సమర్థవంతంగా విధుల నిర్వహణ ఫలితం ఎంతో ఆత్మ సంతృప్తి-ఈ ఓ
శ్రీశైల దేవస్థానం: సమర్థవంతంగా విధుల నిర్వహణ ఫలితం ఎంతో ఆత్మ సంతృప్తి అని శ్రీశైల దేవస్థానం ఈ ఓ అన్నారు. ఈరోజు 31 న పదవీ విరమణ చేసిన పి. కోదండరామిరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ కు దేవస్థానం ఆత్మీయ సత్కారాన్ని నిర్వహించింది. ఆలయ ప్రాంగణములోని అక్కమహాదేవి అలంకార మండపములో ఈ సత్కార కార్యక్రమం ఏర్పాటు చేసారు.ఈ సత్కారం సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ కోదండరామిరెడ్డి ఎంతో నిబద్ధతతో విధులు నిర్వహించారన్నారు. వారు తన విధినిర్వహణలో ప్రతిపనిని కూడా స్వంత బాధ్యతగా భావించి నిర్వర్తిన్చారన్నారు. ఆలయాలలో విధులు నిర్వహించే ఉద్యోగులకు అటు భగవంతుడిని, ఇటు భక్తులను సేవించుకునే అవకాశం ఉంటుందని, ఇది ఎంతో అరుదైన అవకాశమని అన్నారు. ప్రతి ఉద్యోగి కూడా తన విధుల పట్ల సకారాత్మక దృక్పధాన్ని కలిగి ఉండాలని, అప్పుడే అంకిత భావంతో విధులు నిర్వహించగలరన్నారు. ప్రతి ఉద్యోగికి కూడా ఉద్యోగంలో చేరిన మొదటిరోజు నుండే పనితనాన్ని పెంపొందించుకుంటూ పదవీ విరమణ చేసే రోజు వరకు కూడా సమర్థవంతంగా విధులను నిర్వర్తించాలన్నారు. సమర్థవంతంగా విధులు నిర్వహించడం వలన ప్రతిఒక్కరికి కూడా ఎంతో ఆత్మ సంతృప్తి కలుగుతుందన్నారు. తరువాత పలువురు అధికారులు ప్రసంగిస్తూ కోదండరామిరెడ్డి చేసిన సేవలను కొనియాడారు.
కోదండరామిరెడ్డి ప్రసంగిస్తూ శ్రీశైలదేవస్థానములో అసిస్టెంట్ కమిషనర్ గా విధులు నిర్వహించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కోదండరామిరెడ్డి 1987లో దేవదాయశాఖలో గుంటూరు డిప్యూటీకమిషనర్ కార్యాలయములో స్టేనోగా నియమాకం పొంది 1999లో సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందారు. అనంతరం 2003లో పర్యవేక్షకునిగా పదోన్నతి పొంది, గుంటూరు జిల్లా ఇనుమెళ్ల సముదాయ ఆలయాల కార్యనిర్వహణాధికారిగా ( పర్యవేక్షకుని హోదాలో గ్రేడ్ – 1 ఈఓగా) విధులు నిర్వర్తించారు. తరువాత పెదకాకాని ఆలయములో పర్యవేక్షకులుగా విధులు నిర్వహించారు.ఆ తరువాత 2009లో అసిస్టెంట్ కమిషనర్ గా పదోన్నతి పొంది, శ్రీకాళహస్తి ఆలయములో అసిస్టెంట్ కమిషనర్ (సహాయ కార్యనిర్వహణాధికారిగా విధులు)గాను, నెల్లూరు నగరములో రాజరాజేశ్వరీదేవి ఆలయ కార్యనిర్వహణాధికారిగా, ఆ తరువాత ప్రకాశం జిల్లా, సింగరకొండ దేవస్థానం (ఆంజనేయస్వామి) కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వర్తిస్తూ, 2019లో బదలీపై శ్రీశైలదేవస్థానములో అసిస్టెంట్ కమిషనర్ (సహాయ కార్యనిర్వహణాధికారిగా)గా నియమితులయ్యారు. కార్యక్రమం చివరిలో కోదండరామిరెడ్డి దంపతులకు స్వామివార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞాపిక అందించారు.
Post Comment