
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల మహాక్షేత్రాన ప్రధాన ఆలయం లో మల్లికార్జునస్వామివారికి అభిముఖంగా కొలువైవున్న నందీశ్వరస్వామివారి (శనగలబసవన్న స్వామివారి) విశేషపూజలో భక్తులు పరోక్ష ఆర్జిత సేవ ద్వారా పాల్గొనే అవకాశం వచ్చింది.
ప్రతీనెలలో త్రయోదశి రోజున భక్తులు ఈ పూజాదికాలను పరోక్షసేవద్వారా జరిపించుకోవచ్చు.
లోకకల్యాణం కోసం దేవస్థానం ప్రతి మంగళవారం, త్రయోదశి రోజులలో శ్రీ నందీశ్వరస్వామివారికి విశేషపూజాదికాలను నిర్వహిస్తోంది.
ప్రస్తుతం త్రయోదశినాడు నిర్వహించే పూజలో భక్తులు కూడా పరోక్షసేవ ద్వారా పాల్గొనే అవకాశం మొట్టమొదటిసారిగా కల్పించారు.
ప్రతీ త్రయోదశి రోజున సాయంత్రం 5.15 గంటల నుంచి ఈ విశేషపూజాదికాలను వుంటాయి.
ఈ ఆర్జిత సేవలలో భక్తులు ఆన్ లైన్ ద్వారా ఒక్కొక్కపూజకు రూ.1,16/-లను సేవారుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.
భక్తులు సేవారుసుమును www.srisailadevasthanam.org లేదా www.tms.ap.gov.inద్వారా చెల్లింపు చేయవచ్చు.
అదేవిధంగా క్యూ.ఆర్ కోడ్ ను ఉపయోగించి గూగుల్ పే, ఫోన్ పే, బి.హెచ్.ఐ.ఎమ్, పే.టి.ఎమ్ ద్వారా కూడా సేవా రుసుమును చెల్లించవచ్చు.
ఈ స్వామి ఆరాధన వలన ఎన్నో శుభాలు కలుగుతాయని నమ్మకం.
అదేవిధంగా ఈ స్వామికి నానబెట్టిన శనగలను సమర్పించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి.
స్వామివారి రుద్రాభిషేకం, అమ్మవారి కుంకుమార్చన మినహా మిగిలిన సేవలను శ్రీశైలటీవి, యూ ట్యూబ్ ద్వారా దేవస్థానం ప్రత్యక్ష ప్రసారాలను చేస్తోంది.
సేవాకర్తలు ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేందుకు వీలుగా ప్రసార వివరాలు, ప్రసారాల సమయం మొదలైనవాటిని ఎప్పటికప్పుడు సేవాకర్తలకు తెలుపుతారు.
సేవాకర్తలేకాకుండా భక్తులందరు కూడా వీటిని శ్రీశైలటి.వి / యూ ట్యూబ్ ద్వారా వీక్షించవచ్చును. భక్తులందరు కూడా ఈ పరోక్షసేవను సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం కోరింది.
ఇతర వివరములకు దేవస్థానం సమాచార కేంద్ర ఫోన్ నంబర్లు 83339 01351/52/53/54 /55/56 లను సంప్రదించవచ్చును.