
శ్రీశైల దేవస్థానం:ఈ నెల 12వ తేదీ, సోమవారం నుంచి భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవలు పునఃప్రారంభమవుతాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ ఆర్జితసేవలను నిర్వహిస్తారు.
ఆర్జిత ప్రత్యక్ష సేవలను ప్రారంభించినప్పటికీ, ఆర్జిత పరోక్షసేవలు కూడా యథాతథంగా కొనసాగుతాయి.
కోవిడ్ కారణంగా గత మే మాసం లో 3వ తేదీ నుంచి ఆర్జిత సేవలను నిలిపివేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణను పరిగిణలోనికి తీసుకొని శ్రీస్వామి అమ్మవార్ల ఆర్జితసేవలు పునఃప్రారంభిస్తున్నారు.
భక్తులు శ్రీస్వామివారికి అలంకారమండపం లో సామూహిక అభిషేకాలు, అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపములో అమ్మవారి కుంకుమార్చనలు, సాక్షిగణపతి ఆలయంలో గణపతి హోమం, శ్రీస్వామివారి యాగశాలలో రుద్రహోమం, మృత్యుంజయహోమం, అమ్మవారి యాగశాలలో చండీహోమం, నిత్యకల్యాణ మండపంలో ఉదయం సుబ్రహ్మణ్యస్వామివారి కల్యాణం, సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవ ఆర్జితసేవలను జరిపించుకోవచ్చు.
భక్తులు ఆర్జిత సేవా టికెట్లను ఆన్-లైన్ ద్వారా, కరెంట్ బుకింగ్ ద్వారాను పొందవచ్చును.
ఆన్-లైన్ ద్వారా పొందే టికెట్లను tms.ap.gov.in లేదా www.srisailadevasthanam.org ద్వారా పొందవచ్చు.
శ్రీస్వామివారి సామూహిక అభిషేకాలను మూడు విడతలుగా అనగా ఉదయం గం.06.30లకు, గం.08.30లకు మరియు గం.11.30లకు జరుపుతారు.
అభిషేక సేవాకర్తలకు కూడా గతం లో వలనే శ్రీస్వామి అమ్మవార్ల అలంకారదర్శనం మాత్రమే కల్పిస్తారు.
అదేవిధముగా అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపం లో అమ్మవారి కుంకుమార్చనలను ఉదయం గం.06.30లకు నుండి మధ్యాహ్నం గం.02.30ల వరకు గంటకు ఒక విడత చొప్పున మొత్తం ఎనిమిది విడతలుగా జరుపుతారు.
-2ఇక సాక్షిగణపతి ఆలయంలో గణపతిహోమం ఉదయం గం.09.00లకు, స్వామివారి యాగశాలలో రుద్రహోమం -మృత్యుంజయహోమం ఉదయం గం.08.00లకు, అమ్మవారి యాగశాలలో చండీహోమం ఉదయం గం.11.00లకు వుంటాయి .
ఆలయ ప్రాగణంలోని నిత్యకల్యాణ మండపంలో ఉదయం గం.09.30లకు శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి కల్యాణం, రాత్రి గం.07.00లకు శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణం నిర్వహిస్తారు.