శ్రీశైల దేవస్థానం: స్థానిక సత్రాల వారితో దేవస్థానం బుధవారం సమావేశాన్ని నిర్వహించింది.ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరుపాక్షయ్యస్వామి, మేరాజోత్ హనుమంత నాయక్, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పాల్గొన్నారు.
ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వి.రామకృష్ణ, రెవెన్యూ విభాగం సహాయ కార్యనిర్వహణాధికారి పి. నటరాజరావు, రెవెన్యూ విభాగం పర్యవేక్షకురాలు శ్రీమతి కె. గిరిజామణి, ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో ముందుగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ క్షేత్రాన్ని సందర్శించే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని, భక్తులకు సౌకర్యాల కల్పనలో అన్ని సత్రాల వారు కూడా వారి సహాయ సహకారాలు అందించాలన్నారు. ముఖ్యంగా సామాన్య భక్తుల కోసం దేవస్థానం డార్మిటరీల నిర్మాణానికి నిర్ణయించిందని, ఈ నిర్మాణానికి సత్రాల వారు కూడా సహకరించాలన్నారు. అదేవిధంగా క్షేత్రపరిధిలో అన్నీ సత్రాల వారు కూడా క్షేత్ర పవిత్రతను కాపాడడంలో తోడ్పడాలన్నారు. భక్తులకు వసతి కల్పించేటప్పుడు వారి గుర్తింపును విధిగా పరిశీలించాలన్నారు. భక్తులపట్ల పూర్తి మర్యాదలతో ప్రవర్తిస్తూ భక్తులకు అవసరమైన సమాచారాన్ని అందించాలన్నారు. ఈ విషయమై సత్రాలలో పనిచేసే సిబ్బంది అందిరికీ ప్రత్యేక అవగాహన కల్పించాలని సూచించారు. ఆలయ వేళలు, ఆలయంలో జరిగే ఆర్జితసేవలు భక్తులకు తెలిసే విధంగా ప్రతీ సత్రములో కూడా వివరాలు తెలిపే బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సత్రాల ప్రాంగణములో పచ్చదనం పెంపొందించే విధంగా విరివిగా మొక్కలను నాటాలని సూచించారు. ఆయా సత్రాలలోని ఖాళీస్థలాన్ని బట్టి దేవస్థానమే మొక్కలను సత్రాలకు అందిస్తుందన్నారు.
ధర్మకర్తల మండలి అధ్యక్షులురెడ్డి వారిచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ క్షేత్రాభివృద్ధికి దేవస్థానం పలు చర్యలు చేపట్టనున్నదని చెప్పారు. క్షేత్రాన్ని మరింత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలను కూడా చేపడుతున్నామన్నారు. క్షేత్రాభివృద్ధికి సత్రాలవారు కూడా తమ పూర్తి సహాయ సహకారాలను అందించాలన్నారు. అందరి సహాయ సహకారాలతో పూర్తి అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైలక్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దాలని దేవస్థానం దృఢనిశ్చయంతో ఉందన్నారు. ప్లాస్టిక్ నిషేధం అమలుకు సత్రాల వారు కూడా సహకరించాలన్నారు. ఈ విషయమై సత్రాలలో వసతి పొందే భక్తులకు సత్ర యాజమాన్యాలు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శని,ఆదివారాలు, పర్వదినాలు, ప్రభుత్వ సెలవురోజులందు భక్తుల సంఖ్య సాధారణ రోజులకంటే కూడా అధికంగా ఉంటుందన్నారు. సాధారణంగా భక్తులందరు కూడా వసతి పొందేందుకు దేవస్థానం విచారణ కార్యాలయాన్ని సంప్రదించడం జరుగుతుందని పేర్కొన్నారు. అందుకే ఈ రద్దీరోజులలో ప్రతీ సత్రము వారు 25 శాతం గదులను దేవస్థానం సూచించిన వారికి కేటాయించే విధానాన్ని కొనసాగించాలని కోరారు. మిగిలిన 75శాతం గదులను ఆయా సత్రాలవారే నేరుగా కేటాయించుకోవచ్చునన్నారు.
తరువాత సమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులు ఎం. విరుపాక్షయ్యస్వామి, మేరాజోత్ హనుమంతనాయక్, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రసంగించారు.సమావేశం చివరిలో పలు సత్రాల వారు ధర్మకర్తల మండలి అధ్యక్షులను, కార్యనిర్వహణాధికారి ని తదితరులను సత్కరించారు.