
శ్రీశైల దేవస్థానం:మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని జనవరి 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
పంచాహ్నిక దీక్షతో ఏడురోజులపాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సంప్రదాయాన్ని అనుసరించి శ్రీ మల్లికార్జునస్వామివారికి ఏటా రెండుసార్లు మకర సంక్రమణం సందర్భంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి సందర్భంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
బ్రహ్మోత్సవ కార్యక్రమాలు:
ఈ బ్రహ్మోత్సవాల ప్రారంభంగా 12.01.2023 ఉదయం గం.9.00లకు శ్రీస్వామివారి యాగశాల ప్రవేశ కార్యక్రమం తరువాత వేదపండితులు చతుర్వేద పఠనాన్ని చేస్తారు.అనంతరం లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు బ్రహ్మోత్సవ సంకల్పాన్ని పఠిస్తారు. సంకల్ప పఠనం తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతి పూజ చేస్తారు. గణపతి పూజ తరువాత వృద్ధి, అభ్యుదయాల కోసం స్వస్తి పుణ్యాహవాచనం వుంటుంది.
ఈ కార్యక్రమాల తరువాత బ్రహ్మోత్సవ నిర్వహణకు అధ్వర్యం వహించే శివపరివార దేవుడైన చండీశ్వరునికి విశేషపూజలు చేస్తారు.అనంతరం కంకణధారణ, ఋత్విగ్వరణం, అఖండదీపారాధన, వాస్తుపూజ, వాస్తుహోమం, మండపారాధనలు, కలశస్థాపన, పంచావరణార్చనలు, జపానుష్ఠానములు, పారాయణలు నిర్వహిస్తారు.
12వ తేదీ సాయంకాలం 5.30 గంటల నుండి అంకురారోపణ, అగ్నిప్రతిష్ఠాపనల కార్యక్రమాలు , తరువాత సాయంత్రం 7.00గంటల నుండి ధ్వజారోహణ, ధ్వజపటావిష్కరణ కార్యక్రమాలు చేస్తారు.
ముక్కోటి దేవతలను, సకల సృష్టిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకుగాను ఈ ధ్వజారోహణ కార్యక్రమం వుంటుంది.
బ్రహ్మోత్సవాలలో భాగంగానే ప్రతిరోజు శ్రీస్వామి అమ్మవార్లకు విశేషపూజలు, మండపారాధనలు, పంచావరణార్చనలు, రుద్రహోమం, చండీహోమం, నిత్యహవనాలు చేస్తారు.
బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు 13వ తేది నుండి శ్రీస్వామిఅమ్మవార్లకు వాహన సేవలుజరుగుతాయి.
15వ తేది మకర సంక్రాంతి రోజున బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తారు.
17వ తేదీ ఉదయం యాగ పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూలస్నానం ,సాయంత్రం సదస్యం, నాగవల్లి, ధ్వజావరోహణ నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన 18వ తేది రాత్రి జరిగే పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవలతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.
ఉత్సవాల సందర్భంగా ఈ నెల 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఆర్జిత, ప్రత్యక్ష పరోక్షసేవలైన రుద్రహోమం, చండీహోమం, మృత్యుంజయహోమం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి కల్యాణం, శ్రీ స్వామిఅమ్మవార్ల కల్యాణం, ఏకాంతసేవలను నిలపుదల చేస్తారు.
సామూహిక భోగిపండ్లు:
భోగిరోజున 14వ తేదీన ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఉచితంగా సామూహిక భోగిపండ్ల కార్యక్రమం వుంటుంది. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఈ సామూహిక భోగిపండ్ల కార్యక్రమాలు జరుగుతాయి.
5 సంవత్సరాల వరకు వయస్సుగల చిన్నారులకు ఈ భోగిపండ్లు పోస్తారు.
ఈ కార్యక్రమం లో పాల్గొనదలచిన వారు 13వ తేదీ సాయంత్రం గం. 5.00ల లోపల ప్రచురణల విభాగంలో వారి పేర్లను నమోదు చేసుకోవలసి ఉంటుంది.
ముగ్గుల పోటీలు:
సంక్రాంతి సందర్భముగా మహిళలకు ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తారు.
సంక్రాంతి రోజున 15వ తేదీన ఉదయం ఆలయ దక్షిణ మాడవీధిలో ఈ పోటీలు జరుగుతాయి.
ముగ్గుల పోటీలలో పాల్గొనదలచిన వారు 14వ తేదీ సాయంత్రం గం.5.00లలో ప్రచురణల విభాగంలో పేర్లను నమోదు చేసుకోవలసి ఉంటుంది.
సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో సదస్యం రోజున 17వ తేదీన వేద శ్రవణం జరుగుతుంది. దేవస్థానం వేదపండితులో పాటు పలు ఇతర దేవస్థానముల నుంచి వేదపండితులు కూడా ఈ కార్యక్రమం లో పాల్గొననున్నారు.