తాడేపల్లి: ‘‘బిడ్డకు జన్మనిచ్చే తల్లులు, కడుపులో పెరుగుతున్న బిడ్డలు, పాలు తాగే పసిపిల్లలు, బుడిబుడి అడుగులు వేస్తున్న పసిపిల్లల బాగుకోరి వైయస్ఆర్ సంపూర్ణ పోషణ, వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మూడు పూటలా గుప్పెడు ఆహారాన్ని నోచుకోలేని తల్లిదండ్రులు, వారి పిల్లలు. వీరందరి జీవితాల్లో మార్పు తీసుకురావాలని గట్టిగా నమ్మిన పిమ్మటనే వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అమలు చేస్తున్నామన్నారు. వైయస్ఆర్ సంపూర్ణ పోషణ, వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు 13 జిల్లాల్లోని లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం వైయస్ జగన్ మాట్లాడారు.
సీఎం వైయస్ జగన్ ఏం మాట్లాడారంటే..
వైయస్ఆర్ సంపూర్ణ పోషణ, వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాలు మంచి చేయడంలో సంతృప్తిని ఇచ్చే కార్యక్రమాలివి. గతంలో పిల్లలు ఎలా ఉన్నారు. ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా లేదా..? ఆరోగ్యంగా ఉన్నారా లేదా..? తల్లులు ఎలా ఉన్నారు, వీళ్లకు ఏం చేస్తే మంచి జరుగుతుంది. సమస్యలు లేకుండా ఎలా చేయాలి.. హెల్దీ బాడీ, హెల్దీ మైండ్ ఆర్ ఇంటరిలేటెడ్ ఆలోచన కూడా ఎప్పుడూ జరగలేదు. అందుకే చాలీచాలని విధంగా ఇచ్చామంటే ఇచ్చామన్నట్లుగా గత ప్రభుత్వాల్లో ఈ కార్యక్రమాలకు డబ్బులు ఇచ్చేవారు. సంవత్సరానికి రూ.500 కోట్లు ఇస్తే చాలా గొప్పగా ఇచ్చామని భావించే పరిస్థితిని పూర్తిగా మార్చబోతున్నాం.
మన పిల్లలు రేపటి పౌరులు. వారు ఎలా ఉండాలి.. రేపటి ప్రపంచంలో వారు ముందుండాలా..? లేదా వెనక ఉండాలా..? రేపటి ప్రపంచంతో వారు పోటీ పడే పరిస్థితుల్లో ఉన్నారా..? లేరా..? వారిని ముందుతరాల మాదిరిగా పేదరికంలో మగ్గిపోయేవారిలా విడిచిపెట్టాలా..? అనే ప్రశ్నల నుంచి మార్పు తీసుకురావాలనే దిశగా అడుగులు వేశాం. హెల్దీ బాడీ ఉంటే.. హెల్దీ మైండ్ ఉంటుంది.
నేటి తరంలో చదువుకోలేని తల్లిదండ్రులు, పిల్లలు మూడు పూటలా గుప్పెడు ఆహారాన్ని నోచుకోలేని తల్లిదండ్రులు, వారి పిల్లలు. వీరందరి జీవితాల్లో మార్పు తీసుకురావాలని గట్టిగా నమ్మిన పిమ్మటనే వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అమలు చేస్తున్నాం. ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు, బిడ్డలకు జన్మనివ్వనున్న తల్లులకు, బాలింతలకు వర్తించేలా వైయస్ఆర్ సంపూర్ణ పోషణ, వైయస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం.
ఒక కుటుంబం సామాజికంగా, ఆర్థికంగా, విద్యపరంగా వెనుకబడి ఉంటే అటువంటి కుటుంబాల్లోనే సరిపడా విటమిన్లు, మినరల్స్ లేని బలహీనమైన తల్లులు, పిల్లలు కనిపిస్తారు. పేద సామాజికవర్గాల్లో తల్లులు, పిల్లలు ఆహారంలో పోషక విలువలు లేకపోవడం వల్ల, సరైన ఆహారం, సరిపడా ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల బలహీనత, రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు మనమంతా చూస్తున్నాం. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే.. గర్భవతులుగా ఉన్న స్త్రీలలో దాదాపుగా 52.9 శాతం మందికి రక్తహీనత ఉంది. తక్కువ బరువుతో పుట్టిన, 5 సంవత్సరాల వరకు తక్కువ బరువు ఉన్న పిల్లలు 31.9 శాతం మంది ఉన్నారు. బరువుకు తగ్గట్టుగా ఎత్తు పెరగని ఐదేళ్లలోపు పిల్లలు 17.2 శాతం మంది మన రాష్ట్రంలో ఉన్నారు. వయస్సుకు తగ్గట్టుగా ఎత్తు పెరగని పిల్లలు 31.4 మంది ఉన్నారు. ఈ అంకెలన్నీ ఒకసారి గమనిస్తే మన పిల్లలు, తల్లులు ఎంతటి దుస్థితిలో జీవిస్తున్నారో అర్థం అవుతుంది.
