శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భాగంగా ఈ రోజు (24.02.2021) న కార్యనిర్వహణాధికారి కెఎస్.రామరావు వివిధ ప్రదేశాలలో వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన పలు ప్రదేశాలను పరిశీలించారు. 04.03.2021 నుండి 14.03.2021 వరకు 11 రోజులపాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఉత్సవాల నిర్వహణకుగాను వివిధ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
యజ్ఞవాటిక వద్ద (నిర్మాణంలో ఉన్న గణేశసదనానికి ఎదురుగా) తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులకు, కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులకు పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు.
అదేవిధంగా యజ్ఞవాటికవద్ద, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎడమవైపు ప్రదేశం, ఘంటామఠం వెనుకభాగం, దేవస్థానం ఆగమపాఠశాల ఎదురుగాగల ఆరుబయలు ప్రాంతాలలో కార్ పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ పార్కింగ్ ప్రదేశాలలో ఇప్పటికే ప్రారంభించిన జంగిల్ క్లియరెన్స్ పనులను వేగవంతం చేయాలని సూచించారు.ముఖ్యంగా ఈ ప్రదేశాలలో బండరాళ్లు మొదలైనవాటిని తొలగించి తగిన విధంగా చదును చేయాలని సూచించారు.ఆయా పార్కింగ్ ప్రదేశాలకు చేరుకోవలసిన దారులు, పార్కింగ్ స్థలాలు స్పష్టంగా తెలిసేవిధంగా ఫ్లెక్సీబోర్డులు ఏర్పాటు చేయాలని శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు.
ఈపరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళీ బాలకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి, పర్యవేక్షకులు ఎన్. శ్రీహరి, ఉద్యానవన అధికారి లోకేష్, ముఖ్యభద్రతా అధికారి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.