సమన్వయంతో  తగు జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా వ్యాప్తిని అరికట్టాలి-శ్రీశైల దేవస్థానం ఈ ఓ

 శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థాన విభాగాధికారులు, సిబ్బంది అందరూ సమన్వయంతో  తగు జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా వ్యాప్తిని అరికట్టాలని దేవస్థాన కార్యనిర్వహణాధికారి సూచించారుశ్రీశైల క్షేత్ర పరిధిలో కరోనా నివారణ చర్యలపై కార్యనిర్వహణాధికారి  ఈ రోజు 15న  దేవస్థాన అన్ని విభాగాల యూనిట్ అధికారులు,  పర్యవేక్షకులతో దూరశ్రవణ సమావేశం ( టెలికాన్ఫరెన్స్ ) ద్వారా సమీక్షించారు.ఈ టెలీకాన్ఫరెన్స్ లో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డా. సోమశేఖర్, దేవస్థాన వైద్యులు, దేవస్థాన పారిశుద్ధ్య, వైద్యవిభాగాల సిబ్బంది పాల్గొన్నారు. కార్యనిర్వహణాధికారి  మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా నిర్ధారణ అయినవారితో ఇటీవల కలసినవారిని ( పైమరీ కాంటాక్టులు , సెకండరీ కాంటాక్టులు) గుర్తించి, వారికి కరోనా పరీక్షలు నిర్వహించాలని స్థానిక ప్రాథమిక ఆరోగ్య వైద్యులను కోరారు. కరోనా పరీక్షలు చేయించుకునేవారు ఫలితాలు వచ్చేంతవరకు బయటకు రాకుండా ఇంట్లోనే వుండాలని సూచించారు.ఇంకా వారు మాట్లాడుతూ ఇప్పటికే కరోనా నిర్ధారణ జరిగి  హోమ్ క్వారంటైన్లో  ఉన్నవారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వైద్యచికిత్సలు అందజేస్తుండాలని అన్నారు.దేవస్థాన అన్నివిభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారితో ప్రతిరోజూ ఫోనులో మాట్లాడుతూ, వారి ఆరోగ్యపరిస్థితులను గురించి విచారిస్తుండాలన్నారు.  వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తుండాలన్నారు.కరోనా నిర్ధారణ అయినవారి ఇళ్ళ పరిసరాలను పూర్తిస్థాయిలో శానిటైజేషన్ చేస్తుండాలని దేవస్థాన పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు.

విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది అంతా తప్పనిసరిగా ముఖానికి మాస్కు, చేతికి తొడుగు ( హ్యాండ్ గెస్) ధరించి విధులను నిర్వహించాలన్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవాలని సూచించారు. ఇందుకు అవసరమైన శానిటైజర్లు సబ్బునీటిని సిబ్బందికి అందుబాటులో ఉంచాలని పారిశుద్ధ్య విభాగపు పర్యవేక్షకులను కార్యనిర్వహణాధికారి ఆదేశించారు. 

 ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డా. సోమశేఖర్ మాట్లాడుతూ స్థానిక ఆశా ఉద్యోగులు, వాలంటీర్లు సహకారముతో అవసరమైన వారందరికీ వైద్యసేవలను అందించడం ,తగిన జాగ్రత్తలను పాటించడం ద్వారా మాత్రమే కరోనాను నివారించగలమని, అందుకే స్థానికులందరూ కూడా స్వీయనియత్రణను పాటిస్తూ, కరోనా నివారణలో ప్రభుత్వశాఖలకు, దేవస్థానానికి సహకరించాలని స్థానికులను కోరారు.హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారు ఎట్టిపరిస్థితులలో కూడా ఇంటినుండి వెలుపలకు రాకూడదని, వారికి ఏ ఇబ్బంది వచ్చినా ఫోను ద్వారా దేవస్థాన అధికారులను సంప్రదించాలని సూచించారు.ప్రతి ఒక్కరు కూడా ఏమాత్రము నిర్లక్ష్యం వహించకుండా అవసరమైన జాగ్రత్తలను తీసుకోవాలన్నారు.ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవడం, ముఖానికి మాస్కు ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం మొదలైన జాగ్రత్తలను అందరు పాటిస్తుండాలని సూచించారు. అందరూ కూడా ఆహారములో పప్పుదినుసులు,, తాజా కూరగాయలు, పండ్లు వంటి బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. దీనివలన రోగనిరోధకశక్తి పెరుగుతుందన్నారు.అదేవిధంగా వంటకాలలో అల్లం, నిమ్మకాయలు మొదలైనవాటిని వినియోగిస్తుండాలని సూచించారు.