ఈ లెక్కలన్నీ కొత్తగా పుట్టుకొచ్చినవి కాదు.. గతంలో ఉన్నప్పటికీ కూడా పాలనలో మార్పురాక.. వీళ్ల జీవితాలను మార్చాలనే తపన లేక ఇలాగే వదిలేసిన పరిస్థితుల్లో ఈ లెక్కలు కనిపిస్తున్నాయి. ఈ నంబర్లు మారాలి.. పిల్లలకు, తల్లులకు మంచి జరగాలి. పౌష్టికాహారలోపం ప్రభావం తల్లులు, పిల్లల ఎదుగుదల మీదనే కాకుండా.. వాళ్ల మెదడు, ఆలోచన శక్తి మీద కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. ఆకలితో అలమటిస్తుంటే.. ఇంట్లో తినడానికి సరైన ఆహారం లేనట్లయితే.. పిల్లల చదువులు, మేధస్సు, వారి దేహం మీద పౌష్టికాహారలోపం దుష్ప్రభావం కనిపిస్తుంది.
చదువులో, శారీరక శక్తిలో, ఆలోచనలో ఒక కుటుంబం వెనకబాటుకు వారి పిల్లలు కూడా పేదలుగా మిగలడానికి, వారు కూడా బలహీనులుగా ఉండటానికి, వారి పిల్లలకు కూడా ఆ తరువాత అదే పరిస్థితి రావడానికి కారణం. పేదరికం దాని వల్ల వచ్చే ఆహారలోపం కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలనే గట్టి నిర్ణయంతో మనందరి ప్రభుత్వం మీ ముందుకు వచ్చింది.
బిడ్డకు జన్మనిచ్చే తల్లులు, కడుపులో పెరుగుతున్న బిడ్డలు, పాలు తాగే పసిపిల్లలు, బుడిబుడి అడుగులు వేస్తున్న పసిపిల్లల బాగుకోరి వైయస్ఆర్ సంపూర్ణ పోషణ, వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రంలో దాదాపుగా 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో నాడు–నేడు కార్యక్రమం ద్వారా వాటి రూపురేఖలను మార్చబోతున్నాం. అంగన్వాడీలన్నీ కూడా ప్రీప్రైమరీ కేంద్రాలుగా మార్చబోతున్నాం. పెద్దవాళ్లకు మాత్రమే అందుబాటులో ఉండే పీపీ–1, పీపీ–2 తరగతులకు పేదవాళ్లకు కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. బాగా డబ్బులు ఉన్నవారిని ఒకసారి గమనించినట్లయితే.. వారి పిల్లలను బాగా చదివించాలనే తాపత్రయంతో నర్సరీ, కిండర్ గార్డెన్స్, మాంటిస్సోరి, ఎల్కేజీ, యూకేజీ, పీపీ–1, పీపీ–2 ఇలా రకరకాల పేరుతో చదివిస్తుంటారు.
మన పేద పిల్లలను కూడా గొప్పగా చదివించాలనే తపన, తాపత్రయంతో మార్పులు తీసుకువస్తున్నాం. పేదవారి పిల్లలు కూడా పీపీ–1, పీపీ–2 చదువుకొని ఆ తరువాత స్కూళ్లకు వెళ్లే పరిస్థితిని తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇంగ్లిష్ మీడియం చదువుతున్న పెద్దవారి పిల్లల మాదిరిగానే మన పేదింటి పిల్లలు కూడా బడికి వెళ్లేలోపే ప్రీప్రైమరీ విద్యలో ఆట–పాటల ద్వారా ఇంగ్లిష్ మీడియంకు మరింత గట్టి పునాదులు వేయాలనే మంచి ఆలోచనతోనే అంగన్వాడీలను మార్చబోతున్నాం.
ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకించేవారు మరోరూపంలో అంటరానితనాన్ని పోత్సహించడమే. ప్రీప్రైమరీ విధానాన్ని పేదలకు ఇవ్వకూడదంటూ వినిపిస్తున్న కొన్ని అభిప్రాయాలను చూస్తే రూపం మార్చుకున్న అంటరానితనం కనిపిస్తుంది. వీరందరి మనస్తత్వంలో మార్పు రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. అంగన్వాడీలు ఆహారం ఇచ్చే కేంద్రాలుగా కాకుండా.. వాటిల్లో మంచి విద్య, పౌష్టికాహారం, మంచి మనోవికాసానికి కేంద్రాలుగా మార్చాలనే గట్టి తపనతో ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం.
వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ఈ రోజు ప్రారంభిస్తున్నాం. తల్లులకు పోషణ, పిల్లలకు సంరక్షణ, చదువుల్లో విప్లవం ఈ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. రాష్ట్రంలో 55,607 అంగన్వాడీల పరిధిలో నమోదైన గర్భవతులు, బాలింతలు, చిన్న పిల్లలు వీరందరికీ సంపూర్ణ పోషణ పథకం అందించనున్నాం. రాష్ట్రంలో దాదాపు 30.16 లక్షల అక్కచెల్లెమ్మలకు, చిన్నపిల్లలకు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి జరుగుతుంది. రాష్ట్రంలో గిరిజనేతర ప్రాంతాల్లో దాదాపుగా 47,287 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ అంగన్వాడీ కేంద్రాల పరిధిల్లో దాదాపుగా 26.36 లక్షల మంది తల్లులు, పిల్లలు ప్రతి రోజూ మధ్యాహ్న భోజనంతో పాటు, నెలవారి పౌష్టికాహారం అందించడం కోసం ఏకంగా రూ.1,556 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు దారుణం. ఆహారం లేక మామిడిటెంకలు తిని అనారోగ్యానికి గురవుతున్న వార్తలు చూస్తున్నాం. అలాగే అక్కడి అక్కచెల్లెమ్మల్లో రక్తహీనత కూడా ఎక్కువే. పౌష్టిహాకార లోపం ఎక్కువగా ఉందని గమనించి వారి కోసం వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని తీసుకొచ్చాం.
77 గిరిజన మండలాల్లోని 8,320 అంగన్వాడీల పరిధిలో వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అమలవుతుంది. తల్లులు, పిల్లలు మొత్తంగా 3.8 లక్షల మంది ఈ కార్యక్రమం ద్వారా మేలు జరుగుతుంది. దీని కోసం రూ.308 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. మొత్తంగా రూ.1863 కోట్లు సంవత్సరానికి ఈ కార్యక్రమం ద్వారా ఖర్చు చేయబోతున్నామని సంతోషంగా చెబుతున్నాం. గతంలో ప్రభుత్వాలు కేవలం రూ.500 కోట్లు ఖర్చు చేయని పరిస్థితి నుంచి ఈ కార్యక్రమం కోసం ఏకంగా రూ.1863 కోట్లు మనందరి ప్రభుత్వం ఖర్చు చేయబోతున్నామని గర్వంగా చెబుతున్నాను.
ఇంకా ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు కానీ, రోజూ ఒకే తిండికాకుండా మెనూలో మార్పు తీసుకువస్తే తినేందుకు ఆసక్తి ఉండే పరిస్థితులు ఉంటాయి. గతంలో నెలకు రూ.200 ఖర్చు చేయని పరిస్థితి. ఇవాళ మన ప్రభుత్వం గరిష్టంగా రూ.11 వందలు ఖర్చు చేయబోతున్నాం. ఇది చెప్పడానికి సంతోషిస్తున్నాను. వైయస్ఆర్ పోషణ కింద గర్భవతులు, బాలింతలకు ప్రతిరోజూ పెట్టే భోజనంలో అన్నం, పప్పు, ఆకుకూర, కూరగాయలు, సాంబారు, కోడిగుడ్డు, 200 మిలీ లీటర్ల పాలు అందజేస్తాం. ఇవికాకుండా నెలకు ఒక కేజీ రాగిపిండి, ఒక కేజీ సజ్జ, జొన్నపిండి, కేజీ అటుకులు, 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల వేరుశనగ చిక్కీ, 250 గ్రాముల ఎండు ఖర్జూరం అందజేయబోతున్నాం.
వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ కింద బాలింతలు, గర్భవతులకు బెల్లం, మల్టీగ్రేన్ఆటా, ఎండు ఖర్జూరం, సజ్జజొన్న పిండి 500 గ్రాములు ఇవ్వడం జరుగుతుంది. 6 నెలల నుంచి 36 నెలల వయస్సు ఉన్న పిల్లల కోసం సంపూర్ణ పోషణ కింద 2.5 కేజీల బాలామృతం, 25 కోడిగుడ్లు, 2.5 లీటర్ల పాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో అయితే 2.5 కేజీల బాలామృతం, 30 కోడిగుడ్లు, 6 లీటర్ల పాలు ఇవ్వడం జరుగుతుంది. 3–6 సంవత్సరాల పిల్లల కోసం సంపూర్ణ పోషణ పథకం ద్వారా 20 గ్రాముల ఉడికించిన శనగలు, రోజూ కొడిగుడ్డు, 100 మిల్లీ లీటర్ల పాలు ఇవ్వబోతున్నాం. అదే వైయస్ఆర్ సంపూర్ణ ప్లస్ అయితే బాలామృతం చేసిన లడ్డూ, కేక్ 50 గ్రాములు, ప్రతిరోజూ కోడిగుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలు ఇవ్వడం జరుగుతుంది.
కోవిడ్ సమయంలో ఇబ్బందులు ఉన్నా కూడా.. రావాల్సిన నిధులు రాకపోయినప్పటికీ.. గత పాలకులు చేసిన అప్పులు, వాటిపై వడ్డీలు భారంగా ఉన్నా కూడా వాటిని అధిగమిస్తూ.. ఈ కార్యక్రమం వల్ల మంచి జరుగుతుందని భావిస్తూ.. అక్కచెల్లెమ్మలకు అన్నగా, పిల్లలకు మామగా.. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం’. అని సీఎం వైయస్ జగన్ అన్నారు.