శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానంలో గురుపౌర్ణమి సందర్భంగా ఈ రోజు (24.07.2021) న ఉదయం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి – హేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్ద దక్షిణామూర్తిస్వామివారికి, వ్యాసమహర్షికి విశేషపూజలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముందుగా పూజా సంకల్పం పఠించి తరువాత మహాగణపతిపూజ చేసారు. ఆ తరువాత దక్షిణామూర్తి , వ్యాసమహర్షి చిత్రపటాలకు షోడశోపచార పూజలు చేసారు.
ఈ పూజల అనంతరం వేదపండితులు వేద పారాయణలను చేశారు. చివరగా అర్చకులు, వేదపండితులు గురుపరంపర మంత్రాలను పఠించారు.
కాగా ఒకే రాశిగా ఉన్న వేదాన్ని నాలుగు విభాగాలుగా చేసి లోకాలకు అందించిన వ్యాసమహర్షి కారణజన్ముడు. వ్యాసమహర్షి అసలు పేరు ” కృష్ణద్వైపాయనుడు”, వేదాలను నాలుగు విభాగాలుగా విభజించి లోకానికి అందించిన కారణంగా ఆయనకు వేదవ్యాసుడు అనే పేరు ప్రసిద్ధమైంది. మంత్రరూపంలో ఉన్న వేదాల యొక్క పరమార్థాన్ని గ్రహించలేని సామాన్యులకోసం వ్యాసమహర్షి మహాభారతాన్ని కూడా రచించాడు. అందువలననే మహాభారత గ్రంథం పంచమవేదంగా పేరొందింది. అదేవిధంగా లోకోద్దరణ కోసం వ్యాసమహర్షి పద్దెనిమిది పురాణాలను కూడా రచించాడు.
లోకంలో ఉండే ప్రతీ విషయాన్ని కూడా వ్యాసమహర్షి తన సాహిత్యంలో పేర్కొన్నాడు . అందుకే ఆయన చెప్పని విషయాలు ఏవీ లోకంలో కనబడవనే భావన ఎంతో ప్రసిద్ధం.
