విశాఖ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి అవసరం -విజయసాయి

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ను హరితాంధ్రప్రదేశ్‌గా మార్చుకుందామని, ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటాలన్నది ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ లక్ష్యమని, అందుకు అందరం కలిసి కృషిచేద్దామన్నారు. విశాఖలో ప్రగతి భారతి ఫౌండేషన్‌ ప్రారంభోత్సవంలో ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు.  ప్రగతి భారతి ట్రస్టు బోర్డు సభ్యులుగా అప్పలరాజ వర్మ, ఉమేష్, జాస్తి బాలాజీ, మల్లికార్జునుడు, మావూరి వెంకటరమణ, గోపినాథ్‌రెడ్డి, రాజబాబు ఉన్నారని, అందరం కలిసి మహత్తరమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని ఎంపీ అన్నారు.

తెలంగాణ ఎంపీ సంతోష్‌ గ్రీన్‌ చాలెంజ్‌ అనే కార్యక్రమం ద్వారా ఇక్కడకు ప్రత్యేక రిప్రజెంట్‌ను పంపించి చాలెంజ్‌ విసిరారని, ఆంధ్రప్రదేశ్‌ను హరితాంధ్రప్రదేశ్‌గా చేసుకోవాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఒక మనిషి మూడు మొక్కలు నాటితే.. మనిషి జీవితకాలం కావాల్సిన ఆక్సిజన్‌ను ఆ మూడు మొక్కలు అందిస్తాయని చెప్పారు.
విశాఖలో పొల్యూషన్‌ కంట్రోల్‌ చేయాల్సిన బాధ్యత నగరంలోని ప్రజలందరిదని  అన్నారు. యూనిటీ  అనే పదానికి విశాఖ నిర్వచనమని చెప్పారు.

సంప్రదాయాలు, విలువలు, ఆధునికత ప్రతిబింబించే ఈ విశాఖ ఎందరో మహానుభావులకు పట్టినిల్లు అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. 1926వ సంవత్సరంలో విశాఖలో తొలి విశ్వవిద్యాలయం ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం విశాఖ జనాభా 20 లక్షలు, మెట్రోపాలిటన్‌ ప్రాంతాన్ని కూడా కలుపుకుంటే 53 లక్షలు ఉంటుందని, అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో దేశంలోనే 9వ నగరంగా, జీడీపీ పరంగా దేశంలో 8వ స్థానంలో ఉందన్నారు. ప్రతి ఒక్కరం విశాఖ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని, దానికి ప్రగతి భారత్‌ ట్రస్టు, అధికారులు ప్రతి ఒక్కరూ సహాయ, సహకారాలు అందిస్తారన్నారు.

print

Post Comment

You May Have Missed