
శ్రీశైల దేవస్థానం:పాలనాంశాల పరిశీలనలో భాగంగా శుక్రవారం దేవస్థానం ఈ ఓ, సాక్షి గణపతి
ఆలయాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ ఓ మాట్లాడుతూ, సాక్షిగణపతి ఆలయం, ఆలయ , పరిసరాలు నిరంతరం శుభ్రంగా వుండే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుండాలన్నారు.ముఖ్యంగా భక్తులందరితో మర్యాదగా మెలుగుతుండాలని సిబ్బందిని ఆదేశించారు. సాక్షి గణపతి ఆలయం వద్ద మరిన్ని సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.అనంతరం ఈ ఓ హఠకేశ్వరం చేరుకొని, అక్కడ జరుగుతున్న షెడ్డు మరమ్మతులు పరిశీలించారు. పనులు త్వరితంగా పూర్తికావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. షెడ్డు నిర్మాణ పనులలో పూర్తి నాణ్యతను పాటించాలని సూచించారు. ఆలయం వద్ద కటాంజనాలకు షెడ్డు స్తంభాలకు పెయింటింగ్ పనులను చేపట్టాలన్నారు.కార్పెట్ గ్రాస్ తో దర్శనంతరం భక్తులు సేద తీరేందుకు వీలుగా హఠకేశ్వర ఆలయ ప్రాంగణములో కార్పెట్ గ్రాస్ ను పచ్చిక బయళ్ళును ఏర్పాటు చేయాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు.
హఠకేశ్వర ఆలయానికి వెనుక భాగములో నేలను చదును చేసి అక్కడ పూల తోటలను పెంచాలని కూడా ఈ ఓ ఆదేశించారు. ఈ తోట ద్వారా పచ్చి పూలను ఆలయ కైంకర్యాలకు వినియోగించే అవకాశం వుంటుందన్నారు. ప్రధాన రహదారి నుండి హఠకేశ్వర ఆలయ మార్గానికి యిరువైపులా మొక్కలు నాటాలన్నారు. ముఖ్యంగా దైవ వృక్షాలైన ఉసిరి, కదంబం లాంటివి నాటాలని సూచించారు.
హఠకేశ్వర ఆలయానికి ఎదురుగా గుండాన్ని ఎప్పటి కప్పుడు శుభ్రపరుస్తుండేందుకు చర్యలు చేపట్టాలన్నారు. గుండం చుట్టూ ఏర్పాటు చేసిన కటాంజనానికి కూడా మరమ్మతులు చేయాలని ఆదేశించారు ఈ ఓ. ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వి.రామకృష్ణ, డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఎమ్.నరసింహా రెడ్డి, సహాయ ఇంజనీర్లు, రంగప్రసాద్, సీతా రమేష్ తదితరులు పాల్గొన్నారు.