ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానంలో శాస్తోక్తంగా ఉచిత సామూహిక లక్షకుంకుమార్చన
శ్రీశైలం: ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానంలో ఈ రోజు (09.03.2020) సాయంత్రం అమ్మవారి ఆలయప్రాంగణంలో శాస్తోక్తంగా ఉచిత సామూహిక లక్షకుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు.
కాగా ప్రతి నెలలోనూ పౌర్ణమిరోజున దేవస్థానం సేవగా ఈ లక్షకుంకుమార్చనను జరిపించడం జరుగుతోంది. గతములో అర్చకస్వాములు, వేదపండితులు అమ్మవారి ఆలయముఖమండపంలో ఈ లక్షకుంకుమార్చనను చేయడం జరుగుతుండేది.
కాగా మొట్టమొదటిసారిగా ఈ రోజు (09.03.2020) అమ్మవారి ముఖమండపంలో జరిగిన కుంకుమార్చనతో పాటు, అమ్మవారి ఆలయప్రాంగణములో కూడా ఈ కుంకుమార్చనను సామూహికంగా జరిపించారు.
ఎప్పటిలాగే ముఖమండపంలో అర్చకస్వాములు, వేదపండితులు కుంకుమార్చన జరిపిస్తుండగా, ఆలయ ప్రాంగణములో స్థానిక ముత్తెదవులతో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన పలువురు యాత్రికులు కూడా పాల్గొన్నారు.
కార్యక్రమములో దేవస్థాన ఆగమపాఠశాల విద్యార్థులతో పాటు స్థానిక కంచి మఠ, శ్రీదేవీ వేద విద్యాలయ, కరివేనసత్ర వేదాగమ పాఠశాలల విద్యార్థులు కూడా పాల్గొన్నారు.
కాగా భక్తులలో భక్తిభావాలను పెంపొందించి వారిలో ఆధ్యాత్మిక చింతనను కలిగించాలని మరియు ధర్మప్రచారంలో భాగంగా ఈ దేవస్థాన సేవలో భక్తులకు కూడా ఉచితంగా పాల్గొనే అవకాశం కూడా కల్పించడం జరిగింది.
ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ అమ్మవారి కుంకుమార్చనలో వారికి కూడా అవకాశం కల్పించడం పట్ల ఎంతో హర్షం వ్యక్తం చేశారు.
అష్టాదశశక్తిపీఠాలలో ఒకరైన అమ్మవారి సన్నిధిలో ఎంతో పర్వదినంగా భావించబడే పౌర్ణమి రోజున కుంకుమార్చన జరిపించుకునే అవకాశం లభించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.