పాడి పరిశ్రమ రంగం అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి-మంత్రి తలసాని
హైదరాబాద్: రాష్ట్రంలో పాడి పరిశ్రమ రంగం అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం, ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన డెయిరీ చైర్మన్ సోమా భరత్ కుమార్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, ఇతర అధికారులతో పాడి రంగం అభివృద్ధి కోసం ప్రస్తుతం అమలు అవుతున్న కార్యక్రమాలు, చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. పాడి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అందుకోసం జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేటివ్ ఏజెన్సీ ద్వారా అమలవుతున్న సహకార సంస్థల ద్వారా పాడి పెంపకం పథకాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేయటానికి కావలసిన విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు. ఈ పథకంలో భాగంగానే రుణాల ద్వారా పాడి పశువుల కొనుగోలు, బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్ లు (BMCU) ల ఏర్పాటు, పాల ఉత్పత్తి పెంచడానికి చేపట్టవలసిన చర్యలు, గ్రామస్థాయిలో పాల నాణ్యత ను పరీక్షించే పరికరాలు, పాలను మార్కెటింగ్ కావాల్సిన సౌకర్యాలు, Dairy పార్లర్ ల ఏర్పాటు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా వేలాది మంది పాడి రైతులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యే విధంగా కార్యాచరణ రూపొందించాలని మంత్రి సూచించారు. నేషనల్ ప్రోగ్రాం ఫర్ డైరీ డెవలప్ మెంట్ పథకం ద్వారా పాల శీతలీకరణ కేంద్రాల ఏర్పాటు, మరిన్ని మౌలిక సదుపాయాలను కల్పించడం, పాడి పశువులకు అవసరమైన నాణ్యమైన దాణా ఉత్పత్తి వంటి కార్యక్రమాలు చేపట్టడం వంటి అంశాలపై కూడా పటిష్టమైన కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. పాడి రంగంలో మరింత పురోభివృద్ది సాధించేందుకు పాల ఉత్పత్తిని పెంపొందించడం ప్రధానమనే విషయాన్ని గుర్తించి ప్రభుత్వ పథకాల ద్వారా మేలుజాతి పాడి పశువులతో పాటు అందుబాటులో ఉన్న ఇతర పథకాల ద్వారా రైతులకు తక్కువ వడ్డీతో రుణ సదుపాయం కల్పించాలని, తద్వారా వారి నుండి పాలను సేకరించే విధంగా ఒక విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. విజయ dairy ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న పార్లర్ లు అన్ని ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విజయ dairy BMCU లు ఉన్న ప్రాంతాలలో కూడా పార్లర్ లను ఏర్పాటు చేయడం ద్వారా విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరువలోకి తీసుకెళ్ళాలని ఆదేశించారు. వ్యవసాయానికి అనుబంధంగా అభివృద్ధి చెందుతున్న పాడి రంగాన్ని ఒక ఖచ్చితమైన ఆదాయ వనరుగా మలచుకొనే విధంగా రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. పాడి పశువుల కొనుగోలు, పశువుల కొట్టాల నిర్మాణం, పశువులకు భీమా వంటి వాటి కోసం వీలైనంత ఎక్కువగా రుణ సదుపాయం కల్పించే మార్గాలను కూడా అన్వేషించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. గ్రామాలలో ఉన్న పాల ఉత్పత్తి దారుల సహకార సంఘాలు, రుణాలు ఇచ్చే బ్యాంకులు, పాల ఉత్పత్తి దారుల మద్య త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోనేలా మార్గం సుగమం చేయాలని, తద్వారా మారుమూల ప్రాంతాలలో కూడా మారుమూల గ్రామాలలో కూడా పాల సేకరణను పెంచుకొనే అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఉన్న వ్యవసాయ రైతు సేవా కేంద్రాల ద్వారా పాల సేకరణ జరపటానికి అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఈ నెల మొదటి వారంలో రంగారెడ్డి, నాగర్ కర్నూల్, జనగాం జిల్లాల లో ఎంపిక చేసిన 31 మంది వ్యవసాయ పారిశ్రామిక వేత్తలతో పాల సేకరణ కేంద్రాల ఏర్పాటు కోసం ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
Post Comment