సాంప్రదాయబద్ధంగా శ్రీశైల గిరిప్రదక్షిణ
శ్రీశైలదేవస్థానం: ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఈ రోజు (20.10.2021) వతేదీన శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం సాంప్రదాయబద్ధంగా నిర్వహించింది. స్వయంగా ఈ ఓ ఎస్.లవన్న ఇతర అధికారులు , సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా గత మార్చి నెలలో ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారు.
అయితే కోవిడ్ కారణంగా ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం చైత్రమాసము నుంచి (ఏప్రియల్ నుండి) నిలిపివేశారు.
ప్రస్తుతం ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఆయా ఏర్పాట్లు చేసారు.
ఈ రోజు సాయంత్రం (20.10.2021) 5.30గంటలకు శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేబు చేయించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయప్రాంగణములో ఈ పల్లకీసేవ జరిగింది. తరువాత శ్రీస్వామి అమ్మవార్ల పల్లకీ ఊరేగింపుతో శ్రీశైల గిరిప్రదక్షిణ ప్రారంభమైంది.
ఆలయ మహాద్వారం నుండి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధరమండపం, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, మల్లికార్జునసదన్, బయలువీరభద్రస్వామి ఆలయం, అక్కడ నుండి వలయ రహదారి మీదుగా గణేశసదనం, సారంగధర మండపం, గోశాల, మల్లమ్మ మందిరం (మల్లమ్మకన్నీరు), పుష్కరిణి వద్దకు చేరడం విశేషం. అక్కడి నుండి తిరిగి నందిమండపం వద్దకు , నందిమండపం నుండి ఆలయమహాద్వారం వద్దకు చేరుకోవడంతో ఈ గిరిప్రదక్షిణ ముగింపు గా నిర్ణయించారు.
శ్రీశైలక్షేత్రములోని ప్రాచీనమఠాలను, ఆలయాలను భక్తులచేత దర్శింపజేయిస్తూ వారిలో భక్తిభావాలను మరింతగా పెంపొందింపజేయాలని, అదేవిధంగా క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ గిరిప్రదక్షిణను ఏర్పాటు చేసారు.
ఇల కైలాసంగా ప్రసిద్ధమైన శ్రీశైల మహాక్షేత్రములో గిరిప్రదక్షిణ చేయడం ఎంతో ఫలప్రదముగా చెప్పబడుతోంది.
| కళారాధన – హరికథ
దేవస్థానము నిర్వహిస్తున్న “కళారాధన” (నివేదన) కార్యక్రమంలో భాగంగా ఈ రోజు (20.10.2021) వై. నాగరాజు భాగవతార్, పార్వతి నగర్ (మైదుకూరు), కడప జిల్లా వారిచే త్రిపురాసుర సంహారం హరికథ కార్యక్రమం జరిగింది.
దక్షిణమాడ వీధి, హరిహరరాయగోపురం వద్ద ఈ రోజు సాయంకాలం గం. 6.30 ని॥ ల నుండి ఈ హరికథ కార్యక్రమం ఆకట్టుకుంది.
ఈ హరికథ కార్యక్రమానికి తబల సహకారాన్ని వై.సుధాకర్ , హార్మోనియం సహకారాన్ని వై.రాజేష్ అందించారు.
రాష్ట్ర దేవదాయశాఖ కమి షనర్ వారి ఉత్తర్వుల మేరకు ఈ కళారాధన కార్యక్రమములో వారంలో మూడు రోజుల పాటు భక్తులరద్దీ అధికంగా ఉండే శని, ఆది, సోమవారాలలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసారు.
శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ కళారాధన (నివేదన) కార్యక్రమాలు చేస్తున్నారు.
ఈ కార్యక్రమాలలో ముఖ్యంగా స్థానిక కళాకారులకు , జిల్లాలోని కళాకారులకు ప్రాధాన్యం ఇస్తారు.
| రేపటి నిత్య కళారాధన
రేపు (21.10.2021) జి. రాజశేఖర్, గడివేముల, మంచాలకట్ట గ్రామం వారిచే బుర్రకథ కార్యక్రమం ఏర్పాటు చేసారు.
లక్షకుంకుమార్చన:
ఈ రోజు (20.10.2021) శ్రీ అమ్మవారికి లక్షకుంకుమార్చన జరిగింది.
ఈ లక్షకుంకుమార్చనలో భక్తులు పరోక్షసేవగా పాల్గొనే అవకాశం కూడా కల్పించారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, మొదలైన ఇతర రాష్ట్రాల వారు కూడా ఈ పూజలను జరిపించుకుంటున్నారు. అదేవిధంగా అమెరికా, న్యూజిలాండ్ నుంచి కూడా ప్రవాస భారతీయులు లక్షకుంకుమార్చనను జరిపించుకోవడం ప్రత్యేకం.
కాగా ఈ రోజు సాయంకాలం లక్షకుంకుమార్చన సంప్రదాయ రీతిలో జరిగింది.
లక్షకుంకుమార్చనలో ముందుగా పూజాసంకల్పాన్ని తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజను జరిపారు.అనంతరం లక్షకుంకుమార్చన జరిగింది.
కాగా మంగళకరమైన ద్రవ్యాలలో కుంకుమకు ఎంతో ప్రాధాన్యం ఉందని,ఈ కుంకుమ ద్రవ్యముతో అమ్మవారిని అర్చించడం విశేష ఫలదాయకమని పండితులు పేర్కొంటున్నారు.
ఈ లక్షకుంకుమార్చన జరిపించుకోవడం వలన కష్టాలు తొలగిపోతాయని, సర్వశుభాలు కలుగుతాయని, అభీష్టాలు సిద్ధిస్తాయని, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని, సంసారం వృద్ధిలోకి వస్తుందని, సంతాన సౌఖ్యం కలుగుతుందని, పూర్వజన్మదోషాలు తొలగిపోతాయని నమ్మకం.
కాగా శ్రీశైలక్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో ఆయా ఆర్జిత సేవలను పరోక్షంగా జరిపించుకునేందుకు వీలుగా దేవస్థానం ఈ ఆర్జితపరోక్షసేవలను నిర్వహిస్తోంది.
భక్తులందరు కూడా ఈ పరోక్షసేవ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం కోరింది.
ఇతర వివరములకు దేవస్థానం సమాచార కేంద్రం ఫోన్ నంబర్లు 83339 01351/52/53/ 54/55/56 లను సంప్రదించవచ్చును.
* G. Anantha Ramu, IAS, Spl Chief Secretary to Govt. BC Welfare and Labour, FB, IMS Department
visited temple. officials received with maryaadha. *Uyala Seva performed in tradition.
Post Comment