
రంగారెడ్డిజిల్లా: గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహా నగరంలో ప్రజారవాణా వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతోకృషి చేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రెండో దశ మెట్రో రైలుప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్న నేపధ్యంలో గురువారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డిలు మెట్రో MD
NVS రెడ్డితో కలిసి మైండ్ స్పేస్ జంక్షన్, రాజేంద్రనగర్ లోని తెలంగాణ పోలీసు గ్రౌండ్స్ ప్రాంతాలలో పర్యటించారు. శంకుస్థాపన చేయనున్న మైండ్ స్పేస్ జంక్షన్ లో శిలాఫలకం పైలాన్ ఏర్పాటు చేయాల్సిన ప్రాంతం, ట్రాపిక్ మళ్లింపు అంశాలపై అధికారులతో సమీక్షించారు. అదేవిధంగా బహిరంగ సభ నిర్వహించే పోలీసు గ్రౌండ్స్ లో సభా వేదిక ఏర్పాటు, సభకు వచ్చే ప్రజల వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ 6,250 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ పనులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మైండ్ స్పేస్ జంక్షన్ లో శంకుస్థాపన
చేసిన అనంతరం పోలీసు గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. ఇది ఎంతో గొప్ప ప్రాజెక్టు అని అయన అన్నారు. రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టు లో భాగంగా ప్రస్తుతం ఉన్న రాయదుర్గం మెట్రో స్టేషన్ నుండి ORR మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మేర నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ రైలు లైన్ నిర్మాణంలో బయోడైవర్సిటీ జంక్షన్, నానక్ రాంగూడ, నార్సింగి, TS పోలీస్ అకాడమీ, రాజేంద్రనగర్, శంషాబాద్, ఎయిర్ పోర్ట్ కార్గో స్టేషన్ లు ఏర్పాటు చేస్తారని అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో అనేకమందికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. విమాన ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతంగా మారుతుందనితెలిపారు. ఎయిర్ పోర్ట్ నుండి IT కారిడార్ లోని రాయదుర్గం మైండ్ స్పేస్,హై టెక్ సిటీ కి కేవలం 20 నిమిషాలలో చేరుకొనే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ గమ్య స్థానాలకు చేరుకోవాలనే ఆలోచన, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరంలో వందల కోట్ల రూపాయల ఖర్చుతో నూతనంగా అండర్ పాస్ లు, ఫ్లైఓవర్ లు నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. మొదటి దశలో 2017 నవంబర్ 29 న నగరంలో మెట్రో రైలు సేవలను నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. మూడు కారిడార్ లలో కలిపి 63 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. అత్యధిక సంఖ్యలో ప్రజలు మెట్రో రైలులోప్రయాణం చేసి ఎంతో ఆదరించారని తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభం నుండి ఇప్పటి వరకు సుమారు ౩౦ కోట్ల మంది వరకు మెట్రో రైలులో ప్రయాణం చేశారని అన్నారు. రెండో దశ తో కలుపుకొని మొత్తం 94 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. మంత్రుల వెంట చేవెళ్ళ MP రంజిత్ రెడ్డి, MAUD ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్,MLA లు ప్రకాష్ గౌడ్, అరికె పూడి గాంధీ, కాలే యాదయ్య, కలెక్టర్ అమయ్ కుమార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు ఉన్నారు.