శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2021 సెప్టెంబ‌రు 14: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని  మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం  శాస్త్రోక్తంగా నిర్వహించారు. కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చ‌న, శుధ్ధి నిర్వహించారు. ఆనంతరం ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం తో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ కార‌ణంగా క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌ను ర‌ద్దు చేశారు.

12 పరదాలు విరాళం :

హైదరాబాదుకు చెందిన శ్రీ సాయిరాం అనే భ‌క్తుడు ఈ సంద‌ర్భంగా ఆలయానికి  12 పరదాలు  విరాళంగా అందించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ  ఈవో శ్రీమతి క‌స్తూరిబాయి, ఏఈవో ప్ర‌భాక‌ర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌  శేష‌గిరి, అర్చ‌కులు  బాబుస్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  రాజేష్ ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

సెప్టెంబరు 18 నుండి 20వ‌ తేదీ వరకు పవిత్రోత్సవాలు

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 18 నుండి 20వ‌ తేదీ వరకు
పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జ‌రుగ‌నున్నాయి.  కోవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలను ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. సెప్టెంబ‌రు 17న సాయంత్రం ప‌విత్రోత్స‌వాల‌కు అంకురార్పణ నిర్వ‌హిస్తారు.

సెప్టెంబ‌రు 18న పవిత్ర ప్రతిష్ఠ, సెప్టెంబరు 19న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 20న మహాపూర్ణాహుతి చేప‌డ‌తారు. చివ‌రిరోజు మ‌ధ్యాహ్నం 3 నుండి 5 గంట‌ల వ‌ర‌కు స్న‌ప‌న‌తిరుమంజ‌నం, ఆల‌య ప్రాంగ‌ణంలో చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు.

వ‌ర్చువ‌ల్ విధానంలో భ‌క్తులు పాల్గొనే అవ‌కాశం

ప‌విత్రోత్స‌వాల్లో పాల్గొనాల‌ని భావించే భ‌క్తుల‌ను శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వ‌ర్చువ‌ల్ సేవ‌లో అనుమ‌తించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. ఈ సేవా టికెట్ ధ‌ర‌ను రూ.1001/-గా నిర్ణ‌యించారు. www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా వ‌ర్చువ‌ల్ టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు. ఈ సేవ‌లో పాల్గొనే గృహ‌స్తుల‌ను(ఇద్ద‌రిని) 90 రోజుల్లోపు రూ.100/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న క్యూలైన్ ద్వారా ఉచితంగా  శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

సెప్టెంబ‌రు 17న అంకురార్ప‌ణం రోజున క‌ల్యాణోత్స‌వం, ల‌క్ష్మీపూజ‌, ఊంజ‌ల్ సేవ, సాయంత్రం బ్రేక్ ద‌ర్శ‌నాన్ని టిటిడి ర‌ద్దు చేసింది. సెప్టెంబ‌రు 18 నుండి 20వ తేదీ వ‌రకు మూడు రోజుల పాటు  క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ, ఉద‌యం, సాయంత్రం బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్ద‌య్యాయి.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.