
శ్రీశైల దేవస్థానం: మనస్సును భగవదర్పణ చేయడమే గొప్ప సాధన అని డా. గరికిపాటి నరసింహారావు అన్నారు. హిందూ ధర్మప్రచారంలో భాగంగా దేవస్థానం బుధవారం ప్రముఖ కవి, పండితులు, రచయిత మహాసహస్రావధాని డా. గరికిపాటి నరసింహారావు గారిచే శివానందలహరి విశేషాంశాలపై ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ముందుగా డా. గరికిపాటి , శ్రీశైల క్షేత్ర ప్రాశస్త్యాన్ని వివరించారు. జ్యోతిర్లింగస్వరూపుడైన మల్లికార్జునస్వామివారు, మహాశక్తి స్వరూపిణి అయిన భ్రమరాంబాదేవి వారు స్వయంగా వెలసిన శ్రీశైల దివ్య క్షేత్రం మహిమాన్వితమైనది అన్నారు.కేవలం శ్రీశైల శిఖరాన్ని దర్శించినంత మాత్రానే పునర్జన్మ ఉండదనే విషయం ఎంతో ప్రసిద్ధం అన్నారు. ఆదిశంకరాచార్యులు రచించిన గ్రంథాలలో శివానందలహరికి ఎంతో ప్రసిద్ధి ఉంది అన్నారు. భక్తి విశేషాలను ఈ గ్రంథం ఎంతో గొప్పగా విశదీకరించిందన్నారు.
పరమశివుడు భక్తసులభుడని, భక్తులను అనుగ్రహించడంలో ఇంత సులభులు మరెవ్వరులేరని డా. గరికిపాటి అన్నారు. తలచినవెంటనే అనుగ్రహించే తత్త్వం ఆ పరమేశ్వరుడిదన్నారు.పరమశివుడికి త్రికరణ శుద్ధిగా మన మనస్సును అర్పించాలన్నారు. మన మనస్సును భగవదర్పణ చేయడమే గొప్ప సాధన అన్నారు.పరమశివుడి శిరస్సుపై దోసెడు నీళ్ళతో అభిషేకం చేసి, కాసిన్ని మారేడు దళాలు వేస్తే, అలా చేసిన వారింటిలో కామధేనువు పెంపుడు గోవులాగా తిరుగుతుందని, కల్పవృక్షం వారి ఇంటిలో పెరటిలోని మల్లెచెట్టు అవుతుందని మన పూర్వ సాహిత్యం పేర్కొన్నదన్నారు. కల్పవృక్షం, కామధేనువు రెండు కూడా మనం కోరినవన్నీ ఇస్తాయన్నారు.
శివభక్తి ఉన్నచోట ఏదైనా సాధ్యమే అని చెబుతూ అందుకు మార్కండేయులు కథను ఉదాహరణగా డా. గరికిపాటి పేర్కొన్నారు. ఆయువు తీరిన మార్కండేయుడు మృత్యుపాశం నుంచి తప్పించుకొని చిరంజీవి అవడానికి కారణం అచంచలమైన ఆయన శివభక్తే అన్నారు.అదేవిధంగా ప్రవచనములో నటరాజతత్త్వాన్ని, అర్ధనారీశ్వర తత్త్వాన్ని కూడా వివరించారు.
ప్రవచనం ముగిసిన తరువాత శ్రీస్వామివార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞాపికతో గరికిపాటి ని సన్మానించారు.ఈ సత్కార కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, అర్చకస్వాములు, వేదపండితులు, పలువిభాగాల అధికారులు పాల్గొన్నారు.