శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం సంప్రదాయరీతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. నవాహ్నిక దీక్షతో పదకొండు రోజుల పాటు (04.03.2021 నుండి 14.03.2021వరకు) బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.
ఈ ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు ఆగమశాస్త్రానుసారం జరిగాయి.
యాగశాల ప్రవేశం :
ఉత్సవ నిర్వహణలో భాగంగా ముందుగా కార్యనిర్వహణాధికారి కే. ఎస్ . రామ రావు , స్థానాచార్యులు, అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు సంప్రదాయబద్ధంగా ఆలయప్రాంగణంలోని స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు.
వేదస్వస్తి :
ఆలయప్రవేశం చేసిన వెంటనే వేదపండితులు చతుర్వేదపారాయణలు చేసి వేదస్వస్తి నిర్వహించారు.
శివసంకల్పం :
వేదపఠనం అయిన వెంటనే స్థానాచార్యులు , లోకక్షేమాన్ని కాంక్షిస్తూ బ్రహ్మోత్స సంకల్పాన్ని పఠించారు. దీనికే శివసంకల్పం అని పేరు.
ఈ సంకల్పంలో దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు జరగకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన, ప్రమాదాలు
మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు సంకల్పపఠనం చేశారు.
ప్రజలు రోగాలకు గురికాకుండా, ఆరోగ్యంగా వుండేందుకు, ముఖ్యంగా ఆరోగ్యానికి హాని కలిగించే కరోనా వైరస్ మొదలైన సూక్ష్మాంగజీవులు వ్యాప్తి చెందకుండా నశించాలని కూడా వేదపండితులు, అర్చకులు సంకల్పాన్ని పఠించారు. పుణ్యాహవచనం: గణపతిపూజ తరువాత పుణ్యాహవచనం చేసారు. వృద్ధి, అభ్యుదయాల కోసం ఈ పుణ్యహవచనం చేసారు.
సంకల్పపఠనం తరువాత చండీశ్వరపూజ చేసారు. ఈ బ్రహ్మోత్సవాలు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని ఆధ్వర్యంలో, క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామి పర్యవేక్షణలో, శివపరివార దేవతలలో ఒకరైన చండీశ్వరుని నాయకత్వంలో నిర్వహిస్తారని ప్రతీతి.అందుకే యాగశాల ప్రవేశం తరువాత చండీశ్వరుని ప్రత్యేకంగా పూజాదికాలు జరపించడం సంప్రదాయం.
కంకణ పూజ, కంకణధారణ:
చండీశ్వరపూజ తరువాత కంకణాలకు (రక్షాబంధనాలకు) శాస్తోక్తంగా పూజాదికాలు జరిపించబడ్డాయి. తరువాత కార్యనిర్వహణాధికారి వారు కంకణాన్ని ధరించారు. ఋత్విగ్వరణం:
కంకణధారణ తరువాత ,బ్రహ్మోత్సవాలలో ఆయా వైదిక కార్యక్రమాలు నిర్వహించాలని ఋత్వికులను ఆహ్వానిస్తూ వారికి దీక్షావస్త్రాలను అందజేసే కార్యక్రమానికే ఋత్విగ్వరణం అని పేరు.
అఖండస్థాపన:
ఋత్విగ్వరణం తరువాత అఖండదీపస్థాపన జరిగింది . అనంతరం వాస్తుపూజ తరువాత వాస్తు హోమం చేసారు .
రుద్రకలశస్థాపన:
వాస్తు హోమం తరువాత మండపారాధన చేసి ప్రత్యేక కలశస్థాపన చేసారు. కలశస్థాపన తరువాత కలశార్చన జరిగింది. తరువాత పంచావరణార్చనలు చేసారు.
అనంతరం లోకకల్యాణం కోసం జపానుష్టానాలు జరిగాయి.
కరోనా నివారణ చర్యలు :
ఆలయాన్ని దర్శించే భక్తులను దృష్టిలో ఉంచుకుని, కరోనా నివారణ చర్యలలో భాగంగా పలు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
భక్తులు మాస్కును ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం, శానిటైజర్‌తో చేతులను తరుచుగా శుభ్రపరుచుకోవడం లాంటి ముందుజాగ్రత్తల పట్ల భక్తులకు అవగాహన కల్పించేందుకు ఆలయ ప్రసార వ్యవస్థ (మైక్) ద్వారా నిరంతరం సూచనలు చేస్తున్నారు.