తాడేపల్లి: రైతులపై భారం పడకుండా పంటల బీమాను ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
23 నెలల కాలంలో రైతుల కోసం రూ.83 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని చెప్పారు. వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద ఖరీఫ్-2020 సీజన్‌కు సంబంధించి అర్హులైన 15.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,820.23 కోట్ల పరిహారం విడుదల చేసింది. మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి ఉచిత పంటల బీమా నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు.
మన రాష్ట్రంలో ఇవాళ 62 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయ రంగం అన్నది ఆహార భద్రత ఇవ్వడమే కాకుండా ఉపాధి కల్పిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతు బాగుంటేనే, రైతు కూలీ బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుందని గట్టిగా నమ్మి, మీ బాగోగుల కోసం గట్టిగా అడుగులు వేయగలిగాం. 2020 ఖరీఫ్‌లో మన కళ్లేదుటే కొన్ని సందర్భాల్లో భారీ తుపాన్లు, వర్షాల కారణంగా రైతులు నష్టపోయారు. వారందరికీ కూడా మంచి చేస్తూ ఈ రోజు రూ.18020 కోట్లు వైయస్‌ఆర్ ఉచిత పంటల బీమా పరిహారంగా ఈ రోజు బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి ఎటువంటి వివక్ష లేకుండా, పారదర్శకంగా డబ్బులు అందజేస్తున్నాం.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన మీ బిడ్డగా దేవుడి దయతో శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా, ఉగాది నాడు చెప్పిన పంచాంగం ప్రకారం ఈ ఏడాది కూడా మంచి వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని.. రైతులకు మంచి జరగాలని మరొక్క మారు కోరుకుంటూ ఉచిత పంటల బీమా కార్యక్రమానికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
కర్నూలు జిల్లాలో రూ.181.12 కోట్లు భీమా పరిహారం రైతన్నల ఖాతాల్లో జమ : జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి :
కర్నూలు, మే 25 :స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె.సుధాకర్, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వి.భరత్ కుమార్ రెడ్డి, అగ్రికల్చర్ జెడి ఉమామహేశ్వరమ్మ, ఏపిఎంఐపి పిడి ఉమాదేవి, భీమా పరిహారం పొందిన రైతులు లక్ష్మీకాంతరెడ్డి, మోహన్ రెడ్డి, దాలు సూరిబాబు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం డాక్టర్ వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం ఖరీఫ్ -2020 కర్నూలు జిల్లాలోని 1,85,744 మంది రైతులకు 181.12 కోట్ల రూపాయల పరిహారం మెగా చెక్కును జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి, పాణ్యం, కోడుమూరు, నందికొట్కూరు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, డాక్టర్ జె.సుధాకర్, తోగూరు ఆర్థర్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వి.భరత్ కుమార్ రెడ్డి బీమా పరిహారం అర్హులైన రైతులకు అందజేశారు.
జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో 2020 సంవత్సరం ఖరీఫ్ లో కురిసిన అధిక వర్షాలకు 4,71,746 ఎకరాలలో పత్తి, వేరుశనగ, వరి, మొక్కజొన్న, కంది తదితర పంటలు దెబ్బతినడంతో డాక్టర్ వై.యస్.ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద 2020 – ఖరీఫ్ లో పంట నష్టపోయిన 1,85,744 మంది అన్నదాతలకు రూ.181.12 కోట్లు భీమా పరిహారం రైతన్నల ఖాతాల్లో జమ చేశామన్నారు .