శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం సిబ్బందిలో భక్తి భావాలను మరింతగా కలిగింది. వారిలో ధార్మిక చింతనను పెంపొందింపజేయాలనే సంకల్పంతో దేవస్థానం సిబ్బందికి విడతలవారిగా పూజాదికాలు జరిపించుకునే అవకాశాన్ని కల్పించారు.
ఇందులో భాగంగా ఈ రోజు దేవస్థానం భద్రతా సిబ్బంది చేత ఉచితంగా శ్రీ స్వామివారి సామూహిక అభిషేకాలను నిర్వహించారు.
ఆలయ ప్రాంగణంలోని అక్కమహదేవి అలంకార మండపంలో జరిగిన ఈ అభిషేకాలలో సుమారు 80 మందిదాకా భద్రతా సిబ్బంది తమ కుటుంబసభ్యులతో సహా ఈ అభిషేకాది అర్చనలను జరిపారు.
అభిషేకం జరిపించుకున్న సిబ్బంది అందరికి కూడా శ్రీస్వామివార్ల దర్శనం, అమ్మవారి దర్శనం ఏర్పాటు చేసారు. అదేవిధంగా సిబ్బందికి అన్నపూర్ణ మందిరంలో అన్నప్రసాదాల వితరణ చేసారు.
ముందుగా సిబ్బంది అందరి గోత్రనామాలను పఠింపజేసారు. తరువాత భక్తులచేత అభిషేక సంకల్పం చేయించారు. అనంతరం గణపతిపూజను జరిపించి రుద్రమంత్రాలతో ఈ అభిషేకాది అర్చనలు చేసారు.చివరగా సిబ్బంది అందరి చేత శివనామస్మరణ కూడా చేయించారు.
కార్యనిర్వహణాధికారి ప్రసంగిస్తూ జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జునుడు, శక్తి స్వరూపిణి భ్రమరాంబాదేవివారు స్వయంవ్యక్తంగా వెలసిన శ్రీశైలక్షేత్రం సాక్షాత్తు ఇలలో వెలసిన కైలాసమన్నారు. కేవలం శ్రీశైలక్షేత్ర నామాన్ని స్మరించినంత మాత్రానే ఎంతో పుణ్యఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతన్నాయన్నారు.
ఎన్నో జన్మల పుణ్యఫలితంగా మాత్రమే ఈ ఆలయంలో ఉద్యోగించే అవకాశం లభిస్తుందన్నారు.
అందుకే దేవస్థానములో ఉపాధి పొందుతున్న వారందరు కూడా త్రికరణశుద్ధిగా శ్రీ స్వామి అమ్మవార్లపై భక్తి ప్రపత్తులను కలిగి వుండాలన్నారు. కేవలం భక్తి విశ్వాసాల చేతనే శ్రీ స్వామి అమ్మ వార్ల అనుగ్రహాన్ని పొందవచ్చని అన్నారు. దేవస్థానం ధార్మిక సంస్థ అని, అందుకే ఉద్యోగులందరు కూడా భక్తి ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకోవాలన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో సేవలను అందించాలన్నారు. శ్రీశైలాన్ని దర్శించే ప్రతి భక్తుడిని ఒక అతిథిగా భావించాలన్నారు. పూజాదికాలు జరిపించుకున్న సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగిస్తూ సిబ్బంది అందరు కూడా ప్రతిరోజూ తీరిక చేసుకుని ఇంట్లో దీపారాధనలను చేయాలన్నారు. లఘుపూజా పద్దతిలోనైనా శక్తి మేరకు స్వామిఅమ్మవార్లను పూజించాలన్నారు.సిబ్బంది అందరు కూడా స్వామిఅమ్మవార్ల కటాక్షంతో సుఖసంతోషాలు పొందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్వామివార్ల ప్రధానార్చకులు జె.వీరభద్రయ్య, వేదపండితులు గంటి రాధకృష్ణ, ఆలయ విభాగ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం.హరిదాసు, భద్రతా విభాగ పర్యవేక్షకులు శ్రీ శ్రీహరి తదితర సిబ్బంది పాల్గొన్నారు.