హైదరాబాద్, నవంబర్ 29 :ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు వివిధ శాఖల్లో వివిధ కేటగిరీల కింద 60,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, మరో 16,940 పోస్టుల నియామకానికి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. నేడు బీఆర్‌కేఆర్ భవన్‌లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పై టీ.ఎస్.పి.ఎస్.సి ఛైర్మెన్ డా.బి.జనార్ధన్ రెడ్డి తో కలసి వివిధ శాఖల అధికారులతో సమావేశమై పలు శాఖల్లో నియామక ప్రక్రియను సమీక్షించారు.
రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిక్రూట్ మెంట్ బోర్డు తదితర రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారా భర్తీ జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. నియామకాల ప్రక్రియలో సమయపాలన ఖచ్చితంగా పాటించడంతోపాటు , రిక్రూట్‌మెంట్ ప్రక్రియ త్వరిత గతిన పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
సర్వీస్ రూల్స్ లో చేపట్టాల్సిన మార్పులు పూర్తి చేసి అవసరమైన అన్ని వివరాలను టీఎస్ పీఎస్ సి కి వెంటనే సమాచారం అందిస్తే, వాటి ఆధారంగా పబ్లిక్ సర్వీస్ కమీషన్ వచ్చే నెలలో నోటిఫికేషన్‌లు జారీ చేస్తుందని పేర్కొన్నారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రతిరోజూ పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, పీసీసీఎఫ్ ఆర్‌ఎం డోబ్రియాల్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఎస్సీడీ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.