శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం ఈ ఓ లవన్న బుధవారం, లడ్డు ప్రసాద విక్రయ కేంద్రాలు, అన్నప్రసాద వితరణను ఆకస్మికంగా పరిశీలించారు.ముందుగా లడ్డుప్రసాదాల విక్రయ కేంద్రాలలో స్టాకు నమోదు, విక్రయ వివరాల నమోదు, లడ్డు ప్రసాదాల టికెట్ల జారీ విధానం మొదలైన అంశాలను పరిశీలించారు.ఈ ఓ మాట్లాడుతూ భక్తులు అధిక సమయం క్యూలైన్లలో వేచివుండకుండా త్వరితంగా ప్రసాదాలను అందించేందుకు చర్యలు చేపట్టాలని విక్రయ కేంద్ర పర్యవేక్షకులను ఆదేశించారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
తరువాత అన్నదాన మందిరంలో అన్నప్రసాద వితరణకు ఈ రోజు వండిన వంటకాలను ఈ ఓ పరిశీలించారు.ఈ ఓ మాట్లాడుతూ అన్నప్రసాద వితరణలో వండిన ప్రతి వంటకం కూడా ప్రతి భక్తుడికి అందేవిధంగా నిరంతరం పర్యవేక్షిస్తుండాలని అధికారులను ఆదేశించారు. అన్నప్రసాదాలను స్వీకరించేందుకు వచ్చిన భక్తులు అధిక సమయం వేచివుండకుండా వుండేందుకు తగు చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకుగాను అన్నదాన మందిరంలోని ఆయా భోజనశాలలో తగు ముందస్తు ఏర్పాట్లు ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. అన్నప్రసాదాలు వడ్డించే సిబ్బంది తప్పనిసరిగా వస్త్ర నిబంధన (డ్రస్ కోడ్) పాటించాలన్నారు. సిబ్బంది అందరు కూడా భక్తులతో మర్యాదగా మెలగాలన్నారు.ముఖ్యంగా అన్నప్రసాదాలు వడ్డించే సిబ్బందికి తగు శిక్షణ ఇచ్చేందుకు శిక్షణా తరగతులు నిర్వహించాలని అన్నదాన విభాగాన్ని ఆదేశించారు.అన్నదాన మందిరములో శుచీ శుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. ఎప్పటికప్పుడు అన్నదాన మందిరాన్ని శుభ్రపరుస్తుండాలని సిబ్బందిని ఆదేశించారు.తరువాత అన్నప్రసాదాలు స్వీకరిస్తున్న పలువురు భక్తులతో సంభాషిస్తూ వారి అభిప్రాయాలను తీసుకున్నారు.అన్నప్రసాద వితరణ గురించి ప్రతిరోజు కూడా భక్తుల అభిప్రాయాలను తెలుసుకుంటూ ఉండాలని అన్నదాన విభాగ పర్యవేక్షకులను ఆదేశించారు.
తరువాత కంట్రోల్ కమాండ్ రూమ్ ద్వారా క్షేత్రపరిధిలోని పలు ప్రదేశాలను పరిశీలించి సంబంధీకులకు ఆయా ఆదేశాలను జారీ చేశారు.