సీనియర్ జర్నలిస్ట్ ముళ్ళపూడి సదాశివ శర్మ (62) శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. గత వారం రోజులు గా జ్వరం తో బాధపడుతున్న ఆయనకు గుండె పోటు రావడంతో గత రాత్రి ఆస్పత్రిలో చేర్చారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో కోలుకుని మళ్లీ తెల్లవారు జామున గుండెపోటు రావడంతో ఆయన మరణించారు. సదాశివ శర్మ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు జర్నలిజం వృత్తి లోనే కొనసాగారు.
హిందూస్థాన్ సమాచార్,ఎన్ ఎస్ ఎస్ వార్తా సంస్థ ల్లో కొంతకాలం విలేఖరి గా, ఆ తర్వాత ఈనాడులో చాలా కాలం ఉప సంపాదకుని గా, డెస్క్ ఇన్ చార్జిగా పని చేశారు. తర్వాత ఆంధ్ర భూమి లో న్యూస్ ఎడిటర్ గా పని చేశారు. ఎక్స్ ప్రెస్ గ్రూప్ ఆంధ్రప్రభ సండే డెస్క్ ఇన్ చార్జిగా పని చేశారు. కొద్దికాలం కృష్ణాపత్రికలో పని చేసిన తర్వాత హిందీ మిలాప్ లో న్యూస్ ఎడిటర్ గా పనిచేశారు.
కొత్త యాజమాన్యం వచ్చాక ఆంధ్రప్రభ సంపాదకునిగా పనిచేశారు. చివరిగా ఆంధ్ర భూమిలో ఎం.వి.ఆర్.శాస్త్రి తర్వాత ఏడాది పాటు సంపాదక బాధ్యతలు కూడా నిర్వహించారు. లాక్ డౌన్ పేరుతో ఆంధ్రభూమిని మూసివేయడంతో అప్పటి నుంచి ఖాళీగానే ఉంటున్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో జర్నలిజంపై పాఠాలు కూడా చెప్పేవారు.
ఆరోగ్య సమస్యలు ఎదురైనా, ఉద్యోగ సంబంధ సంక్షోభాలు ఎదురైనా ఎల్లప్పుడూ చిరునవ్వుతో పలకరిస్తుండేవారు. యువ పాత్రికేయులను ప్రోత్సహిస్తుండేవారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు హిందీ ప్రసంగాలు తయారు చేసి, వాటిని ప్రసంగించే విషయంలో సహకారం అందించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో ఆయనకు కూడా హిందీ భాష విషయంలో సహకారం అందించారు.
ప్రధాని నరేంద్ర మోడీ ‘మన్ కి బాత్’ కార్యక్రమాన్ని దూరదర్శన్ కోసం సదాశివశర్మ తెలుగులో చాలా కాలంపాటు అనువదించేవారు.
సీనియర్ పత్రికా సంపాదకులు, బహుభాషా కోవిదుడు, హిందీ, తెలుగు భాషలో నిష్ణాతుడు సదాశివ శర్మ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. సదాశివ శర్మ ఉత్తమ జర్నలిస్టుగా పేరొందారని నివాళులు అర్పించారు.
– Pulipaka Satyamurthy Tributes
శర్మా, అలసిపోయావా?
ఎన్నో పోరాటాలు చేశావు, ఎప్పుడూ అలసిపోలేదే. ఎన్నో సార్లు పల్లాల్లోకి దొర్లిపోయావు… మళ్లీ పైకి ఎక్కివచ్చావు తప్ప అలసిపోలేదే… ఎంతో మంది నీ భుజాలపై కాళ్లేసి తొక్కుకుంటూ వెళ్లినా… నీ భుజాలు అలసిపోలేదే… ఇప్పుడెందుకు అకస్మాత్తుగా నీ గుండె అలసిపోయి… ఆగింది?
తోడు లేకుండా కనీసం చాయ్ తాగేందుకు కూడా వెళ్లని వాడివి ఇప్పుడు ఇలా ఒంటరిగా ఎలా వెళ్లిపోయావు?
జర్నలిజం స్కూలు పెడతామంటే… ఇదుగో వస్తున్నా ఉండు, నా దగ్గర సిలబస్ రెడీగా ఉంది అన్నావు నేను అలాగే ఉన్నాను నీవే మాట తప్పి వెళ్లిపోయావు.
