్రతీకగా భావిస్తారు. లక్ష్మీదేవికి ఆనందాన్ని కలిగించే అంశాలలో ఇంటిముంగిట రంగవల్లులను తీర్చిదిద్దడం కూడా ఒకటి.అందుకే దేవస్థానం ప్రతీఏటా సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా సంక్రాంతి పర్వదినం రోజున ముగ్గుల పోటీలు నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమం లో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు శ్రీ నరసింహారెడ్డి, శ్రీశైలప్రభ సంపాదకుడు డా.సి.అనిల్ కుమార్ , ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, పర్యవేక్షకులు అయ్యన్న తదితర సిబ్బంది పాల్గొన్నారు.