
శ్రీశైలదేవస్థానం:నవంబరు 5వ తేదీ నుండి డిసెంబరు 4వ తేదీ వరకు కార్తిక మాసోత్సవాలు నిర్వహిస్తున్న
సందర్భంగా కార్తిక మాసంలో భక్తులకు కల్పించవలసిన దర్శనఏర్పాట్ల పై ఈరోజు (01.11.2021) మధ్యాహ్నం ప్రత్యేక సమావేశం జరిగింది.
దేవస్థాన కార్యలయంలో జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలో ఉభయదేవాలయాల ప్రధానార్చకులు, పరిపాలన, పారిశుద్ధ్య, ఆలయ విభాగాల సహాయ కార్యనిర్వహణాధికారులు, ప్రచురణల విభాగపు సంపాదకులు, ప్రజాసంబంధాల అధికారి, వసతి, గణాంక విభాగాల పర్యవేక్షకులు, ముఖ్యభద్రతాధికారి, సిస్టం అడ్మినిస్ట్రేటర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రానున్న కార్తికమాసంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం ఏర్పాట్లు ఆర్జిత సేవా నిర్వహణ గురించి సుదీర్ఘంగా చర్చించారు.
గత నెల 25వ తేదిన కార్తికమాసోత్సవాల సన్నాహక సమావేశంలో కూడా ప్రధానంగా స్వామివారి దర్శన ఏర్పాట్లు, గర్భాలయ అధిషేకల నిర్వహణపై చర్చించారు.
ఈ సమావేశంలో ఉభయదేవాలయాల ప్రధానార్చకులు, అధ్యాపక స్థానచార్యులు), అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.సదరు సమావేశంలో పాల్గొన్న వైదిక సిబ్బంది, పరిపాలన సిబ్బంది ఏకగ్రీవ నిర్ణయం మేరకే కార్తికమాసంలో స్వామివారి గర్భాలయ అభిషేకాల నిలుపుదల, శ్రీస్వామివారి స్పర్శదర్శనం నిలుపుదలపై నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఇటీవల కార్యనిర్వహణాధికారి ఏకపక్షంగా స్పర్శదర్శనం నిలుపుదల చేసినట్లుగా కొందరు అభిప్రాయపడుతున్నట్లుగా దేవస్థానం దృష్టికి వచ్చింది.
సన్నాహక సమావేశంలో ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం మేరకే కార్తికమాసంలో గర్బాలయ అభిషేకాలు ,స్పర్శదర్శనం నిలుపుదల నిర్ణయం తీసుకున్నారని అధికారికంగా తెలిపారు.
దర్శన విషయమై సామాజిక మాధ్యమాలలో వచ్చిన అభిప్రాయాలను పరిగణన లోనికి తీసుకొని తిరిగి ఈ రోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసారు.
ఈ సమావేశంలో కూడా అందరు వైదిక సిబ్బంది, పరిపాలన సిబ్బంది అందరు కూడా భక్తుల సౌకర్యార్థమై కార్తికమాసంలో గర్భాలయ అభిషేకాలు, స్పర్శదర్శనం నిలుపుదల చేయాలని ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
కోవిడ్ నివారణ ముందు చర్యలలో భాగంగా కూడా గర్భాలయ అభిషేకాలు , స్పర్శదర్శనం నిలిపివేశారు.
సమావేశంలో తీసుకున్న అభిప్రాయం మేరకు కార్తికమాసంలో భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించాలని నిర్ణయించారు.
ఈ విషయమై భక్తులందరూ సహకరించవలసినదిగా దేవస్థానం కోరింది.