శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానంలో అభివృద్ధికి 16 ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసారు.శ్రీశైల దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలపై సోమవారం సమీక్షా సమావేశం జరిగింది.దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈ ఓ ఎస్. లవన్న, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్థాన అన్ని శాఖల అధిపతులు, అన్ని విభాగాల పర్యవేక్షకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రారంభంలో ఈ ఓ మాట్లాడుతూ ఇటీవల దేవస్థానములో పూర్తి అయిన వివిధ అభివృద్ధి పనులు, ప్రసాద్ పథకం కింద్ర చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రస్తుతం జరుగుతున్న గణేశ సదన్ నిర్మాణ పనులు, పంచమఠాల పునరుద్ధరణ మొదలైన అంశాల గురించి వివరించారు. సమీప భవిష్యత్తులో చేపట్టాలని ప్రతిపాదించిన మాడవీధుల సుందరీకరణ మొదలైన కార్యక్రమాలను గురించి వివరించారు. ప్రస్తుతం భక్తులకు కల్పిస్తున్న వసతి సదుపాయాలు, దర్శనం ఏర్పాట్లు, పరోక్షసేవలు మొదలైనవాటిని కూడా వివరించారు.
అనంతరం ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి ధర్మకర్తల మండలి పూర్తి సహాయ సహకారాలను అందిస్తుందన్నారు. అందరూ కూడా దేవస్థానం అభివృద్ధికి పాటు పడాలని సూచించారు. అవకాశాన్ని బట్టి భక్తులకు కల్పిస్తున్న ఆన్ లైన్ సేవల విస్తరణ పట్ల మరిన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.తరువాత పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు ప్రసంగిస్తూ దేవస్థానం అభివృద్ధికి సంబంధించి పలు సూచనలను, సలహాలను అందజేశారు.
దేవస్థానం అభివృద్ధిలో భాగంగా ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులతో దేవస్థాన ఆయా విభాగాలకు సంబంధించి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసారు.
–దేవస్థానం ఆగమపాఠశాల, ఇంజనీరింగ్, వసతి కల్పన, ప్రోటోకాల్, రెవెన్యూ, అన్నప్రసాద వితరణ, గోశాల , ఉద్యానవనాలు, పడితరం స్టోరు, ఇంజనీరింగ్ స్టోరు, పరిపాలనా, భద్రతా విభాగం, ప్రచురణలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు స్టేషనరీ, విరాళాలు, ఆర్జిత సేవలు, దేవస్థానం వైద్యశాల, పెట్రోల్ బంకు, వంటగ్యాస్ విభాగం, ప్రసాదాలు, పారిశుద్ధ్యం, గణాంక విభాగం, వివిధ వస్తువుల కొనుగోళ్లు సంబంధించి మొత్తం 16 కమిటీలు ఏర్పాటు చేసారు.
ఈ కమిటీలలో ఒక్కొక్క కమిటీకి ముగ్గురు ధర్మకర్తల మండలి సభ్యులు బృందంగా ఉంటారు. కొనుగోళ్ళకు సంబంధించి మాత్రం అయిదు మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసారు.
సమావేశానంతరం వివిధ కమిటీలలోని ధర్మకర్తల మండలి సభ్యులు ఆయా విభాగాల కార్యకలాపాలను పరిశీలించారు.
సమీక్షా సమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరుపాక్షయ్యస్వామి, జి. నరసింహరెడ్డి, శ్రీమతి ఎం. విజయలక్ష్మి శ్రీమతి ఎ. లక్ష్మి సావిత్రమ్మ, ఆలకొండగిరి మురళి, మేరాజోత్ హనుమంతనాయక్, ఓ. మధుసూదన్ రెడ్డి, శ్రీమతి బరుగురెడ్డి పద్మజ, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పాల్గొన్నారు.