
*ఈ రోజు (22-7-2021)కర్నూలు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో వై ఎస్ ఆర్ కాపు నేస్తం రెండవ విడత కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జేసీ శ్రీనివాసులు (ఆసరా, వెల్ఫేర్) పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, తదితర అధికారులు, లబ్దిదారులు.*
కర్నూలు, జులై 22 :-కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల పేద మహిళల జీవనోపాధి అవకాశాలు, ప్రమాణాలు మెరుగు పరచడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ అన్నారు.గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండో విడత వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం ప్రారంభించి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేశారు.
స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, జిల్లా కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈడీ ఎం.నాగశివలీల, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లాలోని 6065 మంది కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల పేద మహిళ లబ్ధిదారులకు మంజూరైన రూ. 9,09,75,000 మెగా చెక్కును జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు, లబ్ధిదారులకు అందజేశారు.
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైయస్సార్ కాపు నేస్తం పథకం కాపు సామాజిక వర్గంలోని పేద మహిళల బతుకుల్లో వెలుగు నింపుతుందని అన్నారు.
నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కాపు సామాజిక వర్గములోని కాపు, తెలగ, బలిజ మరియు ఒంటరి కులములకు చెందిన 45 నుండి 60 ఏళ్ళ మధ్య వయస్సున్న పేద కాపు అక్క చెల్లమ్మలకు జీవనోపాధి అవకాశాలు, జీవన ప్రమాణాలు పెంచడానికి మరియు ఆర్ధిక స్వాలంబన దిశగా అడుగువేసి శక్తివంతం చేసి అండగా నిలబడేందుకు “వై.యస్.ఆర్ కాపు నేస్తం” పథకాన్ని రెండో ఏడాది రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారన్నారు.