
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా ఈ రోజు (28.08.2021)న కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న దేవస్థానం వైద్యశాల, దర్శనం క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్, ఆర్జితసేవ కౌంటర్లు, విరాళాల సేకరణ కేంద్రం, మాడవీధులు మొదలైన వాటిని పరిశీలించారు.
ఈ పరిశీలనలో కార్యనిర్వహణాధికారి ముందుగా వైద్యశాలను పరిశీలించారు. వైద్యశాలలో రోజువారిగా వచ్చే ఓపి పేషేంట్ల వివరాలను పరిశీలించారు. వైద్యం కోసం వచ్చే రోగుల సంఖ్యకనుగుణంగా దేవస్థానం వైద్యశాలలో ఔషధాలను అందుబాటులో ఉంచాలన్నారు. వైద్యశాలకు అవసరమైన మందులను సమకూర్చుకోవడంలో దాతల సహకారాన్ని కూడా పొందాలని సూచించారు.అదేవిధంగా వైద్యశాలలో సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు.
కార్యనిర్వహణాధికారి క్యూకాంప్లెక్సు పరిశీలించారు. క్యూ కాంప్లెక్స్ లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూలైన్లన్నీ క్రమబద్ధంగా ఉండేటట్లు తగు చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. క్యూలైన్లన్ని కూడా భక్తుల కు మరింత సౌకర్యకరంగా ఉండేటట్లు తీర్చిదిద్దాలన్నారు. ముఖ్యంగా క్యూకాంప్లెక్స్ వద్ద గల శౌచాలయాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తుండాలన్నారు. అదే విధంగా క్యూ కాంప్లెక్స్, క్యూలైన్ల వద్ద మరిన్ని మార్గసూచికలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అనంతరం కార్యనిర్వహణాధికారి ఆర్జిత సేవ కౌంటర్లను పరిశీలించారు. ఆర్జితసేవ కౌంటర్ల వద్ద ఎలాంటి తొక్కిసలాటలు లేకుండా క్రమపద్ధతిలో భక్తులు సేవా టికెట్లు పొందే విధంగా క్యూలైన్ల నిర్వహణ ఉండాలన్నారు.తరువాత విరాళాల సేకరణ కేంద్రాన్ని సందర్శించారు. రోజువారిగా వచ్చే విరాళాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. దేవస్థానం నిర్వహిస్తున్న ఆయా విరాళాల పథకాలను వివరంగా భక్తులకు తెలియజెబుతుండాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు.
కార్యనిర్వహణాధికారి ఆలయమాడవీధులను పరిశీలించారు. ఎప్పటికప్పుడు మాడవీధులను శుభ్రపరుస్తూ శుచిశుభ్రతల పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు.ముఖ్యంగా భక్తులందరు వారికి కావాలసిన సమాచారాన్ని పొందేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకుగాను ప్రధాన కూడళ్ళు, అవసరమైన ఇతర ప్రదేశాలలో మార్గసూచికలను ఏర్పాటు చేయాలన్నారు.