శ్రీశైల దేవస్థానం:సెప్టెంబరు 26 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరుగనున్నాయి.
ఈ మహోత్సవ నిర్వహణకు సంబంధించి చేయాల్సిన ఆయా ఏర్పాట్లపై గురువారం సన్నాహక సమావేశం జరిగింది.
ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, అధ్యాపక, వేదపండితులు, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఉత్సవాలలో శ్రీస్వామి అమ్మవార్లకు జరిపించాల్సిన ఆయా కైంకర్యాలు, భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, దర్శనం ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు మొదలైన అంశాల గురించి కూలంకుషంగా చర్చించారు.సమావేశం లో ఈ క్రింది నిర్ణయాలు తీసుకున్నారు.
*ఉత్సవ రోజులలో శ్రీస్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్ని పరిపూర్ణంగా జరిపించాలని కార్యనిర్వహణాధికారి వైదిక సిబ్బందికి సూచించారు. వైదిక కార్యక్రమాల నిర్వహణలో సమయపాలన ఖచ్చితంగా పాటించాలని కూడా సూచించారు.
• భక్తులు ఆయా ఉత్సవ విశేషాలను వీక్షించేందుకు వీలుగా గంగాధర మండపం వద్ద ఎల్.ఈ.డి స్క్రీన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉత్సవాలలో ఆలయ ప్రాంగణము, ఆలయ పరిసరాలు మొదలైనవన్నీ శోభయామానంగా వుండేవిధంగా కళాత్మకమైన విద్యుద్దీపాలంకరణ చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.
• ఆలయ ప్రాంగణముతో పాటు శివవీధులలో (మాడవీధులు) కూడా ఉత్సవ వాతావరణం ప్రతిబింబించే విధంగా ఆలయ ప్రాకార కుఢ్యానికి కూడా విద్యుద్దీపాలంకరణ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఉత్సవాల సందర్భంగా సంప్రదాయ పద్ధతిలో తగిన విధంగా ప్రత్యేకంగా పుష్పాలంకరణ చేయాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు. ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతీరోజూ నిత్య కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని కార్యనిర్వహణాధికారి ఆదేశించారు.శ్రీస్వామి అమ్మవార్ల గ్రామోత్సవంలో జానపద కళారూపాల ప్రదర్శనను కూడా ఏర్పాటు చేయాలన్నారు.
• ఉత్సవాలలో పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు.ముఖ్యంగా ప్రజా శౌచాలయాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండాలన్నారు. ఉత్సవాల నిర్వహణలో భాగంగా సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించాలన్నారు. భక్తులరద్దీకనుగుణంగా అన్నప్రసాదాల వితరణకు (అన్నదానానికి) తగు ఏర్పాట్లు చేయాలన్నారు.
• క్యూకాంప్లెక్స్ లో నిరంతరం మంచినీరు, అల్పాహారాలను భక్తులకు అందజేస్తుండాలన్నారు.
• ఉత్సవాలలో ఆయా ఉత్సవాల విశేషాలు తెలిసేవిధంగా తగు బోర్డులను ఏర్పాటు చేయాలని
ఆదేశించారు. సామాజిక మాధ్యమాలలో కూడా ఉత్సవాల సంబంధి విశేషాలను తెలియజేయాలని సూచించారు భక్తులకు, స్థానికులకు వైద్యసేవలు అందించే వీలుగా దేవస్థానం వైద్యశాలలో అవసరమైన మేరకు ఔషధాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
*ఉత్సవాల ముఖ్య కార్యక్రమాలు కాగా ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీస్వామివారికి విశేష అర్చనలు, అమ్మవారికి ప్రత్యేకపూజలు, రుద్రయాగం, చండీయాగం, అమ్మవారి ఉత్సవమూర్తికి నవదుర్గ అలంకరణలు, స్వామి అమ్మవార్లకు వివిధ వాహనసేవలు జరుగనున్నాయి.
*సెప్టెంబరు 26వ తేదీన ఉదయం 8.30గంటలకు అమ్మవారి ఆలయ యాగశాల ప్రవేశముతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ప్రారంభ పూజలలో వేదస్వస్తి, ఉత్సవసంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవచనం, కంకణపూజ, దీక్షా సంకల్పం, ఋత్విగ్వరణం, అఖండదీపస్థాపన, వాస్తుపూజ, మండపారాధన,చండీకలశస్థాపనలు వుంటాయి. తరువాత 10.00గంటల నుండి స్వామివారిఆలయములో యాగశాలప్రవేశము, చతుర్వేద పారాయణలు, శివసంకల్పం, గణపతి పూజ అఖండదీపస్థాపన, వాస్తుపూజ, శ్రీదేవికలశస్థాపన వుంటాయి. ఉత్సవాలలో రుద్రపారాయణ, చండీపారాయణ, అమ్మవారికి శ్రీచక్రార్చన, విశేష కుంకుమార్చనలు, సువాసినీ పూజ, కాళరాత్రిపూజ చేస్తారు.
• లోకకల్యాణం కోసం ఉత్సవాలలో ప్రతీరోజు జపాలు, పారాయణలుచేస్తారు.
• దసరా సందర్భంగా అక్టోబరు 4వ తేదీ, మహర్నవమి రోజున రాష్ట్రప్రభుత్వం వారిచే శ్రీస్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించబడుతాయి.
అక్టోబరు 5వ తేదీన ఉదయం యాగపూర్ణాహుతి, కలశోద్వాసన, అవబృథం తదితర కార్యక్రమాలు.
అక్టోబరు 5వతేది విజయదశమి సందర్భంగా సాయంకాలం తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఆర్జితసేవలలో ఉత్సవాలలో ప్రతీరోజు స్వామివారి అభిషేకం, అమ్మవారి కుంకుమార్చన, కల్యాణోత్సవం యథావిధిగా జరిపించబడుతాయి. అయితే ఉత్సవాలలో ఆర్జిత సేవలలో గతం లో మాదిరిగా చండీహోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, నవావరణ పూజ నిలుపుదల.
*ఉత్సవాలలో విశేష అలంకారములు – వాహనసేవలు .
*తేది, వారం , శ్రీఅమ్మవారి అలంకారం , వాహనసేవలు*
*26.09.2022 | సోమవారం , శైలపుత్రి , భృంగివాహనం*
*27.09.2022 | మంగళవారం , బ్రహ్మచారిణి, మయూరవాహనం*
*28.09.2022/ బుధవారం , చంద్రఘంట, రావణవాహనం*
*29.09.2022 గురువారం, కూష్మాండదుర్గ, కైలాసవాహనం*
*30.09.2022 /శుక్రవారం, స్కందమాత, శేషవాహనం*
*01.10.2022 | శనివారం/కాత్యాయని/ హంసవాహనం, పుష్పపల్లకీసేవ/ *
*02.10.2022 | ఆదివారం/కాళరాత్రి/ గజవాహనం*
*03.10.2022 | సోమవారం/మహాగౌరి /నందివాహనం/*
| 04.10.2022 | మంగళవారం/ సిద్ధిదాయిని/ అశ్వవాహనం*
*05.10.2022 | బుధవారం/ భ్రమరాంబాదేవి, (నిజాలంకరణ) /నందివాహనం (ఆలయ ఉత్సవం)/*