| పరామర్శ :

ఇటీవల కోవిడ్ నిర్ధారణ  అయి , హోమ్ క్వారంటైన్ లో  వున్న దేవస్థాన వైద్యశాల వైద్యుణ్ని కార్యనిర్వహణాధికారి  ఫోనులో మాట్లాడి వారి ఆరోగ్యాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా  మాట్లాడుతూ కోవిడ్ బాధితులందరికీ  దేవస్థానం పూర్తి సహాయ సహకారాలను అందజేస్తుందన్నారు.ఎవ్వరు కూడా అపోహాలకు లోనుకాకుండా, మానసిక ధైర్యముతో ఉండాలన్నారు.

| శ్రీ సాక్షిగణపతి స్వామికి విశేష అభిషేకం:

లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు  ఉదయం సాక్షిగణపతిస్వామి వారికి విశేష అభిషేకాన్ని నిర్వహించింది.కాగా ప్రతి బుధవారం, సంకటహరచవితిరోజులు,  పౌర్ణమిరోజులలో శ్రీ సాక్షిగణపతి వారికి ఈ విశేష అభిషేకం, పూజాదికాలు దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) నిర్వహిస్తారు.ఈ ఉదయం సాక్షిగణపతిస్వామివారికి పంచామృతాలతోనూ, పలు ఫలోదకాలతోనూ, హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోదకం, శుద్ధజలంతో అభిషేకం నిర్వహించింది. తరువాత స్వామి వారికి విశేష పుష్పార్చన, నివేదన కార్యక్రమాలు జరిగాయి.వైదిక సంప్రదాయాలలో గణపతి అభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని, ఈ గణపతి అభిషేకం వలన అనుకున్న పనులలో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుందని చెప్పబడుతోంది.  కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయని, ముఖ్యంగా విద్యార్థులలో ఆలోచనా శక్తి పెరిగి విద్య బాగా వస్తుందని ప్రతీతి. అర్చకస్వాములు భౌతిక దూరాన్ని పాటిస్తూ ఏకాంతంగా శ్రీసాక్షిగణపతివారికి విశేషార్చనలు జరిపించారు.

వీరభద్రస్వామికి విశేష పూజలు:

లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు  సాయంకాలం ఆలయ ప్రాంగణంలోని వీరభద్రస్వామివారికి (జ్వాలావీరభద్రస్వామివారికి) విశేషపూజలను నిర్వహించారు.ఆలయప్రాంగణంలో మల్లికార్జునస్వామివారి ఆలయానికి ఉత్తరభాగంలో మల్లికా గుండానికి ప్రక్కనే ఉన్న వీరభద్రస్వామి జ్వాలామకుటంతో పదిచేతులతో విశిష్ట రూపంలో దర్శనమిస్తాడు. శిల్పశాస్త్ర పరిభాషలో ఈ స్వామికి అమరవీరభద్రమూర్తి అని పేరు కూడా ఉంది. స్వామివారికి ప్రక్కనే దక్షప్రజాపతి కనిపిస్తాడు. ఈ స్వామిని పరివార ఆలయాలలో భాగంగా ప్రతినిత్యం పూజిస్తారు. ప్రతి బుధవారం ప్రదోషకాలంలో విశేష అభిషేకం కార్యక్రమం దేవస్థానం నిర్వహిస్తోంది.ఈ పూజవలన లోకశాంతి, దుర్భిక్షనివారణ, భక్తుల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా క్షే అభివృద్ధి జరుగుతుంది.కాగా ఈ పూజలలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజను జరిపారు.తరువాత వీరభద్రస్వామికి పంచామృతాలతోనూ, పలురకాల ఫలోదకాలతోనూ, గంధోదకం, భస్మోదకం, పుష్పోదకం, బిల్వోదకం, హరిద్రోదకంతోనూ, మల్లికా గుండంలోని శుద్ధజలంతో విశేష అభిషేకం జరిపారు.

ప్రస్తుతం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆలయములో దర్శనాలు పూర్తిగా నిలుపుదల చేసారు. కారణంగా  అర్చకస్వాములు భౌతికదూరాన్ని పాటిస్తూ ఏకాంతంగా వీరభద్రదస్వామివారికి విశేషార్చనలు జరిపించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.