3 న ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

 శ్రీశైల దేవస్థానం:ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేవస్థానం శ్రావణ నాల్గవ శుక్రవారం రోజు (03.09.2021) న సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహిస్తోంది. శ్రావణ రెండవ శుక్రవారం (20.08.2021) రోజున కూడా ఈ వ్రతాలను నిర్వహించింది.

ప్రస్తుతం ఈ వ్రతాలలో దాదాపు 500 మందికి దాకా చెంచు భక్తులకు,  200 మంది దాకా ఇతర భక్తులకు అవకాశం కల్పిస్తారు. చెంచు భక్తులను ఎంపిక చేయడంలో స్థానిక సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ వారి పూర్తి సహాయ సహకారాలను తీసుకున్నారు.

కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలలోని వివిధ గూడాలకు చెందిన చెంచు భక్తులు ఈ వ్రతములో పాల్గొంటున్నారు.

 పరోక్షసేవ ద్వారా భక్తులు పాల్గొనే అవకాశం కల్పించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరింపజేస్తారు.

ఆలయ ఉత్తర ద్వారం ఎదురుగా ఉన్న చంద్రవతి కల్యాణ మండపంలో ఈ వ్రతాలను ఏర్పాటు చేసారు. ఈ వ్రతానికి కావలసిన పూజాద్రవ్యాలనన్నింటినీ దేవస్థానమే సమకూరుస్తుంది.

వ్రత కార్యక్రమంలో పాల్గొనే ప్రతీ ముత్తైదువ కోసం వేర్వేరు కలశాలను నెలకొల్పి శాస్త్రోక్తంగా  ఈ వ్రతం నిర్వహిస్తారు.

అదేవిధంగా వ్రతాన్ని జరిపించుకునే ముత్తైదువులకు అమ్మవారి శేషవస్త్రాలుగా రవికగుడ్డ, పూలు, గాజులు ప్రసాదం ఇస్తారు. వ్రతానంతరం ముత్తైదువులందరికి వారు ధరించేందుకు వీలుగా శ్రీస్వామిఅమ్మవార్ల కైలాస కంకణాలు కూడా అందిస్తారు.

వ్రతానంతరం ముత్తైదువులందరికి శ్రీస్వామి అమ్మవార్ల దర్శనం కల్పిస్తారు. దర్శనానంతరం దేవస్థానం అన్నపూర్ణభవనంలో  భోజన సదుపాయం కూడా కల్పిస్తారు.

భక్తులలో మన సనాతన ధర్మంపై అవగాహనకల్పించి, వారిలో ధార్మిక చింతనను పెంపొందించేందుకు ఈవ్రతాలు చేస్తున్నారు.

మన వైదిక సంప్రదాయంలో శ్రావణమాసాన వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం అనాదిగా వస్తోంది. ఈ వ్రత ఆచరణను గురించి పరమేశ్వరుడు స్వయంగా పార్వతికి చెప్పినట్లు స్కాంద,భవిష్యోత్తర పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని చేయడం వలన లక్ష్మీ కటాక్షం లభించి సకల శుభాలు, ఐశ్యర్యం లభిస్తాయని చెబుతారు.

print

Post Comment

You May Have Missed