మీడియా వ్యతిరేక ధోరణిని పోరాటాలతోనే ఎదుర్కొంటాం

*మీడియా స్వేచ్ఛను  హరిస్తే ఊరుకోం*
———————————-
ఐజేయూ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి హెచ్చరిక
—————————
దేశంలో జర్నలిస్టుల హక్కులను కాలరాస్తూ, మీడియా స్వేచ్ఛను హరించేందుకు పాలకులు చట్టాలు తేవడం సహించరానిదని, దేశ వ్యాప్తంగా ఆందోళనలతో ఈ అప్రజాస్వామిక చర్యలను అడ్డుకుంటామని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. నవంబర్ 16, జాతీయ పత్రికాదినోత్సవాన్ని పురస్కరించుకొని  సోమవారం  తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో నల్లకుంట లోని కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్ కమిషనర్ కార్యాలయం ముందు జర్నలిస్టులు నిరసన తెలిపి ఆ శాఖ అధికారి టి.కె.థామస్ ద్వారా కేంద్ర కార్మిక శాఖ మంత్రికి వినతి పత్రాన్ని పంపించారు.  శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో తాము ఉద్యమలతోనే వర్కింగ్ జర్నలిస్ట్స్ చట్టాన్ని  సాధించుకున్నామని, అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్నిలెక్కచేయక  భావ ప్రకటన స్వేచ్ఛను, జర్నలిస్టుల హక్కులను కాలరాయడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని  ఆందోళన వ్యక్తం చేశారు.
టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ మాట్లాడుతూ, పాలకులకు, ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు మేలు చేసే చట్టాలు తేవాల్సింది పోయి కీడు చేసే విధంగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. మీడియాను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికే పాలకవర్గాలు ఇలాంటి వైఖరిని అనుసరిస్తున్నట్లు  విమర్శించారు.ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మీడియా వ్యతిరేక ధోరణిని తాము పోరాటాలతోనే ఎదుర్కొంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాబీబ్ జిలానీ, ఏ.రాజేష్, తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరి, హెచ్.యు.జె నాయకులు గౌస్, శ్రీనివాస్,  శిగ దయాకర్ గౌడ్, ఉపేందర్ లతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.