విచ్ఛిన్నకర, ప్రతీప శక్తులు, నీచులు, దుర్మార్గులు ఉంటరు. జాగ్రత్తగా ఉండాలె-కేసీఆర్

మేడ్చల్: విచ్ఛిన్నకర, ప్రతీప శక్తులు, నీచులు, దుర్మార్గులు ఉంటరు. జాగ్రత్తగా ఉండాలె అని  కేసీఆర్ అన్నారు.  జిల్లాలో నూతనంగా నిర్మించిన సమీకృత  జిల్లా కార్యాయాల భవన సముదాయం (కలెక్టరేట్ కాంప్లెక్స్)ను  ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  బుధవారం మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు హైదరాబాద్  ప్రగతి భవన్ నుంచి బయలుదేరారు. మార్గంమధ్యలో బొల్లారంలోని తోట ముత్యాలమ్మ గుడిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూజలు చేశారు. అక్కడి నుంచి శామీర్ పేట మండలం అంతాయిపల్లిలో నిర్మించిన సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయమైన కలెక్టరేట్ వద్దకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. జిల్లా నేతలు, అధికారులు పూల బొకేలతో, అర్చకులు పూర్ణకుంభంతో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా త్రివర్ణ బెలూన్లను ఎగుర వేశారు.  అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఆ తర్వాత 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.56 కోట్ల 20 లక్షల ఖర్చుతో అంతాయిపల్లిలో నిర్మించిన సమీకృత భవన సముదాయ కలెక్టరేట్ శిలాఫలకాన్ని సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 3 గంటల 49  నిమిషాలకు ఆవిష్కరించి, కలెక్టరేట్ ను ప్రారంభించారు. కలెక్టరేట్ భవన సముదాయం అంతటా ముఖ్యమంత్రి కలియతిరిగి అన్నింటినీ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. కలెక్టర్ చాంబర్ లోని  కుర్చీలో కలెక్టర్ ఎస్.హరీశ్ ను సీఎం కేసీఆర్ కూర్చుండబెట్టి, ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.  అనంతరం నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో  సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారిని జిల్లా కలెక్టర్ హరీశ్ సన్మానించి, జ్ఞాపికను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట, మంత్రులు చామకూర మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు, మేడ్చల్ జెడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు కె.జనార్దన్ రెడ్డి, సురభి వాణీదేవి, శంభీపూర్ రాజు, కె.నవీన్ కుమార్, బి.దయానంద్, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మైనంపల్లి హనుమంతరావు, కె.పి.వివేకానంద్, మాధవరం కృష్ణారావు, బేతి సుభాష్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, ఎ.జీవన్ రెడ్డి, ఫీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రాంమ్మోహన్,  తూముకుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావులతోపాటు, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్,  కలెక్టర్ ఎస్.హరీశ్, అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, జాన్ శాంసన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్,  వాటర్ బోర్డు ఎం.డి. దానకిషోర్, మున్సిపల్ డైరెక్టర్ సత్యనారాయణ, ఈఎన్సీ గణపతిరెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ తదితరులు పాల్గొన్నారు.

 ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మేడ్చల్ సభ,  కేసీఆర్ ప్రసంగం.. ముఖ్యాంశాలు:

