
శ్రీశైల దేవస్థానం:మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని పంచాహ్నిక దీక్షతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు మూడో రోజు శనివారం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. తరువాత యాగశాల లో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. అనంతరం లోకకల్యాణం కోసం జపాలు, రుద్రపారాయణలు, చతుర్వేద పారాయణలు, జరిగాయి.తరువాత మండపారాధనలు, పంచావరణార్చనలు, రుద్రహోమం, చండీహోమ కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిగాయి. ఈ సాయంకాలం ప్రదోష కాలపూజలను, హోమాలను జరిపించిన తరువాత జపానుష్టానాలు జరిగాయి.
రావణవాహన సేవ:
ఈ బ్రహ్మోత్సవాలలో వాహనసేవలలో భాగంగా ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామిఅమ్మవార్లకు రావణవాహనసేవ జరిగింది .ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో రావణవాహనంపై వేంచేపు చేయించి ప్రత్యేక పూజాదికాలు జరిగాయి.తరువాత పురవీధులలో గ్రామోత్సవం జరిగింది. గ్రామోత్సవం లో జానపద కళారూపాల ప్రదర్శన, కోలాటం తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేసారు.
ఆదివారం కార్యక్రమాలు:
ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు 15న శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు, చండీశ్వర పూజ, మండపారాధనలు, పంచావరణార్చనలు, జపానుష్టానాలు, రుద్రహోమం, సాయంకాలం నిత్య హవనాలు, బలిహరణలు మొదలైన కార్యక్రమాలు వుంటాయి.ఈ ఉత్సవాలలో భాగంగా రేపు సాయంకాలం శ్రీ స్వామిఅమ్మవార్లకు నందివాహనసేవ వుంటుంది.
ఆదివారం బ్రహ్మోత్స వ కల్యాణం:
మకర సంక్రాంతి రోజు రేపు 15న రాత్రి బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తారు. శ్రీశైల మహాక్షేత్రంలో ప్రతిరోజు శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల కల్యాణం చేస్తుండగా , ఒక్క మకరసంక్రాంతి రోజున మాత్రమే పార్వతీ కల్యాణం జరిపించటం విశేషం. ఈ కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసారు.
ముగ్గుల పోటీలు:
15 న మహిళలకు ముగ్గులపోటీలు ఆలయ దక్షిణ మాడవీధిలో జరుగుతాయి.
మహాశివరాత్రి ఏర్పాట్ల పరిశీలన:
ఫిబ్రవరి 11 నుండి 21 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇందులో భాగంగా శనివారం కార్యనిర్వహణాధికారి లవన్న లడ్డూ ప్రసాద విక్రయకేంద్రాలు, అన్నప్రసాద వితరణ భవనం, ఆర్జితసేవాకౌంటర్లు, క్యూకాంప్లెక్స్ మొదలైనవాటిని పరిశీలించారు.
లడ్డు ప్రసాదాల విక్రయకేంద్రాల పరిశీలన:
ముందుగా అన్నప్రసాదభవన ప్రాంగణంలో లడ్డు ప్రసాదాల విక్రయ కేంద్రాలను పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న 15 కేంద్రాలతో పాటు అదనంగా మరో 8 కౌంటర్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వీటిలో దివ్యాంగులకు మరియు వృద్ధులకు (60 సంవత్సరాలు పైబడినవారికి) వేరువేరుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు.అదేవిధంగా ప్రసాదాల విక్రయకేంద్రాల వద్ద తగినన్ని సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.
ముఖ్యంగా భక్తులు కోరినన్ని లడ్డుప్రసాదాలు ఇచ్చేందుకు అవసరమైన మేరకు ప్రసాదాలను సిద్ధంగా ఉంచాలన్నారు.
లడ్డుప్రసాద తయారీలో కూడా ఎప్పటికప్పుడు పూర్తి శుచీ శుభ్రతలను పాటిస్తుండాలని సంబంధికులను ఆదేశించారు. అదేవిధంగా ఏ మాత్రం కూడా నాణ్యత తగ్గకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు.
అదేవిధంగా లడ్డుప్రసాదాల విక్రయకేంద్రప్రాంగణంలో బండపరుపు ఎటువంటి పగుళ్ళు లేకుండా తగిన మరమ్మతులు చేయాలన్నారు.అవసరం మేరకు శాశ్వత ప్రాతిపదికన గ్రానైట్ ఫ్లోరింగ్ వేసేందుకు చర్యలు చేపట్టాలని
ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ప్రస్తుతం విక్రయిస్తున్న లడ్డూ ప్రసాదాల తూకాన్ని ఆకస్మికంగా పరిశీలించారు.
