– వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో డ్రై ఫ్లవర్ టెక్నాలజిపై ఎంఓయు
– మల్టీ కలర్ లో సప్తగిరి మాస పత్రిక పునః విడుదల
– టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి
తిరుమల, 13 సెప్టెంబరు 2021: తిరుపతి శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణశాలలో అగరబత్తుల తయారీ కేంద్రాన్ని సోమవారం టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, తిరుపతి యం.ఎల్.ఏ భూమన కరుణాకర్‌రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో డ్రై ఫ్లవర్ టెక్నాలజిపై ఎంఓయు కుదుర్చుకున్నారు. మల్టీ కలర్ తో ఆకర్షణీయంగా రూపొందించిన సప్తగిరి మాస పత్రికను పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ….
ఏడు బ్రాండ్లతో అగరబత్తులు –
టిటిడి ఆలయాల్లో స్వామి, అమ్మవార్ల కైంకర్యాలకు ఉపయోగించిన పుష్పాలతో సప్తగిరులకు సూచికగా ఏడు బ్రాండ్లతో పరిమళభరితమైన అగరబత్తులు తయారు చేసి సోమవారం నుండి భక్తులకు అందుబాటులోనికి తీసుకువచ్చినట్లు చెప్పారు. టిటిడి ఆలయాల్లో పూజలు, అలంకరణలకు వినియోగించే పుష్పాలు వృథా కాకుడదని అగరబత్తుల తయారీని ప్రారంభించామన్నారు. స్వామివారిపై ఉన్న భక్తితో బెంగుళూరుకు చెందిన దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ స్వంత ఖర్చులతో యంత్రాలు ఏర్పాటు చేసి, సిబ్బందిని నియమించుకుని అగరబత్తులు తయారు చేసి టీటీడీ కి అందిస్తోందన్నారు.
ఎస్వీ గోశాలలోని ప్లాంట్‌లో 10 యంత్రాల ద్వారా రోజుకు 3.50 లక్షల అగరబత్తుల తయారీ జరుగు తోందన్నారు. టిటిడి ఎలాంటి లాభాపేక్ష లేకుండా అగరబత్తులు విక్రయిస్తుందన్నారు. ఇందులో అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, తుష్టి, దివ్యసృష్టి, దివ్యదృష్టి బ్రాండ్లు నేటి నుంచి తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద, త్వరలో తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో విక్రయించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వినియోగించే పుష్పాలను అగరబత్తుల తయారీలో వినియోగించడం లేదని ఛైర్మన్ వివరించారు.
డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో డ్రై ఫ్లవర్ టెక్నాలజిపై ఎంఓయు –
టిటిడి ఆలయాల్లో వినియోగించిన పూలతో స్వామి, అమ్మవార్ల ఫోటోలు తయారు చేయడానికి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో ఎంఓయు కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం తిరుపతిలోని ఆ విశ్వవిద్యాలయంకు చెందిన సిట్రాస్ రిసెర్చ్ స్టేషన్‌లో మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. రూ.83 లక్షలతో పరికరాలు, శిక్షణకు నిధులు టిటిడి సమకురుస్తుందని, దీనికి బదులుగా స్వామివారి ఫోటోలతో పాటు, క్యాలండర్లు, కీ చైన్లు, పేపర్ వెయిట్లు, రాఖీలు, క్యాలండర్లు, డ్రై ఫ్లవర్ మాలలు తదితరాలు తయారు చేసి టిటిడికి ఇస్తారని చెప్పారు. త్వరలో వీటిని భక్తులకు విక్రయించేందుకు చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ తెలిపారు.
ఉద్యాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా. గోపాల్, టిటిడి జనరల్ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ రమణ ప్రసాద్ ఎంఓయుపై సంతకాలు చేశారు. ఎంఓయు పత్రాలను టిటిడి ఛైర్మన్, ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ టి.జానకిరామ్ మార్చుకున్నారు.
మల్టీ కలర్ తో ఆకర్షణీయంగా సప్తగిరి మాస పత్రిక –
శ్రీవారి ఆశీస్సులతో టిటిడి ఆర్ష ధర్మ ప్రభోదం కోసం 1949వ సంవత్సరంలో సప్తగిరి పత్రికను బులెటిన్‌గా ప్రారంభించిందని చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. 1970వ సంవత్సరం నుండి తెలుగు, తమిళం, కన్నడ, ఆంగ్లం, హిందీ భాషల్లో, 2014వ సంవత్సరం నుండి సంస్కృత భాషలో ముద్రణ ప్రారంభమైందన్నారు. 2016వ సంవత్సరం నుంచి సప్తగిరిని పూర్తిగా రంగుల్లో పాఠకులకు అందిస్తున్నామన్నారు.ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆధ్యాత్మిక పత్రికల్లో అగ్రగామిగా ఉందన్నారు.
సప్తగిరి మాస పత్రిక ఆరు భాష్లల్లో పునఃప్రారంభమైందని, ఇందులో అనేక కొత్త శీర్షికలతో, ధారావాహికలతో పాఠకులకు నిరంతరాయంగా అందుతుందని చెప్పారు.
అంతకుముందు అగరబత్తుల తయారీ ప్లాంట్ వద్ద శ్రీవారి చిత్రపటానికి ఛైర్మన్, ఎమ్మెల్యే, ఈవో, అదనపు ఈవోలు పూజలు నిర్వహించి ప్లాంట్‌ను ప్రారంభించారు. తరువాత ప్లాంట్‌లో అగరబత్తులు తయారుచేసే యంత్రాల పనితీరును పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జెఈవో శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, సూళ్ళూరుపేట యం.ఎల్.ఏ సంజీవయ్య, పశు వైద్య విశ్వవిద్యాలయం ఉప కులపతి డా.పద్మనాభరెడ్డి, టీటీడీ సిఇ నాగేశ్వరరావు, గో సంరక్షణ శాల డైరెక్డర్ డా.హరనాథ రెడ్డి, దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్, ఆశోక్, శ్రీ హర్ష, సప్తగిరి మాస పత్రిక ముఖ్య సంపాదకులు రాధా రమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుమలలో నాలుగు కౌంటర్లలో అమ్మకాలు ప్రారంభం
టీటీడీ తయారు చేయించిన అగరబత్తులు సోమవారం నుంచి తిరుమల లో భక్తులకు విక్రయానికి అందుబాటులో ఉంచారు. తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద మూడు కౌంటర్లు, శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న పుస్తకాల విక్రయశాల వద్ద, ఒక కౌంటర్లో అగరబత్తుల విక్రయాలు ప్రారంభమయ్యాయి.