  • రాష్ట్రంలోని సబ్బండ వర్గాలను ఆదుకోవడానికి 36 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నం.
  • కొత్తగా మరో 10 లక్షల మందికి కూడా పెన్షన్లు మంజూరు చేసినం.
  • దీంతో మొత్తం పెన్షన్లు 46 లక్షల మంది లబ్దిదారులకి అందుతాయి.
  • గతంలో సమైక్య రాష్ట్రంలో కరెంటు సరిగా ఉండేది కాదు, ఎపుడు వస్తదో, ఎపుడు పోతదో తెల్వది
  • లో వోల్టేజీతో ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయేవి, అందరూ ధర్నాలు చేసే పరిస్థితి ఉండేది.
  • కానీ, తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించాక కరెంటు కష్టాలు పోయినయి.
  • నేడు దేశంలో అన్నిరంగాలకు 24 గంటలు నాణ్యమైన కరంటు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే.
  • దీంతో ఇక్కడ ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్ల దుకాణాలు బంద్ అయినయి.
  • ఈరోజు హైదరాబాద్ లో 24 గంటలు కరంటు పోదు.. ఢిల్లీలో కరంటు సరిగా రాదు
  • ఇది ఆషామాషీగా రాలేదు. దీని వెనుక నిరంతర శ్రమ ఉన్నది.
  • స్వరాష్ట్రంలో సాగునీటి సౌకర్యం అందుబాటులోకి రావడంతో సాగు పెరిగింది.
  • ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ గా చేసుకొన్నం. 2601 రైతు వేదికలు కట్టుకున్నం. రైతులు బాగు పడుతున్నరు.
  • ఈరోజు హైదరాబాద్ నగర శివార్లలోని నియోజకవర్గాల్లో అభివృద్ధి పెరుగుతున్నది.
  • ఈ ప్రాంతంలో కనీస వసతులను కల్పించాల్సిన అవసరం మరింతగా ఏర్పడింది.
  • అందుకే, మేడ్చల్ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఇప్పటివరకు 5 కోట్ల రూపాయల నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇచ్చినం.
  • ఇప్పుడు ఈ నిధులకు అదనంగా ఒక్కో నియోజకవర్గానికి మరో 10 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 70 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్న.
  • ఈ రోజు దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,78,500 ఉన్నది.
  • ఇది క్రమశిక్షణతో, అవినీతి రహితంగా, కడుపు కట్టుకొని పని చేస్తేనే సాధ్యపడింది.
  • ఉద్యమ సమయంలో ఉద్యోగులకు చెప్పినం.. మాట ఇచ్చిన ప్రకారంగా దేశంలోనే అత్యధికంగా వేతనాలిస్తున్నం.
  • రాష్ట్రంలోని 11 లక్షల కుటుంబాల ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ సాయం అందజేసినం.
  • రాష్ట్రంలో ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, వికలాంగులు, నేత, గీత కార్మికులు, బోదకాలు బాధితులకు కూడా పెన్షన్లు ఇస్తున్నం.
  • కొత్తగా కిడ్నీ పేషంట్లకు కూడా ఆసరా పెన్షన్లు అందించడం జరుగుతుంది.
  • ఈ రోజు పల్లెల్లో పెద్దలు చెబుతున్నరు. నా పెద్దకొడుకు కేసీఆర్ నెలనెలా నాకు పింఛన్ ఇస్తున్నడని.
  • గ్రామాల్లో నేడు అత్తలకు పెన్షన్ రావడంతో.. కోడండ్లు మర్యాద ఇస్తున్నరు.
  • ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరికీ 6 కిలోల చొప్పున బియ్యమిస్తున్నం
  • రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎస్.డి.పి. అద్భుతంగా పెరిగింది.
  • అధికారుల అంకిత భావం, ప్రజా ప్రతినిధుల చిత్తశుద్ధి, ప్రభుత్వ లక్ష్య శుద్ధే కారణం
  • ఈరోజు 33 జిల్లాలలో కలెక్టరేట్లు, పోలీసు భవనాలు కట్టుకున్నం.
  • దేశంలోనే అత్యధిక గురుకుల పాఠశాలలు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది.
  • గురుకులాల్లో చదువుకున్న పిల్లలు దేశంలోనే ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నరు.
  • మిషన్ భగీరథ పథకంతో 100శాతం ఇండ్లకు స్వచ్ఛమైన మంచినీళ్లిస్తున్నం.
  • తెలంగాణలో అభివృద్ధి బాగా పెరిగింది. బొంబాయి, దుబాయి పోవుడు లేనే లేదు.
  • ఇతర రాష్ట్రాల నుంచి 25 – 30 లక్షల మంది ఇక్కడికే పనుల కోసం వస్తున్నరు.
  • ఏ సమాజమైతే నిద్రాణమై ఉంటదో, వారు దెబ్బతినే ప్రమాదం ఉంటది.
  • మోసపోతే గోస పడుతం.. ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలె.
  • 60 ఏండ్ల కింద మనం పోరాడలేదు కాబట్టే.. తెలంగాణను ఆంధ్రలో కలిపారు.
  • 58 ఏండ్లు మడమ తిప్పని పోరాటం చేస్తేనే.. తెలంగాణ రాష్ట్రం వచ్చింది.
  • ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటే, తెలంగాణలో ఇంత అభివృద్ధి జరిగేదా?
  • దేశంలోని పరిణామాలపై గ్రామాల్లో ప్రజలు చైతన్యవంతులై చర్చించుకోవాలె.
  • ఒక బంగ్లా కట్టాలంటే ఎంతో కష్టపడాలె. కానీ, దాన్ని అవలీలగా కూలగొట్టొచ్చు.
  • దేశాన్ని కులం,మతం పేరుతో విడదీసేందుకు విద్వేష కుట్రలు జరుగుతున్నయి.
  • స్వతంత్ర ఫలాలు అందరికీ అందాలంటే, కుల మతాలకతీతంగా ఐక్యంగా ఉండాలె.
  • చైనా, సింగపూర్, కొరియా దేశాల లాగా, మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలె.
  • దేశంలో అపారమైన సంపద, నదులున్నా, ఫలితాలు మాత్రం అందడం లేదు.
  • అందుకే దేశంలో గుణాత్మక మార్పు రావాలె. అందుకోసం ప్రజలు ఆలోచించాలె.
  • మన వనరులు మనకే దక్కాయి కాబట్టి.. తెలంగాణ ఆర్థికంగా బలపడ్డది.
  • నేడు తెలంగాణ లాగా కరెంటు, మన పక్కన ఉండే ఏ రాష్ట్రంలోనూ రాదు
  • ఆఖరికి దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరంటు 24 గంటలు రాదు.
  • మంచినీళ్ల పరిస్థితి కూడా అట్లనే ఉంది.. తెలంగాణ లాగా ఎక్కడా సరిగా రావు
  • తెలంగాణ గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి, సంక్షేమం ఎట్లా జరుగుతున్నదో చూడాలె
  • విచ్ఛిన్నకర, ప్రతీప శక్తులు, నీచులు, దుర్మార్గులు ఉంటరు. జాగ్రత్తగా ఉండాలె.
  • గ్రామాల్లో చర్చించుకొని, అభివృద్ధి ఎట్ల జరుగుతదో ప్రజలే నిర్ణయించుకోవాలె.
  • ప్రజలంతా ఐకమత్యంతో ఉంటూ, రాష్ట్ర ప్రగతికి సహకరిస్తూ ముందుకు పోవాలె.
  • దేశంలోనే సముజ్వల రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలె.
print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.