అన్నప్రసాద వితరణ పరిశీలన :
తరువాత అన్నప్రసాద వితరణ ఏర్పాట్లను పరిశీలించారు. అన్నదాన భవనములోని అన్నదాన ప్రదేశాలు, భక్తులు వేచి వుండే గదులు, అన్నదానం స్టోరు, వంటశాల మొదలైన వాటిని పరిశీలించి పలు సూచనలు చేశారు ఈ ఓ.ఉత్సవాలలో రద్దీకనుగుణంగా అన్నప్రసాద వితరణను జరిపిస్తుండాలన్నారు.
అన్నప్రసాద వంటకాలకు ఉపయోగించే కూరగాయలు ఎప్పటికప్పుడు తాజాగా ఉండేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్నప్రసాద భవనాన్ని, వంటశాలను తరుచుగా శుభ్రపరుస్తూ శుచిశుభ్రతలను పాటిస్తుండాలన్నారు.
బ్రహ్మోత్సవాలలో భక్తులరద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్న కారణంగా అవసరమైన వంటపాత్రలను ముందస్తుగా సమకూర్చుకోవాలన్నారు.ఉత్సవాల సమయములో క్షేత్రపరిధిలో పలుచోట్ల స్వచ్ఛంద సేవాకర్తలు కూడా అన్నదానాన్ని చేస్తారని , అటువంటి సంస్థలకు దేవస్థానం నుంచి పూర్తి సహాయ సహకారాన్ని అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
క్యూకాంప్లెక్స్ పరిశీలన:
క్యూకాంప్లెక్స్ పరిశీలనలో భాగంగా ముందుగా ఆర్జితసేవా కౌంటర్లను పరిశీలించారు. ఉత్సవాల సమయంలో భక్తుల సౌకర్యార్థం నాలుగు అతిశీఘ్రదర్శనం ( రూ.500 రుసుము) కౌంటర్లు , నాలుగు శీఘ్రదర్శనం (రూ.200ల రుసుము) కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు.ఉత్సవ సమయం లో కౌంటర్లు నిరంతరం ( 24గంటలపాటు) పనిచేసే విధంగా తగిన సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు.
రద్దీ సమయాలలో క్యూలైన్లలో తొక్కిసలాట లేకుండా ఉండేందుకు గాను తగిన స్థాయిలో సెక్యూరిటీ సిబ్బందిని, శివసేవకులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించి, తదనుగుణంగా చర్యలు చేపట్టలన్నారు.క్యూలైన్లలో నిరంతరం మంచినీరు, బిస్కెట్లు, అల్పాహారం మొదలైన వాటిని అందజేస్తుండలన్నారు. క్యూకాంప్లెక్స్ మరియు క్యూలైన్లలో నిర్దిష్ట ప్రదేశాలలో ప్రత్యేకంగా వాటర్ పాయింటులను కూడా ఏర్పాటు చేయాలన్నారు.క్యూలైన్లలో అవాంఛనీయ సంఘటనలు నిరోధించేందుకు, అత్యవసర సమయాలలో వినియోగించుకునేందుకు క్యూలైన్లలోని అవసరమైన అన్నిచోట్ల కూడా అత్యవసర గేట్లను (ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్స్) ఏర్పాటు చేయాలన్నారు.అదేవిధముగా క్యూకాంప్లెక్స్ లోని అన్ని శౌచాలయాలలో శుభ్రత నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలన్నారు. అన్ని శౌచాలయాలలో కూడా నిరంతరం నీటి సరఫరా ఉండే విధముగా చర్యలు చేపట్టలన్నారు.
క్యూ కాంప్లెక్స్ లోని మంచినీటి కుళాయిలు, వాష్ బేసిన్లు అన్ని కూడా వినియోగానికి అందుబాటులో వుండే విధముగా చర్యలు చేపట్టలన్నారు.క్యూకాంప్లెక్స్‌లో మొత్తం 16 కంపార్టుమెంట్ల ద్వారా ఉచిత దర్శనానికి అవకాశం కల్పిస్తారు. అదేవిధంగా 6 కంపార్టుమెంట్ల ద్వారా భక్తులను శీఘ్రదర్శనానికి ( రూ.200/-ల టికెటు అనుమతిస్తారు .
ఈ పరిశీలనలో డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు నరసింహారెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, పర్యవేక్షకులు అయ్యన్న, దేవిక తదితర సిబ్బంది పాల్గొన్నారు.