
హైదరాబాద్: వరద ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరాఫరాపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆదేశించారు. డబుల్ క్లోరినేషన్ తో పాటు నీటి నాణ్యత పరీక్షల శాంపిల్ సైజ్ ను పెంచాలని సూచించారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరాఫరా స్థితిపై చీఫ్ ఇంజనీర్లు, అన్ని జిల్లాల ఎస్.ఈ, ఈఈ, డీఈఈ లతో ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో స్మితా సభర్వాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు, మాన్ సూన్ మార్పులతో తాగునీరు కలుషితం అయ్యే అవకాశం ఉన్నందున స్వఛ్చత విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని భగీరథ ఇంజనీర్లుకు సూచించారు.నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం నీటి శుద్ది కేంద్రాల్లోని పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ఇక గ్రామాల్లో ఉన్న OHRS ల దగ్గర నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. దీంతో పాటు ఇండ్లలో ఉన్న నల్లా కనెక్షన్ ల దగ్గర కూడా నీళ్లు నిల్వ లేకుండా, పరిశుభ్రంగా ఉంచుకునేలా గ్రామస్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఇక ఇండ్లలో తాగునీటి సేకరణ, నిల్వకు ఉపయోగించే ప్లాస్టిక్ పైపులు, డ్రమ్ములను కూడా క్లీన్ గా ఉంచుకునేలా గ్రామస్థులకు చైతన్యం కల్పించాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా నీటి సంబంధిత వ్యాధులు ప్రబలకుండా సురక్షిత తాగునీటి సరాఫరా చేయాలని అధికారులను స్మితా సభర్వాల్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజనీర్లు వినోభాదేవి, శ్రీనివాస్, మధుబాబుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.