తిరుమల 28 డిసెంబరు 2020: తిరుమల ఆలయం మీద విష ప్రచారం చేయడం ద్వారా ఆలయ పవిత్రతను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ హిందూ ధర్మ వ్యాప్తికి కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న కృషి భక్తులందరికీ తెలుసన్నారు.తిరుమల శ్రీవారి ఆలయం ముందు సోమవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు.
తిరుమల శ్రీవారి ఆలయ ప్రాకారంపై పూర్ణ కలశ ఆకారంలో ఉన్న విద్యుత్ అలంకరణను శిలువగా మార్ఫింగ్ చేసి తాళ పత్ర నిధి Facebook URL తో పాటు మరికొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారన్నారు..శ్రీవారి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు హనుమంత, గరుడ, పూర్ణకుంభ అలంకరణలు చేయడం కొన్ని దశాబ్దాలుగా వస్తోందన్నారు. పవిత్రమైన కళశంను శిలువ గా మార్ఫింగ్ చేసి కుట్ర పూరితంగా దుష్ప్రచారం చేశారని ఆయన చెప్పారు. ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందనీ, కోట్లాదిమంది భక్తుల్లో ఆందోళన రేకెత్తించిందన్నారు. ఈ పోస్ట్ పెట్టిన తాళ పత్ర నిధి Facebook URL , ఇతరులపై పోలీసు కేసు నమోదు చేశామన్నారు.హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుమల క్షేత్రం పై తరచూ కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే వారిని ఉపేక్షించబోమనీ, ఇలాంటి వారిపై టీటీడీ చట్ట పరంగా చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. ధర్మారెడ్డి మీడియా, భక్తులకు సదరు కలశం విద్యుత్ అలంకరణను చూపించారు. చీఫ్ ఇంజినీర్ రమేష్ రెడ్డి, ఎస్ ఈ నాగేశ్వరరావు, ఆలయ డిప్యూటి ఈవో హరీంద్ర నాథ్, ఆలయ ఓఎస్డీ పాల శేషాద్రి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
తిరుమల పవిత్రతను దెబ్బతీసే వారిని ఉపేక్షించ వద్దని పలువురు భక్తులు టీటీడీకి సూచించారు.