శ్రీశైల దేవస్థానం:దేవస్థానం పరిపాలనా సంబంధిత అంశాలపై ఈ ఓ ఎస్.లవన్న శుక్రవారం సాయంకాలం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.దేవస్థానం కార్యాలయం లో జరిగిన ఈ సమావేశం లో అన్ని విభాగాధిపతులు, పర్యవేక్షకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. పరిపాలనాపరంగా తీసుకోవలసిన మరిన్ని చర్యలు, సమీప భవిష్యత్తులో చేపట్టవలసిన అభివృద్ధి పనులు మొదలైనవాటి గురించి చర్చించారు.
సిబ్బంది అందరు కూడా సమయపాలనను విధిగా పాటించాలని ఈ ఓ ఆదేశించారు. ప్రతి విభాగాధికారి , ఆయా విభాగాల పర్యవేక్షకులు వారి వారి విభాగంలోని సిబ్బంది సమయపాలన పాటించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. విభాగాధికారులందరు కూడా వారి వారి విభాగంలోని సిబ్బంది రోజు వారి హాజరుపట్ల తగు పరిశీలన చేయాలన్నారు.అదేవిధంగా సిబ్బంది అందరు విధినిర్వహణ సమయం లో తప్పనిసరిగా గుర్తింపుకార్డును ధరించాలన్నారు.కార్యాలయం లో మూమెంట్ రిజిష్టరును వెంటనే ఏర్పాటు చేయాలని పరిపాలనా విభాగాన్ని ఆదేశించారు. ఉద్యోగులు కార్యాలయ వేళలో విధినిర్వహణ నిమిత్తం కార్యాలయం నుంచి బయటకు వెళ్ళినప్పుడు సంబంధిత వివరాలను రిజిష్టరులో నమోదు చేయాలన్నారు.
ఇంజనీరింగ్ పనుల సమీక్ష:
క్షేత్ర అభివృద్ధి పనులలో భాగంగా దేవస్థానం చేపట్టిన పంచమఠాల పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు ఈ ఓ.ఇప్పటికే విభూతి మఠం, రుద్రాక్షమఠం పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తి అయ్యాయని, ఘంటామఠం పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.అన్ని మఠ ప్రాంగణాలు ఆహ్లాదకరంగా ఉండేందుకు పచ్చదనాన్ని ( ల్యాండ్ స్కేపింగ్) అభివృద్ధి చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా మఠాల ప్రాంగణములో బిల్వం, కదంబం లాంటి దేవతా వృక్షాలను నాటాలన్నారు.పంచమఠాల పనులు పూర్తయినవెంటనే భక్తులు ఈ మఠాలన్నింటిని ఒకేసారి దర్శించుకునేందుకు వీలుగా అన్ని మఠాలను కలుపుతూ ఒకే సర్క్యూట్ గా ఏకరహదారి పనులను ప్రారంభించాలన్నారు.
విభూదిమఠం ముందుభాగంలో ప్రాచీన మెట్ల మార్గానికి కూడా తగు మరమ్మతులు చేపట్టి ఆ మార్గాన్ని పునరుద్ధరించే అంశాన్ని కూడా పరిశీలించాలని ఇంజనీరింగ్ అధికారులను ఈ ఓ ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయప్రాంగణంలోని స్వామివార్ల యాగశాల ఉత్తరభాగం, నాగులకట్ట ప్రాంతం మొదలైనచోట్ల చేప డుతున్న బండపరుపు పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు ఈ ఓ.
ఆలయమాడవీధుల ( శివవీధులు) అభివృద్ధి గురించి చర్చించారు. మాడవీధులను మరింతగా అభివృద్ధి పరిచేందుకు తగు నివేదికలు రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులనుఈ ఓ ఆదేశించారు.తరువాత పారిశుద్ధ్య విభాగపు కార్యకలాపాలను సమీక్షించారు. పారిశుద్ధ్య నిర్వహణకు గాను మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో చేస్తున్నట్లుగా క్షేత్రపరిధిని జోన్లుగా విభజించాలన్నారు.ఒక్కొక్క జోనుకు వివిధ విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులను సమన్వయ అధికారిగా నియమించాలన్నారు. దీనివలన పారిశుద్ధ్య నిర్వహణ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలు కలుగుతుందన్నారు.
క్షేత్రపరిధిలో ప్లాస్టిక్ నిషేధం పట్ల స్థానికులలోనూ, భక్తులలోనూ మరింత అవగాహన కల్పించాలన్నారు ఈ ఓ. ఇందుకుగాను ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు.
పరోక్షసేవల నిర్వహణ సమీక్ష:
శ్రీశైలక్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు ఆయా పరోక్ష సేవలను జరిపించే వీలుగా ఈ సేవల గురించి మరింత ప్రచారాన్ని కల్పించాలని ఆలయం, ప్రజాసంబంధాలు, ఐ.టి విభాగాన్ని ఆదేశించారు ఈ ఓ. ప్రస్తుతం పరోక్షసేవలలో 10 సేవలు నిర్వహిస్తున్నారని, పరోక్ష విధానం లో మరిన్ని సేవలను జరిపే అంశాన్ని పరిశీలించాలని ఆలయ విభాగాన్ని ఆదేశించారు.