
శ్రీశైల దేవస్థానం: గత రెండు సంవత్సరాలుగా కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు నిర్వర్తించి బదిలీపై వెళ్తున్న పూర్వ కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామరావు కు వీడ్కోలు చెప్పేందుకు, నూతన కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టిన ఎస్. లవన్నకు స్వాగతం చెప్పేందుకు దేవస్థానం ఉద్యోగులు ఆత్మీయ సత్కారాన్ని నిర్వహించారు. పలువురు స్థానికులు కూడా ఈ సత్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యాలయ భవనం లోని సమావేశమందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళీ బాలకృష్ణ అధ్యక్షతన వహించారు. ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య అధ్యక్షులు సుబ్బారెడ్డి సత్కార కార్యక్రమ సమన్వయాన్ని చేశారు.
ఈ సమావేశంలో పలువురు దేవస్థానం అధికారులు, ఉద్యోగులు ప్రసంగిస్తూ గత రెండు సంవత్సరాలలో పూర్వ కార్యనిర్వహణాధికారి చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను గురించి ప్రస్తావించారు. పూర్వ కార్యనిర్వహణాధికారి సిబ్బంది అందరితోనూ మమేకమై దేవస్థానం అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారన్నారు. ముఖ్యంగా పరోక్ష సేవలను ప్రవేశపెట్టడం, దేవస్థానం వైద్యశాలలో నిరంతరం వైద్యసేవలను అందుబాటులోకి తేవడం, సంప్రదాయబద్ధంగా ఆయా ఉత్సవాలను నిర్వహించడం, నామమాత్రపు దినబాడుగతో డార్మిటరీ వసతిని దేవస్థానం నిర్వహణలో సామాన్యభక్తులకు అందుబాటులోకి తేవడం, కరోనా వ్యాప్తి అరికట్టడం, శ్రీశైలఖండం, శ్రీశైలవైభవం లాంటి ఆధ్యాత్మిక గ్రంథాలను ప్రచురించడం , గోశాల అభివృద్ధికి చర్యలను చేపట్టడం లాంటి అంశాలలో పూర్వ కార్యనిర్వహణాధికారి చేసిన కృషిని ప్రశంసించారు.
తరువాత పూర్వకార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామరావు మాట్లాడుతూ దేవస్థాన సిబ్బంది అందరి సహాయసహకారాల వల్లనే తమ హయాంలో పలు కార్యక్రమాలను చేపట్టి విజయవంతం చేశామన్నారు. దేవదాయశాఖ మంత్రివెలంపల్లి శ్రీనివాసరావు, స్థానిక శాసనసభ్యులు శిల్పాచక్రపాణిరెడ్డి, దేవదాయశాఖ ఉన్నతాధికారులు మొదలైన వారంతా తమను ఎంతగానో ప్రోత్సహించారన్నారు.
అనంతరం నూతన కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న మాట్లాడుతూ ఉద్యోగులందరి సహకారం తో దేవస్థాన అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు తమవంతు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా దేవస్థాన అభివృద్ధికి దాతల సహకారాన్ని తీసుకుంటామని, ఇందుకోసం ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి, తదనుగుణంగా చర్యలు ఉంటాయన్నారు.ముఖ్యంగా సామాన్య భక్తులు క్యూకాంప్లెక్స్ లో ఎక్కువ సమయం వేచివుండకుండా స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు తగు చర్యలు ఉంటాయన్నారు.
చివరగా పలువురు ఉద్యోగులు, స్థానికులు పూర్వకార్యనిర్వహణాధికారిని, నూతన కార్యనిర్వహణాధికారిని సత్కరించారు.