
తిరుపతి, 12 జులై 2022: ప్రముఖ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం వేల సంవత్సరాల కిందటే ఆర్ష గ్రంథాలు, పురాణాల్లో అనేక చోట్ల కనిపిస్తుందని టీటీడీ ఈవో, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎవి ధర్మారెడ్డి చెప్పారు. ఉత్తరాయణం, దక్షిణాయనం లాంటి లెక్కలు ఈ కోవలోకే వస్తాయన్నారు.
శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 17వ ఆవిర్భావ దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన నవగ్రహ మఖ శ్రీ సుదర్శన పారమాత్మక యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో ధర్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో ధర్మారెడ్డి వేద విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగించారు. వేద విద్య అభ్యసిస్తున్న వారు ఆంగ్లం, హింది భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించాలన్నారు.ఇలా నేర్చుకోగలిగితేనే వేద విద్య ను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసే రాయబారులుగా రాణించవచ్చని తెలిపారు. కోవిడ్ సమయంలో ఎస్వీబీసీ ద్వారా మంచి కార్యక్రమాలు రూపొందించి, ప్రసారం చేయడం కోసం వేద పండితులతో కమిటీ నియమించామన్నారు. ఆ సమయంలో తాను వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోగలిగే అవకాశం లభించిందని ఆయన వివరించారు. వైద్య విద్య కంటే వేద విద్యాభ్యాసం చాలా కష్టమన్నారు. వేద విద్య ఒక మతానికి సంబంధించినది కాదన్నారు.నవగ్రహాల గురించి కూడా వేల సంవత్సరాల కిందటే ఆర్ష గ్రంథాలు, పురాణాలలో చెప్పడం జరిగిందన్నారు. నవగ్రహాల ప్రభావం, వాటి శాంతి మార్గాలు, మానవుల మీద వాటి ప్రభావం కూడా వివరించారని ఈవో చెప్పారు. వేద విద్యార్థులు రోజు యోగాభ్యాసం చేయాలని, దీనివల్ల శరీరాన్ని నియంత్రిచుకోవచ్చని సూచించారు. వేద విద్యార్థులు రాగ ద్వేషాలకు అతీతులుగా తయారై సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. వేద విశ్వవిద్యాలయానికి త్వరలోనే కొత్త విసి నియామకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.
ముఖ్య అతిథిగా హాజరైన పుదుచ్చేరి విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ లక్ష్మీ ప్రసన్న ఆంజనేయ శర్మ మాట్లాడుతూ, వేద విద్యార్థులు వేదం లోని లోతు తెలుసుకుని అభ్యాసం చేస్తే ఉత్తమంగా తయారవుతారని చెప్పారు. వేద విద్య ను కేవలం ఉద్యోగం కోసం కాకుండా బుద్ధి శక్తి, నైపుణ్యం పెంచుకుంటేనే ఉపయోగం ఉంటుందని సలహా ఇచ్చారు. మహానుభావులను సేవించి విజ్ఞానం సంపాదించాలన్నారు.
జెఈవో శ్రీమతి భార్గవి మాట్లాడుతూ, వేద విద్యకు భరత భూమి పుట్టినిల్లని చెప్పారు.అలాంటి వేద విద్యను పరిరక్షించే కార్యక్రమం టీటీడీ నిర్వహిస్తోందన్నారు. కలియుగంలో ధర్మం విశిష్టత కేవలం వేదం చదివిన వారే చెప్పగలరని ఆమె తెలిపారు. ప్రపంచంలోని ఏ శక్తి వేద విద్యను మన నుంచి కొల్లగొట్టలేక పోయిందని తెలిపారు.
అనంతరం ఈవో, ఇతర అథితులు విద్యార్థుల కు పుస్తకాలు, వస్త్ర బహుమానం చేశారు. 2022-23 అకడమిక్ క్యాలెండర్, స్వర్గీయ అగ్నిగుండం శ్రీనివాసాచార్యులు వేద విశ్వవిద్యాలయం రికార్డింగ్ ప్రాజెక్టులో రూపొందించిన బ్రహ్మ ఘోష సిడి ని ఆవిష్కరించారు.విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య రాధేశ్యామ్, డీన్ డాక్టర్ ఫణి యజ్ఞేశ్వర యాజులు, ఆచార్య పవన్ కుమార్ ప్రసంగించారు. ఎస్వీబీసీ సిఈవో షణ్ముఖ కుమార్ పాల్గొన్నారు.