ఈనాడు డెస్క్ లో ఒక మూల కుర్చీలో కూర్చుని యుఎన్ఐ, పిటిఐ కాపీలు ట్రాన్స్ లేట్ చేసే నీవు… ఒక్క సారిగా నీ సీనియర్లను కూడా పక్కకు తోసి ప్రతిభతో డెస్క్ ఇన్ చార్జి అయ్యావు… ఎన్ని రాత్రులు లెడ్ కంపోజ్ చేయించి పేజీలు పెట్టించినా అలసిపోలేదు నువ్వు. రాత్రి క్రయిం రిపోర్టింగ్ ముగించుకుని నేను, డెస్క్ పని పూర్తి చేసుకుని నీవు మనకు తోడు నిశాచరులు రమణ, దుర్గారావు… ఇలా ఖైరతాబాద్ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ వరకూ అర్ధ రాత్రి నడచుకుంటూ వచ్చి దోశలు తినేవాళ్లం… ఏ రోజూ నీవు అలసిపోయినట్లు చెప్పలేదు. పైగా…. మర్నాడు రాత్రే నాంపల్లి వద్దు కాచీగూడా వరకూ నడుచుకుంటూ వెళ్దాం అన్నావు తప్ప అలసిపోలేదే…
అక్కడ నుంచి ఆంధ్రభూమి…. ఎన్ని రాత్రులు పేజీలు పెట్టించినా మళ్లీ తెల్లారేసరికి ఫ్రెష్ గా మళ్లీ డ్యూటీకి వచ్చేసేవాడివి.. ఏనాడూ అలసిపోలేదే..
ప్రభలో నిన్ను నానా నరకయాతన పెట్టినా నీవు ఎవ్వరిని పల్లెత్తు మాట అనేవాడివి కాదు… నువ్వు ఎడిటర్ కావడమే లక్ష్యంగా మేమందరం పని చేశాం… నువ్వు ఎడిటర్ అయ్యావు కానీ సుఖపడలేదు.. నువ్వు సరస్వతీ పుత్రుడివి. తెలుగు….హిందీ… ఇంగ్లీష్ మూడు భాషల్లో జర్నలిజం చేసిన ఏకైక వ్యక్తివి నువ్వేనని మేమంటే నవ్వి ఊరుకున్నావు కానీ గర్వపడలేదు… నిన్ను ఎవరు మోసం చేసినా భరించావు, నీకు ఎవరు ద్రోహం చేసినా సహించావు.. నీకెవ్వరూ సాయం చెయ్యకపోయినా మౌనంగా ఉన్నావు.
జేబులో లక్షరూపాయలు పెట్టుకుని పక్కనోడికి చాయ్ కూడా ఇప్పించని వాడికి, వాడితో పాటు ఉన్న వాళ్లందరికి నీ దగ్గర ఉన్న వంద రూపాయలు ఖర్చుపెట్టి మరీ ఊరుకునేంత మంచితనం నీకు ఎలా వచ్చింది? నీ తెలివితేటల గురించి, నీ మంచితనం గురించి ఆశ్చర్యపడేలోపే నువ్వు మమ్మల్ని వదిలి వెళ్లావు. బ్రెయిన్ స్ట్రోక్ తో నీకు కాలు, చెయ్యి సహకరించకపోయినా నువ్వే అందరి దగ్గరకు ఆటోలో వెళ్లేవాడివి. అందరిని పలుకరించేవాడివి. శర్మా, ఇంత సహనం నీకు ఎలా వచ్చింది?
నిన్ను ఇంత కాలం ఆటోలో తిప్పిన ఆటో డ్రైవర్ నిన్ను కడసారి చూసేందుకు వచ్చాడు శర్మా…. నీ నుంచి లాభ పడ్డవాళ్లుగానీ, నీ నుంచి సాయం పొందిన వాళ్లుగానీ, నీ తెలివితేటలతో మెట్లు ఎక్కిన వాళ్లు గానీ పలువురు రాలేదు శర్మా.
అయితే మాత్రం నీకేం పట్టింపు? నీవు ఇవేం పట్టించుకోవు కదా. అందుకే ఐస్ బాక్సులో కూడా నిబ్బరంగా పడుకుని ఉన్నావు. నీ ఒంటరి పోరాటం ముగిసింది. చివరికి నీ గుండే నీకు సహకరించలేదు…. మేం ఏం చేస్తాము చెప్పు? మాట వరసకు ఇలా అన్నాను కానీ నీకు నేనేం చేయగలను? నీతో బాటు నాదీ పోరాటమే కదా? నీతో సమానంగా కాకపోయినా నా స్థాయిలో నేను నా పోరాటం చేసుకుంటూనే ఉన్నాను కదా? నీకేం చేయగలను?
నువ్వు పోయావని తెలియగానే ఏడ్చాను శర్మా… ఆ కన్నీటిబొట్ల ఆసరాతో మళ్లీ పుట్టు శర్మా…. ఈ సారి మంచివాడిగా పుట్టద్దు శర్మా